-జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్
-ద్విచక్ర వాహన చోదకులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి: జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో రహదారి ప్రమాదాల నివారణకు సంబంధిత శాఖలు సమన్వయంతో పక్కా ప్రణాళికతో కృషి చేయాలని, తిరుపతి పట్టణంలో భారీ వాహనాలకు అనుమతి సమయాలను సమీక్షించాలని మరియు ద్విచక్ర వాహనాల చోదకులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ మరియు ఎస్పీ సుబ్బా రాయుడు సంయుక్తంగా పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ మరియు ఎస్పీ సంయుక్తంగా జిల్లా రహదారి భద్రతపై సమీక్ష సమావేశం వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు సంబంధిత అధికారులతో నిర్వహించారు. ఈ సమావేశము నందు తిరుపతి జిల్లాలో రహదారి ప్రమాదాలకు గల కారణాలపై సమీక్షించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రాజెక్టు డైరెక్టర్ నేషనల్ హైవే వారు తిరుపతి బైపాస్ నందు ఎక్కువగా ప్రమాదములు జరిగే ప్రాంతాల్లో నివారణ చర్యలు తనపల్లి జంక్షన్, ఆర్ సి పురం జంక్షన్, వకుళ మాత జంక్షన్ తదితర ప్రాంతాలలో సోలార్ బ్లింకర్లు, సైన్ బోర్డ్ సూచికలు, పాదచారులు రోడ్డు దాటుటకు మార్కింగ్, రెడ్ లైన్లు తదితర మార్కింగ్, సోలార్ హై మాస్ట్ లైట్లు సత్వర ఏర్పాటుకు చర్యలు తీసుకోవలసినదిగా ఆదేశించారు. నేషనల్ హైవే అధికారులు రహదారి ప్రమాదాల నివారణకు తీసుకోవలసిన తాత్కాలిక చర్యలతో పాటు శాశ్వత ప్రాతిపదిక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. హైవే ప్రక్కన గుర్తించిన విశ్రాంతి పాయింట్లు నందు మాత్రమే వాహనాలు ఆపేలా చర్యలు తీసుకోవాలని ప్రధానంగా గూడూరు తడ హైవే రహదారి వెంబడి వాహనాలు ఆగి ఉన్న వాటిపై ప్రత్యేక దృష్టి సారించి హైవే పెట్రోలింగ్ వాహనాలతో నేషనల్ హైవే అధికారులు పర్యవేక్షించాలని కలెక్టర్ సూచించారు. పోలీస్ శాఖ వారు హిట్ అండ్ రన్ కేసుల పై వెంటనే సమాచారము యివ్వాలని, బాధితుల నష్టపరిహార సంబంధిత విషయమై కమిటీలు చర్చించి సిద్ధం చేసి పంపాలని ఆదేశించారు. భాకరాపేట ఘాట్ నందు తరచు రహదారి ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో ఇప్పటివరకు తీసుకున్న ప్రమాద నివారణ చర్యలకు అదనంగా ప్రమాదకర మలుపుల వద్ద సైన్ బోర్డులు ఏర్పాటు, రెడ్ లైన్, బ్లింకర్లు, ప్రొటెక్షన్ రైలింగ్ అదనంగా ఏర్పాటు తదితర ప్రమాద నివారణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఎస్పీ గారి ఆధ్వర్యంలో పోలీస్ శాఖ వారు జిల్లాలో సుమారు 100 ప్రమాదకర రహదారి బ్లాక్ స్పాట్లను గుర్తించిన వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టి ప్రమాద నివారణ చర్యల కొరకు చేపట్టాల్సిన కార్యాచరణ అంశాలపై కలెక్టర్ మరియు ఎస్పీ సమీక్షించారు. కేంద్ర గుడ్ సమారిటన్ స్కీం పై ప్రజల్లో అవగాహన కల్పించి అమలుకు అధికారులు చర్యలు చేపట్టాలని సూచించారు.
ఎస్పీ మాట్లాడుతూ హెల్మెట్ వాడకంపై విద్యార్థులకు, యువతకు అవగాహన కల్పించే కార్యక్రమాలు పలు విద్యాలయాలలో రవాణా శాఖ మరియు పోలీస్ శాఖ వారు సంయుక్తంగా కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని, ప్రతి ఒక్క ద్విచక్ర వాహన చోదకులు తప్పనిసరిగా పట్టణంలోనూ, పల్లెల్లోనూ, జాతీయ రహదారి పైన అయినా ప్రయాణ సమయంలో హెల్మెట్ తప్పక వాడాలని తద్వారా తమ ప్రాణాలను కాపాడుకోవడంతో పాటు తమపై ఆధారపడిన కుటుంబ సభ్యులకు మేలు జరుగుతుందని తెలిపారు. ఇది సామాజిక బాధ్యతగా గుర్తెరిగి ప్రతి ఒక్కరు హెల్మెట్ వాడాలని సూచించారు. అలాగే సిటీలో ట్రాఫిక్ విపరీతంగా పెరిగిన నేపథ్యంలో నియంత్రణలో భాగంగా, భారీ వాహనాలకు నగరంలోకి అనుమతించే సమయ నిబంధనలను నిర్ధారించేందుకు రవాణా శాఖ మరియు ట్రాఫిక్ పోలీస్ వారు సంయుక్తంగా సమీక్షించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అన్నారు.
ఈ సమావేశంలో జిల్లా రవాణా శాఖ అధికారి మురళి మోహన్, డి.ఎస్.పీ ట్రాఫిక్ తిరుపతి, రవాణాశాఖ అధికారి, గూడూరు, వెంకటేశ్వర్లు పి.డి ఎన్.హెచ్.ఏ.ఐ పిడి లు ఎం కే చౌదరి, వెంకటేష్, ఆర్టీఓ గూడూరు కిషోర్, శ్రీనివాస రావు, రవాణా శాఖ అధికారులు దామోదర్ నాయుడు, శ్రీనివాసులు, అనిల్ కుమార్, అతికానాజ్ తదితరులు పాల్గొన్నారు.