Breaking News

నేడు మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి ఆధ్వర్యంలో సచివాలయంలో టాస్క్ ఫోర్స్ కమిటీ సమీక్షా సమావేశం

-పెండింగ్ సమస్యలను త్వరితగతిన పరిష్కరించుకుని, సకాలంలో పనులు పూర్తి చేయాలని నేషనల్ హైవే, రైల్వే శాఖ అధికారులకు మంత్రి ఆదేశం
-భూసేకరణ, అటవీ క్లియరెన్స్ త్వరితగతిన పరిష్కరించాలని రెవెన్యూశాఖ అధికారులకు మంత్రి ఆదేశం
-డిసెంబర్ 2026 నాటికి రాష్ట్రంలో రైల్వే, జాతీయ రహదారుల ప్రాజెక్టుల పనులు పూర్తి చేయాలని దిశానిర్ధేశం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలోని జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్టులను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో, పెండింగ్ సమస్యలను పరిష్కరించుకుని, ఆయా ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు రాష్ట్ర రోడ్లు & భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి ఆదేశించారు. సచివాలయంలోని ఆర్ & బీ శాఖ కార్యాలయంలో మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి ఆధ్వర్యంలో జాతీయ రహదారులు, రైల్వే, అటవీ, రెవెన్యూ, గనుల శాఖ ఉన్నతాధికారులతో నేడు టాస్క్ ఫోర్స్ కమిటీ సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమీక్షా సమావేశంలో ఆర్ & బీ శాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే, గనుల శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా, గనుల శాఖ డైరెక్టర్ ప్రవీణ్ కుమార్, వి. రామచంద్ర, ENC (ఆర్ & బీ), శేషు కుమార్, CE (ఆర్ & బీ), మాధవి సుకన్య CE (ఆర్ & బీ), రాకేష్ కుమార్ RO (MORTH), పార్వతీశం PD (NHAI) దీప, అటవీ శాఖ కన్సర్వేటివ్ ఆఫీసర్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

రాష్ట్రంలో జాతీయ రహదారుల ప్రాజెక్టులు (నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI), కేంద్ర రోడ్లు, రవాణా, హైవే మంత్రిత్వశాఖ (MoRTH) ఆధ్వర్యంలో), రైల్వే ప్రాజెక్టులకు సంబంధించి పనులు వేగవంతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశంలో టాస్క్ ఫోర్స్ కమిటీ చర్చించడం జరిగింది. ఒక నిర్ణీత కాల వ్యవధిని పెట్టుకుని ఆయా ప్రాజెక్టుల పనులు సకాలంలో ప్రారంభించి, పూర్తి చేసే విధంగా ప్రణాళికలు రచించుకోవాలని మంత్రి అధికారులకు ఆదేశించారు. ముఖ్యంగా ఈ సమావేశంలో నేషనల్ హైవేలు, రైల్వే ప్రాజెక్టులకు సంబంధించి భూసేకరణ, అటవీ క్లియరెన్స్, నిధులు విడుదల, అలైన్ మెంట్ మార్పులు, క్షేత్రస్థాయిలో ఇబ్బందులు, ఆయా శాఖల మధ్య సమన్వయం వంటి సమస్యల పరిష్కారానికి మంత్రి ఆధ్వర్యంలోని టాస్క్ ఫోర్స్ కమిటీ పలు కీలక సూచనలు చేయడం జరిగింది.

ముఖ్యమంత్రి చంద్రబాబు సూచనల మేరకు జాతీయ రహదారులకు సంబంధించి అన్ని పెండింగ్ సమస్యలను త్వరితగతిన పరిష్కరించి.. 2026 డిసెంబర్ నాటికి రాష్ట్రంలో నేషనల్ హైవే పనులను పూర్తి చేయాలని మంత్రి అధికారులకు సూచించారు. ఇందుకనుగుణంగా జాతీయ రహదారులకు సంబంధించి భూసేకరణ ప్రక్రియ, అటవీ క్లియరెన్స్, మైనింగ్ సమస్యలను నిర్ధిష్టమైన కాలపరిమితిలో పూర్తి చేయాలని ఈ సమావేశంలో మంత్రి అధికారులను ఆదేశించారు.. ఈ సందర్భంగా భూసేకరణ ప్రక్రియను డిసెంబర్ 31 నాటికి 60 శాతం, జనవరి 31 నాటికి 100 శాతం పూర్తి చేస్తామని రెవెన్యూ అధికారులు మంత్రికి తెలిపారు.. అలాగే అటవీ క్లియరెన్స్ సమస్యలను జనవరి 15 నాటికి 70 శాతం, ఫిబ్రవరి 15 నాటికి 100 శాతం పరిష్కరిస్తామని అటవీ శాఖ అధికారులు తెలిపారు. మొత్తంగా రాష్ట్రంలో నేషనల్ హైవే ప్రాజెక్టులకు సంబంధించి 23 అటవీ క్లియరెన్స్ ప్రాజెక్టుల పనులు అపరిష్కృతంగా ఉండగా, ఇందులో 18 పనులు ఇప్పటికే ప్రొగ్రస్ లో ఉండగా.. వీటిలో 9 అటవీ క్లియరెన్స సమస్యలను జనవరి 15 నాటికి, మిగిలిన 9 అటవీ క్లియరెన్స్ సమస్యలను ఫిబ్రవరి 15 నాటికి పరిష్కరిస్తామని అటవీ శాఖ అధికారులు తెలియజేయడం జరిగింది.

ఈ సందర్భంగా రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టులకు సంబంధించి భూసేకరణ, అటవీ క్లియరెన్స్, అలైన్ మెంట్ సమస్యలతో పాటు, స్థానికంగా క్షేత్రస్థాయిలో ఇబ్బందులు, ఆయా ప్రాజెక్టులు పనుల పురోగతి, నిధులు వంటి అంశాలపై అధికారుల నుంచి మంత్రి వివరాలు అడిగి తెలుసుకున్నారు.. 2026 డిసెంబర్ నాటికి రాష్ట్రంలోని రైల్వే ప్రాజెక్టులు పూర్తి చేయాలనే టార్గెట్ పెట్టుకుని, అధికార యంత్రాంగం పనిచేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా రైల్వే ప్రాజెక్టులకు సంబంధించి భూసేకరణ సమస్యలను త్వరితగతిన పూర్తి చేయాలని ఆయా జిల్లాల కలెక్టర్లను మంత్రి ఆదేశించారు. నూతన రైల్వే ప్రాజెక్టులకు సంబంధించి భూసేకరణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని, కొన్ని ప్రాజెక్టులకు సంబంధించి రైల్వే శాఖ నిధులతోనే భూసేకరణ ప్రక్రియ, రైల్వే లైన్ పనులను పూర్తి చేయాలని రైల్వే శాఖ అధికారులకు మంత్రి సూచించారు. రాష్ట్రంలో గతిశక్తి ప్రాజెక్టు క్రింద ఉన్న (ROB) / (RUB) లెవెల్ క్రాసింగ్ మూసివేతకు సర్టిఫికేట్ లు వెంటనే ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.

Check Also

అనధికార ట్యాప్, డ్రైనేజి కనెక్షన్లు కల్గి ఉండడం చట్టరీత్యా నేరం

గుంటూరు,  నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో అనధికార ట్యాప్, డ్రైనేజి కనెక్షన్లు కల్గి ఉండడం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *