Breaking News

అమ‌ర‌జీవి ఆత్మార్ప‌ణ స్ఫూర్తితో సుప‌రిపాల‌న అందిస్తున్నాం..

-త్వ‌ర‌లోనే రాష్ట్రంలో పొట్టి శ్రీరాములు పేరుతో తెలుగు వ‌ర్సిటీని ఏర్పాటు చేస్తాం
-పొట్టి శ్రీరాములు 125వ జ‌యంతి కార్య‌క్ర‌మాలు ఘనంగా నిర్వ‌హిస్తాం
-అమ‌ర‌జీవి పుట్టిన ఊరితో పాటు అమ‌రావ‌తిలో స్మార‌కాన్ని అభివృద్ధి చేస్తాం
-ఇబ్బందులను అధిగ‌మిస్తూ ముందుకెళ్తున్నాం
-అత్యున్న‌త ప‌రిపాల‌నకు నాంది ప‌ల‌కాల‌నేది మా అభిమ‌తం
-ప్ర‌జ‌లంద‌రూ స‌హ‌క‌రించి గొప్ప ఆలోచ‌న‌లు చేయాలి
-సుస్థిర ప్ర‌భుత్వంతోనే నిరంత‌ర సంక్షేమం, అభివృద్ధి సాధ్యం
-పొట్టి శ్రీరాములు ఆత్మార్ప‌ణ దినం కార్య‌క్ర‌మంలో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు
-ఆత్మార్పణం పుస్తకం ఆవిష్కరించిన సీఎం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అమ‌ర‌జీవి శ్రీ పొట్టి శ్రీరాములు వంటి మ‌హ‌నీయుల స్ఫూర్తితో సుప‌రిపాల‌న అందిస్తున్నామ‌ని.. సుస్థిర ప్ర‌భుత్వంతోనే నిరంత‌ర సంక్షేమం, అభివృద్ధి సాధ్యమ‌ని రాష్ట్ర ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు అన్నారు. విజ‌య‌వాడ తుమ్మ‌ల‌ప‌ల్లి క‌ళాక్షేత్రంలో ఆదివారం జ‌రిగిన అమ‌ర‌జీవి శ్రీ పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ దినం ప్ర‌త్యేక కార్య‌క్ర‌మంలో ముఖ్య‌మంత్రి, ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్ పాల్గొని పొట్టి శ్రీరాములు విగ్ర‌హానికి పూల మాల‌లు వేసి ఘ‌న నివాళులు అర్పించారు. అదేవిధంగా స‌ర్దార్ వ‌ల్ల‌భాయ్ ప‌టేల్ వ‌ర్ధంతి సంద‌ర్భంగా ఆయ‌న చిత్ర‌ప‌టానికి పూల‌మాల‌లు వేసి నివాళులు అర్పించారు.
ఈ సంద‌ర్భంగా ముఖ్య‌మంత్రి మాట్లాడుతూ ప్ర‌తిరోజూ ఓ ముఖ్య‌మైన‌దే అయినా ఈరోజుకు ఓ ప్ర‌త్యేక‌త ఉందని.. తెలుగు ప్ర‌జ‌లు గ‌ర్వంగా చెప్పుకునే ఓ వ్య‌క్తి పొట్టి శ్రీరాములు అని పేర్కొన్నారు. చాలాకొద్ది మందే జాతికోసం ఆలోచిస్తార‌ని.. ఇదేకోవ‌లో తెలుగు జాతి కోసం ఆలోచించి, ప్ర‌త్యేక ఆంధ్ర‌రాష్ట్రాన్ని సాధించిన వ్య‌క్తి పొట్టి శ్రీరాములు అని కొనియాడారు. ఉద‌యం బ్రేక్‌ఫాస్ట్ చేసి మ‌ధ్యాహ్నం భోజ‌నం చేయ‌క‌పోతేనే త‌ట్టుకోలేం.. అలాంటిది 58 రోజుల‌పాటు నిరాహార దీక్ష చేసి, భ‌యంక‌ర ప‌రిస్థితుల మ‌ధ్య సంక‌ల్ప సిద్ధికోసం త్యాగం చేసిన ఏకైక నాయ‌కుడు పొట్టి శ్రీరాములు అని, అందుకే ఆయ‌న అమ‌ర‌జీవి అయ్యార‌న్నారు. ఓ వ్య‌క్తి త్యాగం భాషాప్ర‌యుక్త రాష్ట్రాల ఏర్పాటుకు కార‌ణ‌మైంది. ఇలాంటి నాయ‌కుల‌ను శాశ్వ‌తంగా గుర్తుంచుకోవాల్సిన అవ‌స‌ర‌ముంద‌ని భావించి.. ఈ స్ఫూర్తిని రాష్ట్రం మొత్తంమీద వ్యాప్తిచేయాల్సిన బాధ్య‌త ఉంద‌ని మొట్ట‌మొద‌ట చెప్పిన వ్య‌క్తి ప‌వ‌న్ క‌ళ్యాణ్‌గారు. తెలుగుజాతి కోసం ప్రాణాల‌ర్పించిన వ్య‌క్తి పొట్టి శ్రీరాములు అయితే దేశాన్ని ఐక‌మ‌త్యంగా ఉంచేందుకు పోరాడిన ఉక్కు మ‌నిషి స‌ర్దార్ వ‌ల్ల‌భాయ్ ప‌టేల్ అని వివ‌రించారు.

సామాజిక, మాన‌వ‌తా వాది.. పొట్టి శ్రీరాములు

తెలుగుజాతి అనేక‌సార్లు చాలా ఇబ్బందులు ప‌డింద‌ని, ఒక‌ప్పుడు ఏ ప‌నికావాల‌న్నా మ‌ద్రాస్ వెళ్లాల్సిన ప‌రిస్థితి ఉండేదని సీఎం ఆనాటి ప‌రిస్థితుల‌ను గుర్తుచేశారు. మొట్ట‌మొద‌టిగా గుంటూరులో యువ‌జ‌న న‌వ్య సాహితీ స‌మితి ఏర్ప‌డింద‌ని.. ఆ త‌ర్వాత వివిధ రూపాల్లో దాదాపు 50 ఏళ్ల పోరాటం త‌ర్వాత‌, పొట్టి శ్రీరాములు గారు ప్రాణ‌త్యాగం చేసిన త‌ర్వాత 1953లో తెలుగు రాష్ట్రం వ‌చ్చింద‌ని వివ‌రించారు. 1912లో గుంటూరు, కృష్ణా, గోదావ‌రి జిల్లాల్లో సంయుక్త స‌ద‌స్సు ఏర్పాటు చేశారు. నిడ‌ద‌వోలులో పెద్ద స‌మావేశం పెట్టారు. తెలుగుజాతికి ఒక రాష్ట్రం కావాల‌ని గ‌ట్టిగా అడిగారు. 1913లో ఆంధ్ర మ‌హాస‌భ పెట్టి బాప‌ట్ల‌లో నిన‌దించారు. ప‌ట్టాభి సీతారామ‌య్య‌గారు ఒక మాట అన్నారు.. మ‌న‌కు త‌మిళ మంత్రులు ప్ర‌త్యేక రాష్ట్రం ఇచ్చేలోపే బ్రిటిష్‌వారే స్వాతంత్ర్యం ఇస్తార‌ని. చివ‌రికి అదే జ‌రిగింది. 1948, మార్చిలో నాటి ప్ర‌ధాని జ‌వ‌హ‌ర్‌లాల్ నెహ్రూ విశాఖ‌కు రాగా ప్ర‌జ‌లు ప్ర‌త్యేక రాష్ట్రం కోసం నిర‌స‌న వ్య‌క్తంచేస్తే.. అదే ఏడాది జూన్ 17న ధార్ క‌మిష‌న్ వేశారు. ఆ త‌ర్వాత ప్ర‌త్యేక రాష్ట్రం అవ‌స‌రం లేద‌ని ఆ క‌మిష‌న్ నివేదిక ఇచ్చింది. ఇలా ర‌క‌ర‌కాల స‌మ‌స్య‌లు ఎదుర‌య్యాయి. చివ‌రికి పొట్టి శ్రీరాములు త్యాగం ఫ‌లితంగా తెలుగు జాతికి ప్ర‌త్యేక రాష్ట్రం వ‌చ్చింది. ఆయ‌న 1901, మార్చి 16న ఆనాటి మ‌ద్రాస్ ప్రెసిడెన్సీలోని ప‌డ‌మ‌టిప‌ల్లిలో జ‌న్మించార‌ని.. స్వాతంత్ర్యంతో పాటు సామాజిక ఉద్య‌మాల్లో పాల్గొని, షెడ్యూల్డు కులాల హ‌క్కుల కోసం కూడా పోరాడిన సామాజిక వాది, మాన‌వ‌తా వాది పొట్టి శ్రీరాములు అని వివ‌రించారు.

పొట్టి శ్రీరాములు త్యాగం, కొంద‌రు రాజ‌కీయ నాయ‌కుల రాజీనామాలతో ఉద్య‌మం తీవ్ర‌మై చివ‌ర‌కు 1952, డిసెంబ‌ర్ 19న ఆనాటి ప్ర‌ధాని నెహ్రూ దిగొచ్చి ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. ఇదీ చ‌రిత్ర‌. ఆ త‌ర్వాత రాజ‌ధాని ఏద‌నే దానిపై గంద‌రగోళం తలెత్తింది. ప్ర‌కాశం పంతులుగారు వంటివారు ఆలోచ‌న చేసి క‌ర్నూలు రాజ‌ధానిగా గుంటూరులో హైకోర్టు ఏర్పాటుచేస్తామ‌ని చెప్పి శ్రీబాగ్ ఒప్పందం చేసుకున్నారు. ఇలా తాత్కాలికంగా నిర్ణ‌యం తీసుకొని ముందుకెళ్లారు. ఆ త‌ర్వాత 11 జిల్లాల‌తో రాష్ట్రం ఏర్పాటు బిల్లు 1953, ఆగ‌స్టు 10న పార్ల‌మెంటు ఆమోదించింది. త‌ర్వాత 13 జిల్లాలు అయ్యాయి. 1953, అక్టోబ‌ర్ 1న క‌ర్నూలు రాజ‌ధానిగా పాల‌న ప్రారంభ‌మైంది. 1956, ఫిబ్ర‌వ‌రి 1న ఆనాటి ఉప ముఖ్య‌మంత్రి నీలం సంజీవ‌రెడ్డి గారు అసెంబ్లీలో విశాలాంధ్ర తీర్మానాన్ని ప్ర‌వేశ‌పెట్టారు. 1956, న‌వంబ‌ర్ 1న ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం ఏర్ప‌డి.. మొద‌టి ముఖ్య‌మంత్రిగా నీలం సంజీవ‌రెడ్డి ప్ర‌మాణం చేశారు. త‌ర్వాతికాలంలో 1969లో తెలంగాణ రాష్ట్ర ఉద్య‌మం, ఆపై ఇక్క‌డ జై ఆంధ్రా ఉద్య‌మం జ‌ర‌గ‌డం.. ఇలా అనేక ఉద్య‌మాలు జ‌రిగాయి. తెలుగువారంతా ఒక‌టే అని ఎన్‌టీ రామారావుగారు ముందుకెళ్లారు. తొలిసారిగా తెలుగువారంద‌రినీ గుర్తుంచుకునేలా హైద‌రాబాద్‌లో ట్యాంక్ బండ్‌పై విగ్ర‌హాలు పెట్టారు. పొట్టి శ్రీరాములు గారి త్యాగాన్ని స్మ‌రించుకుంటూ ఆయ‌న పేరుతో తెలుగు విశ్వ‌విద్యాల‌యాన్ని ఏర్పాటు చేశారు. నేను వ‌చ్చాక నెల్లూరు జిల్లాకు పొట్టి శ్రీరాములు జిల్లాగా నామ‌క‌ర‌ణం చేశామ‌ని సీఎం వివ‌రించారు.

మ‌హ‌నీయుల పోరాట స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్య‌త అంద‌రిపైనా ఉంది

పొట్టి శ్రీరాములు పుట్టిన ఊర్లో పెద్దఎత్తున కార్య‌క్ర‌మాలు చేప‌ట్టాల‌ని నిర్ణ‌యించామ‌ని, నీరు ఇవ్వ‌డంతో పాటు వంతెన వేయాల‌ని, హైస్కూల్ అభివృద్ధి చేయాల‌ని, ప్రాథ‌మిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేసి.. ప‌ద్ధ‌తి ప్ర‌కారం అన్ని ప‌నులూ చేసి ఒక మెమోరియ‌ల్ ఏర్పాటుకు ముందుకెళ్తే దాన్ని కూడా త‌ర్వాత వ‌చ్చిన ప్ర‌భుత్వం క్యాన్సిల్ చేసే ప‌రిస్థితికి వ‌చ్చారని సీఎం వెల్ల‌డించారు. త్వ‌ర‌లోనే పొట్టి శ్రీరాములు పేరుతో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో తెలుగు యూనివ‌ర్సిటీ ఏర్పాటు చేస్తామ‌ని హామీ ఇస్తున్నామ‌న్నారు. మ‌హ‌నీయులు చేసిన త్యాగాల‌ను గుర్తుపెట్టుకావాల్సిన అవ‌స‌రం ప్ర‌తిఒక్క‌రికీ ఉంద‌న్న ఆలోచ‌న‌తోనే ఇలాంటి మంచి కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తున్న‌ట్లు వివ‌రించారు. మ‌హ‌నీయుల పోరాట స్ఫూర్తిని, ఆశ‌యాల‌ను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్య‌త రాష్ట్రంలోని అయిదు కోట్ల 50 ల‌క్ష‌ల మందిపైనా ఉంద‌న్నారు. ఆర్థిక సంస్క‌ర‌ణ‌లు చేసి దేశానికి ద‌శ దిశ‌ను చూపించిన ఏకైక వ్య‌క్తి తెలుగుబిడ్డ పీవీ న‌ర‌సింహారావుగారు. ఇలాంటి గొప్ప‌వారి త్యాగాలంద‌రినీ గుర్తుపెట్టుకోవాల్సిన అవ‌స‌ర‌ముంది. ప్రాంతీయ పార్టీ పెట్టినా.. దేశాభివృద్ధి దృక్ప‌థంతో ముందుకెళ్లిన వ్య‌క్తి ఎన్‌టీ రామారావు అని వివ‌రించారు.

ప్ర‌జ‌ల జీవితాల్లో వెలుగులు నింపేందుకే స్వ‌ర్ణాంధ్ర @ 2047

మ‌హ‌నీయుల స్ఫూర్తితోనే స్వ‌ర్ణాంధ్ర @ 2047 తీసుకొచ్చామ‌ని, దీన్ని ఒక వ్య‌క్తికోస‌మో, ఒక కులంకోస‌మో, మ‌తం కోస‌మో, కుటుంబం కోస‌మో కాదు.. రాష్ట్రంలోని ప్ర‌తివ్య‌క్తి, ప్ర‌తి కుటుంబం, ప్ర‌తి ప్రాంతం కోసం ఏమి చేయ‌బోతామ‌నేది చాలా స్ప‌ష్టంగా విజ‌న్ డాక్యుమెంట్‌లో పొందుప‌రిచామ‌ని ముఖ్య‌మంత్రి స్ప‌ష్టం చేశారు. ప్ర‌జ‌ల జీవితాల్లో మార్పు తీసుకొచ్చేందుకు అవ‌స‌ర‌మైన కార్యాచ‌ర‌ణ ప్ర‌ణాళిక‌ను పొందుప‌రిచామ‌న్నారు. కొందరు నాయ‌కులు త్యాగాలు చేశారు.. మ‌రికొంద‌రు రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారు.. మ‌రికొంద‌రు దేశాన్ని అభివృద్ధి చేసేందుకు అహ‌ర్నిశ‌లు కృషిచేశారు. జీవితాల్లో వెలుగులు నింపేందుకు ఆలోచించారు. కొంద‌రు మాత్రం త‌మ స్వార్థం కోసం దేశాన్ని, రాష్ట్రాన్ని నాశ‌నం చేశారు. ఇలా స్వేచ్ఛ‌గా మాట్లాడుకునే ప‌రిస్థితి లేకుండా చేశారు. పొట్టి శ్రీరాములు గారు పుట్టిన ఊర్లో అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌న్నింటినీ ర‌ద్దు చేశారు. చేయాల్సిందంతా చేసి ఇప్పుడు ప్రేమ ఒల‌క‌బోస్తున్నారు. 2014లో విభ‌జ‌న జ‌రిగిన త‌ర్వాత 13.5 శాతం వృద్ధి రేటు సాధించాం. ఎవ‌రికీ ఏ క‌ష్టం లేకుండా చేశాం. కానీ.. 2019లో వ‌చ్చిన ప్ర‌భుత్వం మూడు రాజ‌ధానుల పేరుతో ప్ర‌పంచంలో ఎక్క‌డాలేని విధంగా అమ‌రావ‌తిపై క‌క్ష‌క‌ట్టి విధ్వ‌సం చేశారు. పోల‌వ‌రంను కూడా నాశ‌నం చేసి రాష్ట్రాన్ని తిరోగ‌మ‌నం వైపు న‌డిపించారు. తిరిగి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు ఆర్నెల్లుగా క‌ష్ట‌ప‌డుతున్నాం. మ‌హ‌నీయుల స్ఫూర్తి ఇచ్చిన దృఢ సంక‌ల్ప‌మే మ‌మ్మ‌ల్ని ముందుకు తీసుకెళ్తోంది. వెల్తీ, హెల్తీ, హ్యాపీ సొసైటీ ల‌క్ష్యంగా ప‌నిచేస్తున్నామ‌ని వివ‌రించారు. అయితే గ‌త ప్ర‌భుత్వంలో ల‌క్షా 25 వేల కోట్ల అప్పులు చేశారు. అంద‌రూ బాధితులేన‌ని సీఎం అన్నారు.

త్యాగాలు చేసిన మ‌హ‌నీయుల స్ఫూర్తితో ఇబ్బందులను అధిగ‌మిస్తూ ముందుకెళ్తున్నాం.. పొట్టి శ్రీరాములును గుర్తు పెట్టుకోవాలి.. మ‌హాత్మా గాంధీని గుర్తు పెట్టుకోవాలి.. స‌ర్దార్ వ‌ల్ల‌భాయ్ ప‌టేల్‌ను గుర్తుపెట్టుకోవాలి.. ఎన్‌టీ రామారావును గుర్తుపెట్టుకోవాలి.. మ‌రోవైపు చెడుచేసిన వ్య‌క్తుల్నీ గుర్తుపెట్టుకోవాల‌ని కోరుతున్నా.. 2025, మార్చి 16 నుంచి పొట్టి శ్రీరాములు 125వ జ‌యంతి ప్రారంభ‌మవుతుంద‌ని.. ఈ కార్య‌క్ర‌మాన్ని ఘ‌నంగా చేద్దామ‌ని తెలిపారు. అమ‌రావ‌తిలో మెమోరియ‌ల్ పెట్టి.. ఆయ‌న త్యాగాల‌ను గుర్తుంచుకునేలా ఏమే చేయాలో అన్నీ చేస్తామ‌ని సీఎం చెప్పారు. పొట్టి శ్రీరాములు గారు ఉన్న ఇంటిని స్మార‌కంగా అభివృద్ధి చేసి, శాశ్వ‌తంగా గుర్తుంచుకునేలా చేస్తామ‌న్నారు.

నా ఆలోచ‌న 2047 నాటికి రాష్ట్రంలోని ప్ర‌తిఒక్క‌రి ఆదాయం దాదాపు 42 వేల యూఎస్ డాల‌ర్ల‌కు పెర‌గాల‌నేదే.. రైతు ధాన్యం మిల్లుకు చేరిన వెంట‌నే రైతు ఖాతాల్లో డ‌బ్బులు ప‌డాలి.. అలాంటి విధానాల కోసం ఆలోచిస్తున్నాం.. త్వ‌ర‌లో వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్‌ను తీసుకొస్తున్నాం. ఇవ‌న్నీ సాధ్య‌మే.. ఇవ‌న్నీ జ‌ర‌గాలంటే ప్ర‌జ‌ల్లో గొప్ప ఆలోచ‌న రావాలి.. స‌హ‌క‌రించాలి.. ప్ర‌ప‌చంలోనే అత్యున్న‌త ప‌రిపాల‌నకు నాంది ప‌ల‌కాల‌నేది మా అభిమ‌తం. ఇందుకు ప్ర‌జ‌లంద‌రూ స‌హ‌క‌రించి, ముందుకు రావాలి.

సుప‌రిపాల‌న ద్వారానే సంక్షేమం, అభివృద్ధి సాధ్యం.. ఈ దిశ‌గా ఎన్‌డీఏ కూట‌మి ప్ర‌భుత్వం ప‌నిచేస్తోంద‌ని. ఒకేరోజు రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లోనూ గ్రామ‌స‌భ‌లను విజ‌య‌వంతంగా నిర్వ‌హించిన ఘ‌న‌త ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు చెందుతుంద‌ని.. పొట్టి శ్రీరాములు గారిని గౌర‌వించుకునే ఇలాంటి మంచి కార్య‌క్ర‌మంలో పాల్గొన‌డాన్ని పూర్వజ‌న్మ సుకృతంగా భావిస్తున్నామ‌ని సీఎం అన్నారు.

Check Also

అనధికార ట్యాప్, డ్రైనేజి కనెక్షన్లు కల్గి ఉండడం చట్టరీత్యా నేరం

గుంటూరు,  నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో అనధికార ట్యాప్, డ్రైనేజి కనెక్షన్లు కల్గి ఉండడం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *