-ఆయన ఒక జాతి నాయకుడు కాదు… ఆంధ్ర జాతికి నాయకుడు
-తుమ్మలపల్లి కళాక్షేత్రంలో పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ దినం కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
‘ఆంధ్రుల చిరకాల స్వప్నమైన ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసి ఆత్మార్పణగావించిన అమరజీవి పొట్టి శ్రీరాములు. మనందరికీ చిరస్మరణీయుడు. భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు కారణభూతుడు. ఆయన ఒక కులానికో, జాతికో నాయకుడు కాదు…ఆంధ్ర జాతికి నాయకుడ’ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. దేశం కోసం బతికిన పొట్టి శ్రీరాములు లాంటి నాయకులను స్మరించుకోవడం మనందరి బాధ్యత అన్నారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం అన్ని రంగాల్లో సర్వతోముఖాభివృద్ధి సాధించి 2.2 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా పురోగతి సాధించడమే ఆయనకు మనం ఇచ్చే నిజమైన నివాళి అని చెప్పారు. పొట్టి శ్రీరాములు వర్థంతిని పురస్కరించుకొని ఆదివారం ఉదయం తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘అమరజీవి పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ దినం’ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ముందుగా పొట్టి శ్రీరాములు కి , భారత తొలి ఉప ప్రధాని సర్ధార్ వల్లభ్ భాయ్ పటేల్ చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పొట్టి శ్రీరాములు ఆత్మార్పణపై రూపొందించిన పుస్తకాన్ని విడుదల చేశారు. డాక్యుమెంటరీని ప్రదర్శించారు.
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ… “ఎవరైతే మనకోసం త్యాగాలు చేశారో అటువంటి మహనీయుల త్యాగాలను స్మరించుకోవడం కోసం వర్దంతి, జయంతి కార్యక్రమాలు చేయాలి. ఇలాంటివి చేయడం వల్ల భవిష్యత్తు తరాలకు వారి సేవలను తెలిసేలా చేయగలం. మనుషులకు మరుపు చాలా సహజం. ఇటువంటి కార్యక్రమాలు ద్వారా మహానీయుల త్యాగాలు గుర్తు చేసుకుంటాం. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు ఆమరణ దీక్ష చేసి ప్రాణాలు విడిచారు. ఆమరణ దీక్ష సమయంలో ఎంతో క్షోభ అనుభవించారు. కేవలం సమాజం కోసం, రాష్ట్రం కోసం, దేశం కోసం బతికిన వ్యక్తి పొట్టి శ్రీరాములు. రాష్ట్ర విభజన జరిగిన తరువాత ఆయన గొప్పతనం అర్థమైంది. ఆయన విగ్రహం వెతకాలంటే ఆర్య వైశ్య సమాజంలో తప్ప మరెక్కడ దొరకదు. ఆయన ఒక కులానికి, వర్గానికి కాదు… దేశం మొత్తం గర్వించే నాయకుడు.
తెలుగువారి ఉనికి కోసం ప్రాణత్యాగం చేశారు
ఒక వైపు మతప్రాతిపదికన అఖండ భారతం రెండు ముక్కలు అవ్వడంతో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటును ప్రధాని నెహ్రూ నేతృత్వంలోని నాటి జాతీయ నాయకత్వం వ్యతిరేకించింది. అయినా తెలుగువారి ఆత్మగౌరవం, ఉనికి కోసం పొట్టి శ్రీరాములు ఆమరణ దీక్ష చేపట్టి ప్రాణత్యాగం చేశారు. ఆయన చేసిన పోరాటం దేశాన్ని కదిలించింది. ఆయన బలిదానంతో రాష్ట్రం ఏర్పడింది. మన ఉనికి కోసం మద్రాసులో ఆమరణ దీక్ష చేసి ప్రాణ త్యాగం చేసిన పొట్టి శ్రీరాములు పాడె మోయడానికి కూడా ఆనాడు కష్టపడాల్సి వచ్చింది అని చదివి నా గుండె కదిలిపోయింది. ఘంటసాల గారు, మరో నలుగురు కలిసి పాడె మోశారు ఈ రోజు మనం ఆంధ్రులం అని గర్వంగా చెప్పుకుంటున్నాం అంటే అది ఆ మహనీయుడు బలిదానంతో పెట్టిన బిక్షే.
విజన్ 2047 ముందుకు తీసుకెళ్లేందుకు కంకణ బద్దులై ఉన్నాం
మన రాష్ట్ర ఏర్పాటు పొట్టి శ్రీరాములు బలిదానం మీద జరిగింది. తెలుగు వారి ఉనికి కోసం ఆయన ప్రాణత్యాగం చేశారు. కుటుంబం, ప్రాంతం వంటి పరిధులను దాటి ఆలోచిస్తేనే ఆయనలా మహానాయకుడిగా ఎదగుతాం. ఆంధ్రులకు ఒక రాష్ట్రం కావాలని పొట్టి శ్రీరాములు కలలు కంటే… తెలుగువారి ఆత్మగౌరవం కోసం నందమూరి తారకరామారావు పోరాడారు. ఒక రాజకీయ పార్టీని నడపటం చాలా కష్టం, 5 కోట్ల మంది కోసం ప్రభుత్వ విధానాలు రూపొందించడం ఇంకా కష్టం. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాలనను సమర్ధవంతంగా నడిపి ప్రజలకు చేరువ చేయడం గొప్ప విషయం. స్వర్ణాంధ్ర విజన్ 2047 డాక్యుమెంట్ ను రేయిబవళ్లు కష్టపడి, ఎందరో మేథావుల సలహాలు, సూచనలు తీసుకొని రూపొందించారు. 2047 విజన్ ద్వారా కుల మతాలకు అతీతంగా రాష్ట్రం అభివృద్ధి సాధిస్తుంది. సమర్థత ఉన్న ఎవరైనా దానిని అందిపుచ్చుకోవచ్చు.
విజన్ 2047ను విమర్శిస్తున్నవారు ఒకటే గుర్తుపెట్టుకోవాలి… ఆనాడు ఇలానే విజన్ 2020ను విమర్శించారు. హైదరాబాదులో రాళ్లు, రప్పలు ఉన్న ప్రాంతాలు ఇప్పుడు ఎలా ఉన్నాయో చూడాలి. తప్పకుండా ఏపీ అన్ని విధాలా అభివృద్ధి చెందుతుంది. చేయి చేయి కలిపి విజన్ 2047 ను ముందుకు తీసుకు వెళ్లేందుకు అందరం కంకణ బద్దులై ఉంటామ”న్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు పి.నారాయణ, అచ్చెన్నాయుడు, పార్థసారధి, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.