-ప్రఖ్యాత కవులు, రచయితల స్వస్థలాలు… ప్రముఖ గ్రంథాలయాలు సందర్శనీయ కేంద్రాలు కావాలి
-భాషా, సాంస్కృతిక, పర్యాటక శాఖల సమన్వయంతో టూరిజం సర్క్యూట్స్ చేయవచ్చు
-రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు పవన్ కల్యాణ్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
మాతృ భాషపట్ల నవతరంలోనూ, చిన్నారుల్లోనూ ప్రేమాభిమానాలు పెంచడంతోపాటు- మన కవులు, రచయితల గొప్పదనాన్ని తెలియచేసేలా తెలుగు సాహితీ యాత్రలు నిర్వహించే దిశగా ప్రణాళికలు రూపొందించే దిశగా ప్రభుత్వం ఆలోచన చేస్తుందని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తెలిపారు. శ్రీశ్రీ, గురజాడ, చలం, గుర్రం జాషువా, విశ్వనాథ సత్యనారాయణ, తిలక్, దేవులపల్లి కృష్ణశాస్త్రి లాంటి గొప్ప కవులు, రచయితల స్వస్థలాలు, అక్కడ వారి జ్ఞాపకాలను కాపాడటం ద్వారా, వారి సాహిత్య సేవలు తెలిపే స్మారక కేంద్రాలు నిర్మాణం ద్వారా ఆ ప్రాంతాలను అభివృద్ధి చేయవచ్చన్నారు. ఆదివారం సాయంత్రం మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ని విజయవాడ బుక్ ఫెస్టివల్ కమిటీ ప్రతినిధులు కలిశారు. 35 సంవత్సరాల నుంచి విజయవాడలో దిగ్విజయంగా పుస్తక మహోత్సవాన్ని నిర్వహిస్తున్నామని చెబుతూ అందుకు సంబంధించిన వివరాలను తెలిపారు. కొద్ది సంవత్సరాలుగా పుస్తక మహోత్సవ నిర్వహణకు అవసరమైన మైదానం కూడా పూర్తి స్థాయిలో అందుబాటులో లేకపోవడంతో ఇబ్బందులుపడుతున్నామని వివరించారు. ఈ సమస్యను పరిష్కరిస్తామని ఉప ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మాట్లాడుతూ “ఆధ్యాత్మిక పర్యాటకం, సాహస క్రీడలతో కూడిన పర్యాటకం, చారిత్రక స్థలాల పర్యాటకం ఉన్న విధంగానే సాహితీ పర్యాటకం కూడా రావాలి. తెలుగు భాషకు సేవలందించిన కవులు, రచయితలు స్వస్థలాలు, నివసించిన ప్రదేశాలు, వారి జ్ఞాపకాలు ఉన్న ప్రాంతాలను, ప్రముఖ గ్రంథాలయాలను భాషాభిమానులు, విద్యార్థులు సందర్శించేలా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. వేటపాలెం గ్రంథాలయం, రాజమహేంద్రవరం గౌతమి గ్రంథాలయం, కడప సి.పి.బ్రౌన్ గ్రంథాలయం లాంటి ప్రముఖ గ్రంథాలయాలు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి. వీటినీ, కవులు, రచయితల నివాసాలను కలుపుతూ టూరిజం సర్క్యూట్స్ ఏర్పాటు చేయవచ్చు. ఇది తెలుగు భాష అభివృద్ధితోపాటు, పర్యాటక రంగం విస్తరణకు దోహదపడుతుంది. ఈ అంశంపై భాషా – సాంస్కృతిక శాఖ, పర్యాటక శాఖలు సమన్వయంతో ప్రణాళికలు రూపొందించాలి. ఈ దిశగా కూటమి ప్రభుత్వం ఆలోచనలు చేస్తుంది” అన్నారు. ఈ సమావేశంలో విజయవాడ బుక్ ఫెస్టివల్ ప్రతినిధులు టి.మనోహర్ నాయుడు, కె.లక్ష్మయ్య, గొల్ల నారాయణ రావు, సందీపని పాల్గొన్నారు.