-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
భవానీ దీక్షల విరమణ సందర్భంగా అమ్మవారి భక్తులకు ఎటువంటి లోపం లేకుండా చూసుకోవాలని అన్నారు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర. శనివారం ఉదయం భవానీ దీక్షల విరమణ సందర్భంగా వినాయకుడి గుడి, సీతమ్మ పాదాలు, దుర్గా ఘాట్, కృష్ణవేణి ఘాట్, ప్రాంతాలని పర్యటించే క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ అమ్మవారి దర్శనానికి వచ్చే భవాని భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా 35 ప్రదేశాలలో త్రాగునీటి పాయింట్లు, 8 ప్రాంతాలలో తాత్కాలిక మరుగుదొడ్లు, 6 ప్రదేశాలలో క్లోక్ రూమ్లును భక్తుల కోసం ఏర్పాటు చేశామని తెలిపారు. పారిశుద్ధ్య నిర్వహణ కోసం ప్రత్యేకంగా 1400 పారిశుద్ధ్య కార్మికులను భవానీ దీక్షల విరమణ ఏర్పాటు కోసం 38 ప్రదేశాలలో కేటాయించి 24 గంటలు విజయవాడ నగర పాలక సంస్థ వారి డ్రోన్ల పర్యవేక్షణతో పారిశుధ్య నిర్వహణలో ఎటువంటి లోపం లేకుండా చూసుకుంటున్నామని, అన్నారు. భవాని దీక్ష విరమణ లో భక్తుల వదిలే వస్త్రాలను కన్వెయర్ బెల్ట్ ద్వారా ఎప్పటికప్పుడు తీసేయాలని, దాన్ని అధికారులు పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు చూసుకోవాలని ఆదేశించారు. శాఖధిపతులందరూ భవాని దీక్ష విరమణ సమయంలో విజయవాడ నగరపాలక సంస్థ వారు ఏర్పాటు చేస్తున్న ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉంటారని అన్నారు. 24 గంటలు అందుబాటులో ఉండే ప్రత్యేక కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూసుకుంటున్నామని తెలిపారు.
ఈ పర్యటనలో అడిషనల్ కమిషనర్ (ప్రాజెక్ట్) డాక్టర్ డి చంద్రశేఖర్, జోనల్ కమిషనర్ రమ్య కీర్తన, చీఫ్ ఇంజనీర్ ఆర్ శ్రీనాథ్, ఇన్చార్జి చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ సురేష్ బాబు, సుప్రింటెంటింగ్ ఇంజనీర్ వర్క్స్ సత్యనారాయణ, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వెంకటేశ్వర రెడ్డి, ఎస్టేట్ ఆఫీసర్ టి.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.