-కేంద్ర నైపుణ్యాభివృద్ధి, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ (స్వతంత్ర బాధ్యత) సహాయ మంత్రి జయంత్ చౌదరి వెల్లడి
-పి.ఎమ్.కె.వి.వై 4.0 కింద స్కిల్ హబ్ సెంటర్స్ ఏర్పాటు పై ప్రశ్నించిన ఎంపి కేశినేని శివనాథ్
ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రధాన మంత్రి కౌశల్ వికాస్ యోజన (PMKVY) 4.0 అమలులోకి వచ్చిన తరువాత నుంచి ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 6,835 స్కిల్ హబ్‌లు ఏర్పాటు చేయగా, ఆంధ్రప్రదేశ్ లో మొత్తం 539 స్కిల్ హబ్‌లు ఏర్పాటు చేసినట్లు కేంద్ర నైపుణ్యాభివృద్ధి, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ (స్వతంత్ర బాధ్యత) సహాయ మంత్రి జయంత్ చౌదరి వెల్లడించారు. పి.ఎమ్.కె.వి.వై 4.0 కింద ఎపితో పాటు దేశ వ్యాప్తంగా ఏర్పాటు చేసిన స్కిల్ హబ్ సెంటర్స్ వివరాలతో పాటు ఏడాది వారీగా కేటాయించిన నిధులు, కల్పించిన వసతులపై కేంద్ర నైపుణ్యాభివృద్ధి, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మంత్రి త్వశాఖ ను లోక్ సభలో ఎంపి కేశినేని శివనాథ్ సోమవారం అడగటం జరిగింది. వీటికి కేంద్ర నైపుణ్యాభివృద్ధి, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ (స్వతంత్ర బాధ్యత) సహాయ మంత్రి జయంత్ చౌదరి లిఖిత పూర్వకంగా సమాధానం తెలిపారు.
స్కిల్ హబ్ లు విద్యాసంస్థల్లో అందుబాటులో ఉన్న తరగతి గదులు, ప్రయోగశాలలు వంటి మౌలిక వసతులను ఉపయోగించి ఏర్పాటు చేయటం జరుగుతుందని, వాటి నిర్మాణానికి ప్రత్యేక నిధులు కేటాయించలేదన్నారు. అభ్యర్థులకు శిక్షణకు అవసరమైన ఖర్చు మాత్రమే తిరిగి చెల్లించటం జరుగుతుందన్నారు. ఆంధ్రప్రదేశ్ లో 2022-23 స్కిల్ హబ్‌లు 69 ఏర్పాటు చేయగా, వాటికి ఎలాంటి నిధులు మంజూరు చేయలేదని, శిక్షణ ఎవరు పొందలేదని తెలిపారు. 2023-24 ఎపిలో స్కిల్ హబ్ 245 ఏర్పాటు చేయగా, మంజూరైన నిధులు రూ.12.58 కోట్లు వుండగా, 20 వేల 540 మంది అభ్యర్ధులు శిక్షణ పొందినట్లు చెప్పారు.
2024-25 ఏడాదిలో అక్టోబర్ 31 వరకు ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటు చేసిన స్కిల్ హబ్ ల సంఖ్య 218 వుండగా మంజూరైన నిధులు రూ.3.54 కోట్లు వుండగా, 14 వేల 253 మంది అభ్యర్ధులు శిక్షణ తీసుకున్నట్లు తెలిపారు. ఏపీలో ఈ మూడు సంవత్సరాల్లో 532 స్కిల్ హబ్‌లు ఏర్పాటు చేయటంతో పాటు రూ.16.12 కోట్లు విడుదల చేయగా 34,793 అభ్యర్థులకు శిక్షణ తీసుకున్నట్లు వివరించారు.