పెనమలూరు (గంగూరు), నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృష్ణాజిల్లా పర్యటనలో భాగంగా శుక్రవారం గంగూరు రైతు సేవా కేంద్రం సందర్శించారు. అనంతరం హెలిపాడ్ వద్ద ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో గత ఏడాది 12.55 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం సేకరించగా, ఈ ఏడాది ఇప్పటికే 21.42 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరిం 3.20 లక్షల మంది రైతులను భాగస్వామ్యం చేశామని అన్నారు. గతంలో దాన్ని అమ్మిన రైతులకు బకాయిలు పెట్టి ఐదారు నెలలు డబ్బులు ఇచ్చే వారు కాదని, ఏడాది తమ ప్రభుత్వంలో 48 గంటల్లోగా దాన్ని విక్రయించిన రైతుకు డబ్బులు వారి ఖాతాలో జమ చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు రు. 4733 కోట్ల రూపాయలు 3,13,670 మంది రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు, ఇందులో 93 శాతం మందికి 24 గంటల్లో గానే జమ చేసినట్లు తెలిపారు. వీలైతే ఇంకా ముందుగానే రైతులకు చెల్లించేలా, ధాన్యం సేకరణ మరింత ఎఫెక్టివ్ గా అమలుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.
ధాన్యం తేమ శాతం టెస్టింగ్ లో రైతు సేవ కేంద్రంలో, మిల్లులో తేడాలు వస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయని, ఈరోజు గంగూరులో రైతు సేవా కేంద్రంలో రైతు సాంబశివరావు ధాన్యం తేమశాతం స్వయంగా పరిశీలించినట్లు తెలిపారు. రైతు సేవ కేంద్రంలోనూ, రైస్ మిల్లులోను తేడాలు రాకుండా స్థిరీకరణ విధానం అమలుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించామన్నారు. గత ఏడాది 3.83 కోట్ల సంచులు వినియోగించగా , గోనె సంచులు సమస్య ఏర్పడకుండా ఈ ఏడాది 5 కోట్ల గోని సంచులు సరఫరా చేస్తున్నామన్నారు.
డ్రైయర్ల సమస్య పరిష్కరించేందుకు మొబైల్ డ్రయర్స్ వినియోగించడం లేదా హార్వెస్టర్ లోనే డ్రై చేసే ఏర్పాటు ఉంటే రైతులకు సులువుగా ఉంటుందని అన్నారు. ధాన్యాన్ని రైతు వద్దనే స్టోరేజ్ పెట్టుకుంటే ఆ దాన్యానికి డిమాండ్ ఉంటుందని, మంచి ధర వస్తుందని అన్నారు పండించే పంటకు డిమాండ్ రావాలంటే వినియోగం పెరగాలని టెక్నాలజీ వినియోగం ద్వారా ఖర్చు తగ్గుతుందని, దిగుబడి పెరుగుతుందని అన్నారు. రైతు సాగు ఖర్చు తగ్గాలి, రైతుల యొక్క అప్పు తగ్గాలి, టెక్నాలజీ వినియోగం ద్వారానే సాధ్యమన్నారు. ఫేషియల్ అగ్రికల్చర్ అమలులో మొబైల్ యాప్ ద్వారా రైతు తన పొలంలో తెగుళ్లు గుర్తించి, ద్రోన్ వినియోగించి తెగులు ఉన్నచోటే పంటపై తెగులు నివారణ మందులు పిచికారి చేసే విధానం అమలులోకి తేవాలని, తద్వారా పంటల దిగుబడి పెరిగి, రైతుకు ఆదాయం పెరుగుతుందని ఇలాంటి ఆధునిక వ్యవసాయ పద్ధతులు తేవడానికి కృషి చేస్తామని అన్నారు.