-లోక్ సభలో అంగన్‌వాడీ కేంద్రాలకు సౌర విద్యుత్ అంశం ప్రస్తావన
న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త :
గ్రామీణ ప్రాంతాల్లో చిన్నారులకు ప్రాథమిక సౌకర్యాలు, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించడంలో కీలకమైన అంగన్‌వాడీ కేంద్రాలను పిఎం సూర్య ఘర్ మఫ్త్ బిజ్లీ యోజన పథకంలో చేర్చాలనే అంశాన్ని విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ శుక్రవారం లోక్ సభలో రూల్ నెంబర్ 377 కింద ఈ అంశం ప్రస్తావించారు .
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో రూ. 75,021 కోట్ల నిధులు కేటాయించి పిఎం సూర్య ఘర్ మఫ్త్ బిజ్లీ యోజన పథకాన్ని దేశవ్యాప్తంగా 2026-27 ఆర్థిక సంవత్సరానికి కల్లా అమల్లోకి తీసుకువచ్చేందుకు పనులు జరుగుతున్నాయన్నారు. అలాగే 2025 నాటికి ప్రభుత్వ భవనాలపై రూఫ్‌టాప్ సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేయటమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. ఈ పథకం అమల్లోకి వస్తే విద్యుత్తును ఉత్పత్తి చేసుకోవడమే కాకుండా, విద్యుత్ అవసరాలను స్వయంగా తీర్చుకోగలమని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో 55,607 అంగన్ వాడీ కేంద్రాలు వుండగా, వాటిలో 8,455 కేంద్రాల్లో ఇప్పటికీ విద్యుత్ సౌకర్యం లేవన్నారు. వేసవికాలంలో గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయాలు వుండటం వల్ల అంగన్ వాడీ కేంద్రాల్లోని చిన్నారులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నట్లు తెలిపారు. దీని ప్రభావం చిన్నారుల హాజరుపై పడటంతో పాటు, పిల్లలకు అవసరమైన సంరక్షణ సరిగ్గా అందటం లేదని పేర్కొన్నారు.
పిఎం సూర్య ఘర్ పథకం కిందకు అంగన్ వాడీ కేంద్రాలను తీసుకువస్తే నిరంతరం సౌర విద్యుత్ అందించే అవకాశం ఏర్పడుతుందని తెలిపారు. నిరంతరం విద్యుత్ సరఫరా వుంటే పిల్లల పరిస్థితులను గణనీయంగా మెరుగుపరుస్తుందని పేర్కొన్నారు. అంతేకాకుండా ప్రభుత్వానికి విద్యుత్ బిల్లుల వ్యయం తగ్గటంతోపాటు దీర్ఘకాలిక ఆర్థిక, ఇంధన సుస్థిరతను సాధించవచ్చునన్నారు.
అంగన్ వాడీ కేంద్రాల్లోని పిల్లల సంరక్షణకి ఎలాంటి అంతరాయం లేని విద్యుత్ సరఫరా చాలా కీలకమని ప్రభుత్వానికి గుర్తు చేశారు. పిఎం సూర్య ఘర్ మఫ్త్ బిజ్లీ యోజన పథకంలోకి అంగన్ వాడీ కేంద్రాలను తీసుకువచ్చి పిల్లలకు ప్రాథమిక సౌకర్యాలు కల్పించడంలో తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.