అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ ఉపాధి కల్పన, వ్యాపార అభివృద్ది సంస్ధ (సొసైటీ ఫర్ ఎంప్లాయ్‌మెంట్ జనరేషన్ అండ్ ఎంటర్‌ప్రైజ్ డెవలప్‌మెంట్ ఇన్ ఎపి -సీడాప్) ముఖ్య కార్యనిర్వహణ అధికారిగా పాలడుగు నారాయణ స్వామి బాధ్యతలు స్వీకరించారు. విజయవాడ పండిట్ నెహ్రు బస్ స్టేషన్ ప్రాంగణంలోని నందమూరి తారక రామారావు పరిపాలనాభవనంలోని సిడాప్ కార్యాలయంలో సోమవారం ప్రత్యేక కార్యక్రమం జరిగింది. 2022 నవంబరు నుండి రాజ్ భవన్ లో గవర్నర్ ఉప కార్యదర్శిగా నారాయణ స్వామి వ్యవహరిస్తున్నారు. మానవవనరుల శాఖ మంత్రి నారా లోకేష్ నేతృత్వంలోని నైపుణ్యాభివృద్ది, శిక్షణా విభాగంలో అంతర్బాగంగా ఉన్న సిడాప్, గ్రామీణ యువతకు అవసరమైన ఉద్యోగ శిక్షణను అందించి వారి ఉపాధికి మార్గం చూపుతోంది. ఈ సందర్భంగా నారాయణ స్వామి మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయిడు తనపై నమ్మకంతో అప్పగించిన ఈ బాధ్యతను నిర్వర్తించి గణనీయంగా యువత ఉపాధిని పొందగలిగేలా ప్రయత్నిస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం నుండి నైపుణ్యాభివృద్దికి గణనీయంగా నిధులు తీసుకువచ్చే క్రమంలో తనవంతు ప్రయత్నం చేస్తానన్నారు. ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ పూర్తి చేసి, 2012 బ్యాచ్ గ్రూప్ 1 అధికారిగా దశాబ్దానికి పైగా అంకితభావంతో నారాయణ స్వామి సేవలు అందిస్తుండగా, అసిస్టెంట్ ప్రొహిబిషన్, ఎక్సైజ్ సూపరింటెండెంట్‌గా తన వృత్తిని ప్రారంభించారు. స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో అనంతపురం డివిజన్‌లో 2020 మే నుండి 2021 జూన్ వరకు, మైలవరం, విజయవాడ డివిజన్లలో 2021 జూలై నుండి 2022 నవంబర్ వరకు పనిచేసారు. అనంతపురం నంద్యాల, చిత్తూరు యూనిట్‌లలో ప్రొహిబిషన్ , ఎక్సైజ్ సూపరింటెండెంట్, కడపలో అసిస్టెంట్ ప్రొహిబిషన్, ఎక్సైజ్ సూపరింటెండెంట్, డిస్టిలరీ అధికారిగా పనిచేసారు. నారాయణ స్వామి అందించిన అసాధారణ సేవలకు గాను అనేక అవార్డులను అందిపుచ్చుకున్నారు. 2016లో చిత్తూరు జిల్లా కలెక్టర్ నుండి కమెండేషన్ సర్టిఫికేట్, స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో కమిషనర్ నుండి 2021, 2022లలో మెరిటోరియస్ సర్టిఫికేట్ పొందారు. విశాఖపట్నం ఏజెన్సీ ప్రాంతాల్లో గంజూయి సాగును నియంత్రించేందుకు ఇతోధికంగా సేవలు అందించిన పాలడుగు నారాయణ స్వామి ప్రభుత్వం నుండి ప్రశంసలు అందుకున్నారు.
Tags amaravathi
Check Also
అనధికార ట్యాప్, డ్రైనేజి కనెక్షన్లు కల్గి ఉండడం చట్టరీత్యా నేరం
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో అనధికార ట్యాప్, డ్రైనేజి కనెక్షన్లు కల్గి ఉండడం …