-జిల్లాలో కురిసిన భారీ వర్షాల కారణంగా వరద నీటి ప్రవాహ ఉధృతికి దెబ్బతిన్న వడమాల పేట పట్టణ శివారులోని అరక్కోణం రేణిగుంట రహదారిని నగరి ఎంఎల్ఏ గాలి భాను ప్రకాష్ తో కలిసి పరిశీలించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్
వడమాలపేట, నేటి పత్రిక ప్రజావార్త :
ఈ మధ్య జిల్లాలో కురిసిన భారీ వర్షాల కారణంగా వడమాల పేట పట్టణ శివారు లోని పాత అరక్కోణం రేణిగుంట రహదారి 350/8-10 పై శ్రీమల్లివారి వంక ఉదృతంగా ప్రవహించడం వలన పూర్తిగా దెబ్బతిన్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ గారు నగరి ఎంఎల్ఏ గాలి భాను ప్రకాష్ మరియు సంబంధిత అధికారులతో కలిసి నేటి మంగళవారం సాయంత్రం పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మరియు ఎంఎల్ఏ గారు జిల్లా ఆర్ అండ్ బి ఇంజనీరింగ్ అధికారి మధుసూదన్ రావుతో మాట్లాడుతూ తాత్కాలికంగా రహదారి పునరుద్ధరణ చర్యలు త్వరిత గతిన చేపట్టి ట్రాఫిక్ కు ఇబ్బంది కలగకుండా చూడాలని, అలాగే శాశ్వత ప్రాతిపదికన మరమ్మత్తులు చేపట్టుటకు అంచనాలు తయారు చేయాలనీ సూచించారు. అలాగే జిల్లా పంచాయితీ రాజ్ ఇంజినీరింగ్ అధికారి రామ్మోహన్ కి సూచిస్తూ ప్రస్తుతం వడమాల పేట నుండి హై వే రహదారికి ప్రత్యామ్నాయ మార్గంలో వాహనాలు వెళ్తున్నాయని, ఆ మార్గంలో జంగిల్ క్లియరెన్స్ చేయాలని సూచించారు. నీటి ప్రవాహం తగ్గిన వెంటనే పనులు చేపడతామని అధికారులు తెలుపగా నాణ్యతగా పనులు చేపట్టాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డిఈ ఆర్ అండ్ బి అమర్ నాథ్ రెడ్డి, తహశీల్దార్ వడమాల పేట జరీనా బేగం, ఆర్ఐ జానీ భాషా, తదితర ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.