-సీఎంఆర్‌ఎఫ్ ద్వారా రూ.17.50 లక్షల విలువైన చెక్కులను అందచేసిన నాగుల్‌మీరా, ఎమ్మెల్యే గద్దె రామమోహన్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎమ్మెల్యే గద్దె రామమోహన్ పేదలు, ప్రజల మనిషి అని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి నాగుల్‌మీరా చెప్పారు. నియోజకవర్గంలోని ప్రజలకు ఏ కష్టం వచ్చినా వెంటనే అక్కడకు వెళ్ళివారికి కొండంత ధైర్యాన్ని అందిస్తున్నారన్నారు. ప్రభుత్వ పరంగా సహాయం అందేలా చేయడమే కాకుండా తన సొంత నిధులతో కూడా ఎమ్మెల్యే గద్దె రామమోహన్ సహాయాన్ని అందిస్తున్నారని అన్నారు. అశోక్‌నగర్‌లోని తూర్పు నియోజకవర్గ శాసనసభ్యుని కార్యాలయంలో బుధవారం ఉదయం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా 18 మందికి వైద్య ఖర్చుల నిమిత్తం మంజూరైన∙ రూ.17.50 లక్షల విలువైన చెక్కులను టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నాగుల్ మీరా, ఎమ్మెల్యే గద్దె రామమోహన్ లబ్ధిదారులకు స్వయంగా అందచేశారు.
ఈ సందర్భంగా నాగుల్‌మీరా మాట్లాడుతూ పేదలు ఆరోగ్య చికిత్సల కోసం అధికంగా డబ్బును ఖర్చు చేస్తుంటారని, అలాంటి వారికి ఎమ్మెల్యే గద్దె రామమోహన్ ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా వైద్య చికిత్సలకు ఖర్చు చేసిన వాటిలో అత్యధిక భాగాన్ని వారికి ప్రభుత్వం నుంచి అందచేస్తున్నారని చెప్పారు. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా తూర్పు నియోజకవర్గంలో ఎక్కువ మందికి సహయం అందేలా ఎమ్మెల్యే గద్దె రామమోహన్ చూస్తున్నారని అన్నారు. అందువల్లనే ఆయన మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా పేరుపొందారన్నారు. ప్రజల హృదయాల్లో ఉంటూ వారికి ఏ సమస్యలు వచ్చినా పరిష్కరిస్తున్నారని చెప్పారు. ప్రజలు సమస్యను చెప్పిన వెంటనే పరిష్కరించడానికి చర్యలు తీసుకోవడం, ఆ సమస్య తీవ్రతను బట్టి అధికారులు, మంత్రులు అవసరమైతే ముఖ్యమంత్రి దృష్టికి సమస్యను తీసుకువెళ్ళి పరిష్కరించేలా చూస్తున్నారని చెప్పారు. ఎమ్మెల్యే గద్దె రామమోహన్ ప్రజల మనస్సులో ఎప్పటికి చిరస్థాయిగా నిలిచిఉంటారని నాగుల్ మీరా అన్నారు. గద్దె రామమోహన్ ఎంపీగా కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారని, ఇప్పటికి ఆయన ఎంపీగానే చాలా మందికి తెల్సునని అన్నారు. గద్దె రామమోహన్‌ను ఎన్నికల్లో ఒక సారి గెలిచారంటే ఇక ఆయన్ను ఓడించడం చాలా కష్టమని అన్నారు. ఆయన ప్రజా సేవా కార్యక్రమాలు చేసి ప్రజలల్లో చెరగని ముద్ర వేసుకుంటారని చెప్పారు. గద్దె రామమోహన్‌తో పాటుగా ఆయన కుటుంబసభ్యులు కూడా నిత్యం ప్రజల మధ్యలోనే ఉంటు సహాయ కార్యక్రమాలు చేస్తున్నారని కొనియాడారు. నియోజకవర్గ ప్రజలు ఎల్లప్పుడు గద్దె రామమోహన్ వెంటే ఉంటారన్నారు.
రూ.20 కోట్ల విలువైన సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను ఇచ్చా–ఎమ్మెల్యే గద్దె రామమోహన్
ఎమ్మెల్యే గద్దె రామమోహన్ మాట్లాడుతూ 1995 సంవత్సరంలో నారా చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత సీఎంఆర్‌ఎఫ్‌ను ప్రవేశపెట్టారని చెప్పారు. అప్పటి నుంచి వైద్యసేవలకు అయిన ఖర్చును సీఎంఆర్‌ఎఫ్ ద్వారా ప్రజలకు అందచేస్తున్నారన్నారు. 2014–19 సంవత్సరంలో సీఎంఆర్‌ఎఫ్ ద్వారా ఒక్క తూర్పు నియోజకవర్గ పరిధిలోనే అత్యధికంగా రూ.20 కోట్ల విలువైన చెక్కులను లబ్ధిదారులకు అందచేశామని చెప్పారు. నారా చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అడిగిన వారికి లేదనకుండా సీఎంఆర్‌ఎఫ్ ద్వారా సహాయం చేస్తున్నారని అన్నారు. 2019–24 సంవత్సరంలో అధికారంలో ఉన్న వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఒక్క తూర్పు నియోజకవర్గంలో కేవలం 10 మందికి కూడా సీఎంఆర్‌ఎఫ్ ద్వారా చెక్కులను అందచేయలేదన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తూర్పు నియోజకవర్గంలో ఇప్పటి వరకు 126 మందికి సీఎంఆర్‌ఎఫ్ ద్వారా సహాయాన్ని అందించానని చెప్పారు. సీఎంఆర్‌ఎఫ్ ద్వారా ప్రతి వారం చెక్కులను మరియు ఎల్‌వోసీలను అందచేస్తున్నామని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో వైద్య సేవలు పొందడానికి అత్యధిక వడ్డీలు డబ్బులు తెచ్చి వైద్య చికిత్సలు చేయించుకుంటారని, వారు అప్పుల పాలు కాకుండా ఈ సీఎంఆర్‌ఎఫ్ వారికి కొంత అండగా ఉంటుందన్నారు. సీఎంఆర్‌ఎఫ్ నిధికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సరైన అర్ధం చెప్పారని అన్నారు. వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఈ నిధిని నిర్వీర్యం చేశారన్నారు. సీఎంఆర్‌ఎఫ్ పై ప్రజలు అవగాహన పెంచుకుని అర్హతలు, అవకాశం ఉన్న వారు సహాయం పొందాలని చెప్పారు. తూర్పు నియోజకవర్గ కార్యాలయంలో కాని, స్థానికంగా ఉన్న టీడీపీ నాయకులను కాని సంప్రదించి ఈ సీఎంఆర్‌ఎఫ్‌కు దరఖాస్తు చేసుకోవాలని ఎమ్మెల్యే గద్దె రామమోహన్ కోరారు.
కృష్ణాజిల్లా జిల్లా పరిషత్ మాజీ ఛైర్‌పర్సన్ గద్దె అనురాధ మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలకు గద్దె రామమోహన్ సీఎంఆర్‌ఎఫ్ ద్వారా నిధులను మంజూరు చేయించి వారికి అండగా ఉంటున్నారని చెప్పారు. గత 35 సంవత్సరాలుగా ఎమ్మెల్యే గద్దె రామమోహన్ నియోజకవర్గ ప్రజలకు అన్ని విధాలుగా అండగా ఉంటున్నారని అన్నారు. సీఎంఆర్‌ఎఫ్ ద్వారా సహాయం చేయడమే కాకుండా వైద్యులతో మాట్లాడి తక్కువ ఖర్చుతో వైద్యం చేయించేలా చూస్తున్నారని చెప్పారు. తన సొంత నిధులతో కూడా వైద్య సేవలను చేయిస్తూ ఎమ్మెల్యే గద్దె రామమోహన్ ప్రజలకు అండగా ఉంటున్నారని చెప్పారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు ముమ్మనేని ప్రసాద్ , పోట్లురి సాయి బాబు, రత్నం రమేష్ , వేముల దుర్గా రావు, రాయి రంగమ్మ, పలిశేట్టి అన్నారావు, పడాల గంగాధర్ , గుత్తికొండ కృష్ణ మోహన్ , తదితరులు పాల్గొన్నారు.