-రబీ, ఖరీఫ్ సీజన్ల ముందు జిల్లా స్థాయిలో అంచనా కేటాయింపులకు కసరత్తు –
-రైతులకు రాయితీపై నాణ్యమైన విత్తనాలు అందించాలి –
-మెగా సీడ్ పార్క్ ఏర్పాటుకు చర్యలు –
-ఎస్.హెచ్.జీలు, రైతు ఉత్పత్తిదారుల సంస్థలు, సహకార సంఘాల ద్వారా ఎరవుల విక్రయాలు –
-వేర్ హౌసింగ్ కార్పొరేషన్ బలోపేతానికి చర్యలు –
-మార్క్ఫెడ్, ఏపి సీడ్స్, వేర్ హౌసింగ్ కార్పొరేషన్ శాఖల ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశంలో మంత్రి అచ్చెన్నాయుడు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర వ్యాప్తంగా విత్తనాలు, ఎరువుల కొరత లేకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని, ప్రతి ఏటా జిల్లా స్థాయిలో కలెక్టర్, అధికారులు, జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు ఆయా జిల్లాల్లో పండే పంటల అనుగుణంగా అవసరమైన విత్తనాలు, ఎరువులకు నివేదిక అందించే విధంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, పశుసంవర్ధక, పాడి పరిశ్రమాభివృద్ధి మరియు మత్స్య శాఖామాత్యులు కింజరాపు అచ్చెన్నాయుడు ఆదేశించారు. సచివాలయంలో సోమవారం ఉదయం ఏపి సీడ్స్, మార్క్ఫెడ్, ఏపి వేర్ హౌసింగ్ కార్పొరేషన్ ఉన్నతాధికారులతో మంత్రి అచ్చెన్నాయుడు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఏపి సీడ్స్ ద్వారా రైతులకు నాణ్యమైన విత్తనాలు రాయితీపై అందించే అవకాశాలు మరింత మెరుగు పరిచేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రాష్ట్రంలో మెగా సీడ్ పార్క్ ఏర్పాటుకు చర్యలు వేగవంతం చేయాలని, రాష్ట్ర వ్యాప్తంగా 16 ప్రదేశాల్లో 750 ఎకరాల్లో అందుబాటులో ఉన్నవిత్తన ఉత్పత్తి క్షేత్రాలను నూరు శాతం సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. చిరుధాన్యాలు, తృణధాన్యాలు సాగు, వినియోగం పెంచే విధంగా విత్తన దశ నుంచే రాయితీ అందించేందుకు, సాగు ప్రోత్సహించేందుకు కృషి చేయాలని సూచనలు చేశారు.
రైతులకు, రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు 35% రాయితీపై గోదాములు అద్దెకు ఇచ్చి గిట్టుబాటు ధర వచ్చిన తర్వాత విక్రయించే వెసులుబాటు కల్పించాలని, వేర్ హౌసింగ్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న గోదాములు నూరు శాతం ఉపయోగించే విధంగా చర్యలు తీసుకోవాలని, గోదాముల మరమ్మతులు, అవసరమైన సిబ్బంది నియామకానికి తక్షణ చర్యలు చేపట్టి కార్పొరేషన్ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు.
రాయితీపై రైతులకు పచ్చి రొట్ట ఎరువుల విత్తనాలు అందించి, భూసారం పెంపు, నాణ్యమైన దిగుబడి వృద్ధికి కృషి చేయాలని, రాష్ట్ర వ్యాప్తంగా పొలం పిలుస్తోంది కార్యక్రమాల్లో రైతులకు ప్రభుత్వం ఇచ్చే రాయితీలను అవగాహన కల్పించి నూరు శాతం సద్వినియోగం చేసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.
గ్రామ స్థాయిలో స్వయం సహాయక సంఘాలు, రైతు ఉత్పత్తిదారుల సంస్థలు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు ఎరువులు అవసరం మేరకు సరఫరా చేసి రైతులకు ఎరువులు సమృద్ధిగా అందుబాటులో ఉంచాలని మార్క్ఫెడ్ అధికారులను మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశించారు. ఎరువులు నల్లబజారులో అధిక ధరలకు విక్రయించే పరిస్థితి ఉండకూడదని, సహకార సంఘాల్లో ఎరువులు అవసరం మేరకు అందుబాటులో ఉంచాలని తెలిపారు. సమావేశంలో వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి బుడితి రాజశేఖర్, వ్యవసాయ శాఖ కమిషనర్ ఢిల్లీ రావు, మార్క్ఫెడ్ ఎండీ మంజీర్ జిలానీ సమాన్, వేర్ హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ సురేష్ కుమార్ ఇతర అధికారులు పాల్గొన్నారు.