-తుమ్మలపల్లి కళాక్షేత్రంలో పొట్టి శ్రీరాములు ఆత్మార్పణం దినం
-తెలుగు వారికి నిత్య చిరస్మరణీయుడు పొట్టి శ్రీరాములు
-పొట్టి శ్రీరాములు, సర్ధార్ వల్లభాయ్ పటేల్ కి నివాళులు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్ర రాష్ట్రం అవతరణ కోసం ఆత్మ బలిదానం చేసిన త్యాగధనుడు, భాషాప్రయుక్త రాష్ట్రానికి ఆద్యుడు అమరజీవి పొట్టి శ్రీరాములు స్పూర్తితో రాష్ట్ర సర్వతో ముఖాభివృద్దితో పాటు స్వర్ణాంధ్ర @2047 విజన్ డాక్యుమెంట్ లక్ష్య సాధనకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అకుంఠిత దీక్షతో ముందుకు సాగుతున్నారని విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ అన్నారు. పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అధికారంగా విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం లో అమరజీవి పొట్టి శ్రీరాములు గారి ఆత్మార్పణం-భాషా ప్రయుక్త రాష్ట్రాల ఆవిర్భావం కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రులు అచ్చెన్ననాయుడు, కొలుసుపార్థసారధి, నారాయణ, ఎమ్మెల్యేలు విప్ బొండా ఉమామహేశ్వరరావు,శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య), యార్లగడ్డ వెంకట్రావు, ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండీ రాకేష్ లతో పాటు కలిసి ఎంపి కేశినేని శివనాథ్ స్వాగతం పలికారు.
ఈ సభా ప్రారంభానికి ముందుగా అందరూ పొట్టి శ్రీరాములు విగ్రహం, సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి ఘన నివాళులర్పించారు. ఈ సందర్బంగా ఎంపి కేశినేని శివనాథ్ మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు వర్ధంతి కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ధన్యవాదాలు తెలియజేశారు. ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు కోసం తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఆమరణ నిరాహార దీక్ష చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు తెలుగు వారికి నిత్య చిరస్మరణీయుడన్నారు. పొట్టి శ్రీరాములు ఆనాడు పూనుకోకపోతే , మనకి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడేది కాదన్నారు. పొట్టి శ్రీరాములు గారి త్యాగం వెలకట్టలేనిదని పేర్కొన్నారు.
ఆంధ్రులు ఆరంభ సూరులు అన్న ఆనాటి మద్రాసు ముఖ్యమంత్రి రాజాజీ అపనిందను, హేళనలకు బాధపడి 1952 లో మద్రాసు నగరంలో బులుసు సాంబమూర్తి గారి ఇంటిలో ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం శ్రీరాములు ఆమరణ నిరాహారదీక్షకు పూనుకుని ఆంధ్రుల ఉద్యమ శక్తి, పట్టదల, సంకల్ప దీక్ష దశదిశలా చాటిచెప్పిన గాంధేయవాది పొట్టి శ్రీరాములంటూ ఆయన త్యాగనీరతిని కొనియాడారు.
అదే విధంగా ఒక స్పూర్తితో ,సంకల్ప దీక్షతో తెలుగు జాతి కోసం, ఎన్ని అవాంతరాలు ఎదురైనా, ఎన్ని కష్టాలు అయినా భరించి రాష్ట్రాభివృద్ది కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రమిస్తున్నాడన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు రూపకల్పన చేసిన విజన్ 2020 ఫలాలను అందుకున్న లక్షల మందిలో తాను ఒక్కడినని తెలిపారు. రాబోయే కాలంలో మన బిడ్డల భవిష్యత్తు కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రూపకల్పన స్వర్ణాంధ్ర @2047 విజన్ డాక్యుమెంట్ లక్ష్య సాధనకు మనందరం కలిసికట్టుగా ఐక్యతతో కృషి చేద్దామని ఎంపి కేశినేని శివనాథ్ పిలుపునిచ్చారు.