-ఇంధన పొదుపులో చిత్తశుద్ధితో పనిచేస్తున్న రాష్ట్రం
-ఇంధన సంరక్షణను చిన్నారులకు అలవాటుగా మార్చడంపై దృష్టి
-ప్రజల్లో అవగాహన పెంచేందుకు ప్రసార మాధ్యమాల్లో ప్రకటనలు
-బీఈఈ మద్దతుతో ఇంధన సామర్థ్య కార్యక్రమాల అమలు
హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త :
వాతావరణ మార్పులను సమర్ధంగా ఎదుర్కోవడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ‘బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ (బీఈఈ)’ పిలుపునిచ్చింది. ఈ విషయంలో జాతీయ స్థాయిలో ఉద్యమంలా పనిచేయాలని, అన్ని భాగస్వామ్య పక్షాలు కలిసికట్టుగా ముందుకు సాగాలని పేర్కొంది. ప్రభుత్వాలు, పరిశ్రమలు, వ్యక్తులు.. ఇలా అన్ని వర్గాలు ఐక్యంగా పనిచేయాలని సూచించింది. అప్పుడే రోజురోజుకీ పెరిగిపోతున్న గ్రీన్ హౌస్ ఉద్గారాలు, అడవుల నరికివేత, కాలుష్యాన్ని ఎదుర్కోవడం సాధ్యమవుతుందని తెలిపింది. పారిస్ ఒప్పందానికి అనుగుణంగా ప్రపంచ ఉష్ణోగ్రతల పెరుగుదలను 1.5 డిగ్రీల సెల్సియస్కి పరిమితం చేయాల్సిన అవసరం ఉందని నిపుణులు స్పష్టం చేశారు. మొత్తం గ్రీన్ హౌస్ ఉద్గారాల్లో ఇంధన రంగానిదే దాదాపు 75శాతం వాటా ఉన్నందున.. వాతావరణ మార్పుల వల్ల కలిగే దుష్ప్రభావాలను తగ్గించడానికి స్వచ్ఛ ఇంధనానికి మారడం, ఇంధన సామర్థ్యాన్ని పెంపొందించడం, సమర్ధ నీటి నిర్వహణ, అడవుల పెంపకం వంటి కీలక కార్యక్రమాలు చేపట్టాల్సి ఉంటుందని తెలిపారు.
ఈ నెల 14 నుంచి 20వ తేదీ వరకు జాతీయ ఇంధన పరిరక్షణ వారోత్సవం సందర్భంగా బీఈఈ దక్షిణాది రాష్ట్రాల మీడియా సలహాదారు ఎ.చంద్రశేఖరరెడ్డి, తెలంగాణ రెడ్కో ఎండీ వి.అనీలతో కలిసి రాష్ట్ర ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శిసందీప్ కుమార్ సుల్తానియాను కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణలో ఇంధన సామర్థ్య కార్యక్రమాలను తోడ్పాటునందిస్తున్న బీఈఈ, ఈఈఎస్ఎల్ లకు సుల్తానియా ధన్యవాదాలు తెలిపారు. పర్యావరణ పరిరక్షణ, హరిత ఇంధనం, ఇంధన సామర్థ్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోంది చెప్పారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి మార్గదర్శనం, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నిరంతర పర్యవేక్షణలో రాష్ట్ర ప్రజలకు నాణ్య మైన విద్యుత్తును నిరంతరాయంగా సరఫరా చేసేందుకు విద్యుత్తు శాఖ ప్రాధాన్యమిస్తోందని తెలిపారు. మరోవైపు పరిశ్రమలకు అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యుత్తు సరఫరా చేయడంపై ప్రత్యేకంగా దృష్టి సారించామని.. తద్వారా పెట్టుబడులు పెరిగి ఉద్యోగాల కల్పన, ఆర్థిక అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు. కేంద్ర విద్యుత్తు శాఖ, ఎంఎస్ఆర్ మద్దతుతో, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా 2030 కల్లా 20 గిగావాట్ల పునరుత్పాదక ఇంధనం, 2035 కల్లా 40 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు వివరించారు. ఇక విద్యార్థులకు ఇంధనసంరక్షణను అలవాటుగా మార్చేందుకు గాను బీఈఈ ఆర్థిక సాయంతో రాష్ట్ర ఇంధన శాఖ తెలంగాణలో 165 ఇంధన క్లబ్బులను ఏర్పాటు చేసినట్లు సుల్తానియా చెప్పారు. అలాగే స్వయం సహాయక మహిళా సంఘాలు, టీజీరెడ్కో ద్వారా ఇందన సామర్థ్యం, సంరక్షణలో సుస్ధిరత సాధించడంపై ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు వివరించారు.
వాతావరణ మార్పులను ఎదుర్కోవడంలో 40 శాతం భాగస్వామ్యం కలిగిన ఇంధన సామర్థ్య రంగానికి రాష్ట్ర ప్రభుత్వం ఎనలేని ప్రాధాన్యం ఇస్తోందని.. ఇంధన సంరక్షణ క్యాలెండర్ 2025 విడుదల కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాల్గొనడమే దీనికి నిదర్శనమని సుల్తానియా తెలిపారు. బీఈఈ మద్దతుతో రాష్ట్రంలో అమలు చేస్తున్న పలు ఇంధన సామర్థ్య కార్యక్రమాలను టీజీరెడ్కో అధికారులు వివరించారు. వాటిలో కొన్ని..
1.ఇంధన సామర్థ్య ఆర్థిక కమిటీ
ఇంధన సామర్థ్య ప్రాజెక్టుల అమలు కోసం ‘ఎనర్జీ ఎఫిషియన్సీ ఫైనాన్సింగ్ ప్లాట్ ఫాం (ఈఈఎఫ్పీ) ని ఏర్పాటు చేశారు. దీన్ని నేషనల్ మిషన్ ఫర్ ఎన్హాన్స్ ఎనర్జీ ఎఫిషియన్సీ (ఎన్ఎంఈఈఈ) కింద ఏర్పాటు చేశారు. ఆర్థిక సంస్థలు, ప్రాజెక్టు డెవలపర్స్ తో కలిసి పనిచేసేందుకు వేదికగా ఈఈఎఫ్సీని రూపొందించారు. రాష్ట్రంలోని 8 ప్రముఖ ఆర్థిక సంస్థల (బ్యాంకులు, ఎన్బీఎఫ్సీ) తో ‘కమిటీ ఆఫ్ ఫైనాన్షియల్ ఇనిస్టిట్యూషన్స్ ఫర్ ఎనర్జీ ఎఫిషియన్సీ ఫైనాన్సింగ్ ‘ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలో ఇటీవల బీజిరెడ్కో ఆధ్వర్యంలో రెండు ఇన్వెస్ట్మెంట్ బజార్ కార్యక్రమాలను ఏర్పాటు చేశారు.
2. తెలంగాణలో ఇంధన సామర్థ్యం, సంరక్షణ ప్రోత్సాహంపై మీడియాలో ప్రచారం
3. ప్రజల్లో ఇంధన సంరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఆలిండియా రేడియోలో ప్రకటనలు
4. ఎలక్ట్రిక్ వెహికల్ (ఈవీ), బీఈఈ స్టార్ రేటెడ్ ఉపకరణాలపై వివిధ టీవీ చానెళ్లలో ప్రకటనలు
5. ఇంధన పొదుపు చిట్కాలు, ఇంధన సంరక్షణ కార్యక్రమాలపై మెట్రో రైళ్లలో ప్రచారం.