– వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చూసి కూటమి సర్కారు భయపడుతోందని వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేర్కొన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఆంధ్రప్రభ కాలనీలోని జనహిత సదనంలో శనివారం ఘనంగా జరిగాయి. తొలుత డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి, వైసీపీ కార్పొరేటర్లతో కలిసి భారీ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా “హ్యాపీ బర్త్ డే జగనన్న” అంటూ అభిమానులు చేసిన నినాదాలతో ఆ ప్రాంతమంతా హోరెత్తింది. అనంతరం మల్లాది విష్ణు మాట్లాడుతూ.. వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలతో రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండుగ వాతావరణం వచ్చిందన్నారు. ప్రజాసంకల్పయాత్ర ద్వారా ప్రజల సమస్యలు తెలుసుకోవడమే కాకుండా.. అధికారంలోకి వచ్చిన తర్వాత 99 శాతం హామీలను అమలు చేసిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పుకొచ్చారు. దళారీ వ్యవస్థకు తావులేకుండా స్వచ్ఛమైన పాలనను అందించి ఐదేళ్లలో పేద, మద్య తరగతి ప్రజలకు డీబీటీ, నాన్-డీబీటీ ద్వారా అక్షరాల రూ.2,83,866 కోట్ల మేలు చేకూర్చినట్లు వెల్లడించారు. ఒక్క సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోనే రూ. 402.46 కోట్ల సంక్షేమాన్ని అందజేసినట్లు వివరించారు. విద్య, వైద్య, వ్యవసాయ రంగాలలో విప్లవాత్మక సంస్కరణలు తీసుకురావడంతో పాటు మహిళలను ఒక బలమైన శక్తిగా తీర్చిదిద్దారని చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆరు నెలల కాలంలో గ్రామ, వార్డు సచివాలయాలు ఏర్పాటు చేసి.. 1.34 లక్షల మందికి ఉద్యోగావకాశాలు కల్పించారన్నారు. కరోనా లాంటి విపత్తు సమయాలలో., వరదలు, తుఫాన్లు వచ్చినప్పుడు ప్రజల ప్రాణాలకు అత్యధిక ప్రాధాన్యతనిచ్చి.. సంయమనంతో పరిస్థితులను చక్కదిద్ది వారిలో ధైర్యాన్ని నింపారని చెప్పారు. అలాగే స్వతంత్య్ర భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలోనూ లేనంతగా ఆంధ్రప్రదేశ్ లో సామాజిక న్యాయం పాటించి వైఎస్ జగన్ జాతీయ స్థాయిలో అందరి దృష్టిని ఆకర్షించారన్నారు. కనుకనే ఈ ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణితో ఆయన జన్మదిన వేడుకలను అడ్డుకుంటోందని మల్లాది విష్ణు మండిపడ్డారు. తమ హయాంలో ఏనాడూ చంద్రబాబు, స్వర్గీయ ఎన్టీఆర్ జన్మదిన వేడుకలను అడ్డుకోలేదని.. కానీ కూటమి ప్రభుత్వం నిరంకుశ విధానంతో వ్యవహరించడం సరికాదన్నారు.
కూటమిది అతుకుల బొంత పాలన
కూటమి ప్రభుత్వానిది అతుకుల బొంత పాలన అని మల్లాది విష్ణు విమర్శించారు. మూడు రాజకీయ పార్టీలు కలిసి పాలన చేస్తున్నా.. ఇప్పటివరకు పేదవాడికి ఏ ఒక్క ప్రయోజనం చేకూరలేదన్నారు. పైగా బడుగు బలహీన వర్గాలపై దాడులు., మహిళలపై అఘాయిత్యాలు నిత్యకృత్యమయ్యాయని ఆరోపించారు. అన్నదాతలకు కనీస మద్ధతు లభించడం లేదని., విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆరున్నర నెలల కాలంలో పేదలకు ఒక్క సంక్షేమ కార్యక్రమం అమలు చేయకపోగా.. భారాలు వేస్తూ రాష్ట్ర ప్రజల రక్తాన్ని పీల్చేస్తున్నారని దుయ్యబట్టారు. నిత్యావసర ధరలు విపరీతంగా పెరిగిపోయాయని, రూ. 15 వేల కోట్ల విద్యుత్ ఛార్జీల భారాలతో సామాన్యుడి నడ్డి విరవగా.. జనవరి 1 నుంచి భూములు, రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపుతో మరో పెనుభారం మోపేందుకు సిద్ధమయ్యారని నిప్పులు చెరిగారు. బుడమేరు వరద బాధితులకు నేటికీ సంపూర్ణ న్యాయం జరగలేదని ఆరోపించారు. ఇలా ప్రతి విషయంలోనూ కూటమి ప్రభుత్వం పూర్తిగా అట్టర్ ఫెయిల్యూర్ అయిందని విమర్శించారు. ఈ ప్రభుత్వ నిరంకుశ విధానాలపై పోరాడేందుకు ప్రతిఒక్కరూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అడుగులో అడుగు వేసి ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
తోపుడు బండ్లు పంపిణీ
అనంతరం వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని మల్లాది వేంకట సుబ్బారావు – బాలత్రిపుర సుందరమ్మ ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 10 మంది పేదలకు తోపుడు బండ్లను పంపిణీ చేశారు. నేటి సమాజంలో ప్రతి ఒక్కరూ సేవాగుణం కలిగి ఉండాలని.. ప్రతిఒక్కరూ తమకు తోచినంతలో తోటి వారికి సాయపడాలని ఈ సందర్భంగా సూచించారు. డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం పాలనలో పూర్తిగా వైఫల్యం చెందిందని విమర్శించారు. ఆర్థిక సంక్షోభం పేరుతో నిర్వర్తించవలసిన బాధ్యతల నుంచి తప్పుకుంటున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గూర్చి చంద్రబాబుకు ఎన్నికలకు ముందు తెలియదా..? అని సూటిగా ప్రశ్నించారు. కేవలం 6 నెలల కాలంలోనే కూటమి పాలనతో ప్రజలు విసుకుచెందారని.. వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని మరలా ప్రజలందరూ బలంగా కోరుకుంటున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో వైసీపీ కార్పొరేటర్లు శర్వాణీ మూర్తి, ఎండి షాహినా సుల్తానా హఫీజుల్లా, అలంపూర్ విజయలక్ష్మి, యరగొర్ల తిరుపతమ్మ శ్రీరాములు, కొండాయిగుంట మల్లీశ్వరి, డివిజన్ ఇంఛార్జిలు, కోఆర్డినేటర్లు, పార్టీ శ్రేణులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.