-జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ గద్దె అనురాధ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కార్తీక మాసం పర్వదినాలను పురస్కరించుకొని అయ్యప్ప, భవాని, శివమాలాదారులకు అన్నదానం చేయటం మంచి సాంప్రదాయమని జిల్లా పరిషత్ మాజీ చైర్ పర్సన్ గద్దె అనురాధ తెలిపారు. గత 45 రోజుల నుంచి అయ్యప్ప నగర్ లో శ్రీ అయ్యప్ప భక్త బృందం వారి నేతృత్వంలో అయ్యప్పలకు నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమంలో భాగంగా శుక్రవారం నాడు అన్నదాన కార్యక్రమానికి ఎమ్మెల్యే గద్దె రామమోహన్ కుటుంబ సభ్యులు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ గద్దె అనురాధ, యువ నాయకులు గద్దె క్రాంతి కుమార్ హాజరై పూజా కార్యక్రమాలు నిర్వహించి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం అన్నదాన కార్యక్రమానికి సేవ చేసిన వారికి కమిటీ వారు అందించిన నూతన వస్త్రాలను గద్దె అనురాధ చేతుల మీదుగా అందజేశారు.
ఈ సందర్భంగా గద్దె అనురాధ మాట్లాడుతూ అయ్యప్ప నగర్ అనే పేరును సార్ధకం చేస్తూ గత 21 సంవత్సరాల నుంచి అయ్యప్ప భజనలు నిర్వహించడం అభినందనీయమన్నారు. అలాగే ఐదు సంవత్సరాల నుంచి అయ్యప్ప దీక్ష తీసుకున్న వారికి పెద్ద ఎత్తున అన్నదానం చేస్తున్న కమిటీ వారిని కాలనీ వారిని గద్దె అనురాధ అభినందించారు. సనాతన ధర్మాన్ని కాపాడుతూ ఎవరి మతాన్ని వారు అనుసరిస్తూ పరమతాలను గౌరవిస్తూ ముందుకు సాగటం మన భారతదేశ గొప్పతనం అన్నారు.
యువ నాయకులు గద్దె క్రాంతికుమార్ మాట్లాడుతూ 45 రోజులుగా ఇక్కడ అన్నదానాలు జరుగుతున్నాయని, ఆఖరి రోజు అయిన నేడు జరిగిన అన్నదానానికి తమ కుటుంబం దాతలుగా ఉండటం తమకు సంతోషంగా ఉందన్నారు. అయ్యప్ప నగర్ లో జరిగే అన్నదానాలకు దాతలు సహకారాలతో పాటు ఎంతోమంది భక్తులు స్వచ్ఛందంగా సేవలు చేస్తూ అన్నదాన కార్యక్రమాన్ని జయప్రదం చేయటం జరిగిందని ఇటువంటి కార్యక్రమాలు సమాజంలో భావితరాలకు మంచి విలువలను పెంపొందిస్తాయన్నారు. అయ్యప్ప దీక్షలు అంటే కేవలం భక్తి పరంగానే కాకుండా చక్కటి ఆరోగ్య సూత్రం అన్నారు.
ఈ కార్యక్రమంలో కమిటీ నిర్వాహకులు శాయన సత్యనారాయణ, గద్దె హేమాన్స్, డోకుపర్తి ఉమామహేశ్వరరావు, డోకుపర్తి యుగంధర్, జోగి వెంకటేశ్వరరావు, లక్ష్మీనారాయణ, జక్కుల సుబ్బారావు, చలసాని రమణ తదితరులు ఉన్నారు.