Breaking News

మూడేళ్లలో ప్రజా రాజధాని అమరావతి నిర్మాణం పూర్తి చేస్తాం..

-43వ సీఆర్డీఏ అథారిటీ సమావేశంలో రూ.24,276 కోట్లకు ఆమోదం..
-మొత్తంగా రాజధాని నిర్మాణ పనులకు రూ.45,249.24 కోట్లకు ఆమోదం..
-రాజధానిపై సాంకేతిక, న్యాయపరమైన సమస్యలు లేకుండా ముందుకెళ్తున్నాం..
-రాజధాని రైతుల సమస్యలకు త్వరలోనే పరిష్కారం చూపిస్తాం..
-రాష్ట్ర పురపాలక & పట్టణాభివృద్ధి శాఖామాత్యులు పి. నారాయణ

అమరావతి, అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
సీఎం చంద్రబాబు నేతృత్వంలో జరిగిన సీఆర్డీఏ 43వ అథారిటీ సమావేశంలో అమరావతి రాజధానికి సంబంధించి ట్రంక్ రోడ్లు, లేఅవుట్ లు, ఐకానిక్ భవనాల నిర్మాణాలకు రూ.24,276 కోట్లకు ఆమోదం లభించిందని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖామాత్యులు పి.నారాయణ వెల్లడించారు. ఈ మేరకు రాష్ట్ర సచివాలయంలో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఇప్పటివరకు జరిగిన గత 4 సీఆర్డీఏ అథారిటీ సమావేశాల్లో మొత్తంగా రూ.45,249.24 కోట్లకు ఆమోదం లభించిందన్నారు. అసెంబ్లీని 103 ఎకరాల్లో, 250 మీటర్ల ఎత్తులో 11.22 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మిస్తామని తెలిపారు. అసెంబ్లీ సమావేశాలు లేని మిగతా రోజుల్లో ప్రజలు అసెంబ్లీ భవనంపైనుంచి రాజధానిని తిలకించే సౌకర్యం కల్పిస్తామన్నారు.

హైకోర్టు భవనాన్ని 20.32 లక్షల చదరపు అడుగులు, 42 ఎకరాల్లో 55 మీటర్ల ఎత్తున 8 అంతస్తుల్లో రూ.1048 కోట్లతో నిర్మించనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. అదేవిధంగా జీఏడీ (పరిపాలన) భవనాన్ని 17.03 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో 47 అంతస్తులతో నిర్మించనున్నట్లు చెప్పారు. దీంతోపాటు మొత్తం 5 టవర్లతో కూడిన వివిధ భవనాలు 68.88 లక్షల చదరపు అడుగులలో రూ.4,688 కోట్లతో నిర్మిస్తామని తెలిపారు. ఎల్పీఎస్ మౌలిక సదుపాయాల్లో భాగంగా 4 ప్రధాన రహదారులు, ఇతర సౌకర్యాలకు సంబంధించి 579.5 కిలోమీటర్ల మేర రోడ్ల అభివృద్ధికి రూ.9,699 కోట్లు, ట్రంకు రోడ్లకు సంబంధించి రూ.7,794 కోట్లకు, ఎస్టీపీ పనులకు సంబంధించి రూ.318 కోట్లు మొత్తం కలిపి రూ.24,276 కోట్లకు ఈ 43వ సీఆర్డీఏ అథారిటీ సమావేశంలో ఆమోదం లభించిందన్నారు.

వచ్చే సోమవారం నాటికి టెండర్లను పిలిచే కార్యక్రమం ప్రారంభించడం జరుగుతుందని, ఈ నెలాఖరులోగా వీలైనంత మేరకు టెండర్లు పూర్తయ్యే విధంగా చర్యలు తీసుకుంటామని, ఇంకా ఏమైనా మిగిలి ఉంటే జనవరిలో నెలాఖరులోగా టెండర్ల ప్రక్రియను పూర్తి చేస్తామని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోను వచ్చే మూడేళ్లలో అమరావతి రాజధాని నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రపంచంలో మొదటి 5 ఉత్తమ నగరాల్లో ఒకటిగా అమరావతిని తీర్చిదిద్దుతామన్నారు.

గత ప్రభుత్వ నేతలు ప్రభుత్వంపై బురద చల్లే కార్యక్రమం చేపట్టారని వాళ్లంతా ఒకసారి ఎస్వోఆర్ పరిశీలన చేయాలన్నారు. గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో అమరావతిలో విధ్వంసం ఏర్పడిందని, ప్రస్తుతం నిర్మాణ పనుల రేట్లు భారీగా పెరిగిపోయాయన్నారు. టవర్స్ 41 శాతం, హైకోర్టుకు 28 శాతం రేట్లు పెరిగాయయన్నారు. ల్యాండ్ పూలింగ్ చేపట్టిన 29 గ్రామాల్లో అన్ని రకాల చర్యలు చేపడతామని, రాజధాని రైతులకు అన్ని రకాల న్యాయం చేస్తామన్నారు.

Check Also

అనధికార ట్యాప్, డ్రైనేజి కనెక్షన్లు కల్గి ఉండడం చట్టరీత్యా నేరం

గుంటూరు,  నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో అనధికార ట్యాప్, డ్రైనేజి కనెక్షన్లు కల్గి ఉండడం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *