Breaking News

సాగు నీటి సంఘాల వ్యవస్థలన్నీ పునర్జీవం పోసుకుంటున్నాయి…

బాపట్ల, నేటి పత్రిక ప్రజావార్త :
అలంకారప్రాయంగా మారిన సాగు నీటి సంఘాల వ్యవస్థలన్నీ పునర్జీవం పోసుకుంటున్నాయని జిల్లా ఇంచార్జి మంత్రి, రాష్ట్ర గృహా నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి, కొలుసు పార్ధసారధి అన్నారు.

బాపట్ల జిల్లా పరిధిలోని కృష్ణా పశ్చిమ డెల్టా ప్రాజెక్ట్ కమిటీ ఎన్నికలు అమర్తలూరు మండలం కూచిపూడి గ్రామంలోని జల వనరుల శాఖ డిఈ కార్యాలయంలో శనివారం జరిగాయి. చైర్మన్ పదవికి పంతాని మురళీధర్, వైస్ చైర్మన్ పదవికి నువ్వుల సునీల్ చౌదరి నామినేషన్ దాఖలు చేశారు. సంఘాల కమిటీ సభ్యులంతా వారిరువురికే మద్దతునిచ్చారు. దీంతో ఎన్నికలు ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారి, జిల్లా వనరుల శాఖ ఎస్ఈ ఎస్ కె అభూతలీమ్ అధికారికంగా ప్రకటించారు. చైర్మన్ గా పంతాని మురళీధర్, వైస్ చైర్మన్ గా నువ్వుల సునీల్ చౌదరి ఎన్నిక ఏకగ్రీవమైనట్లు ధ్రువీకరణ పత్రాలను అందజేశారు. కార్యక్రమానికి హాజరైన జిల్లా ఇంచార్జి మంత్రి పార్ధసారధి నీటి సంఘాల చైర్మన్, వైస్ చైర్మన్ లకు అభినందనలు తెలిపారు. అనంతరం ఎన్నికైన వారికి వేమూరు శాసన సభ్యులు నక్కా ఆనంద్ బాబు, ప్రత్తిపాడు శాసనసభ్యులు బి రామాంజనేయులు, అధికారులు అభినందనలు తెలిపారు.

ప్రతి చివరి భూమికి సాగు నీరు తీసుకువెళ్లడమే ప్రభుత్వ లక్ష్యమని జిల్లా ఇంచార్జి మంత్రి పార్ధసారధి తెలిపారు. జలవనరులు, వ్యవసాయ రంగాలకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందన్నారు. వ్యవసాయంపై ఆధారపడిన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లడానికి సీఎం అహర్నిశల పనిచేస్తున్నారన్నారు. నీటి సంఘాల వ్యవస్థను బలోపేతం చేయడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి సారించారన్నారు. వ్యవసాయ రంగంలో అడ్డంకులన్నీ తొలగించి, రైతులకు ప్రయోజనం చేకూర్చేందుకు కృషి చేస్తున్నారని తెలిపారు. ఇబ్బందులు పడుతున్న రైతులను ఆదుకోవడానికి సాగునీటి సంఘాల వ్యవస్థ చాలా అవసరమని ప్రభుత్వం గుర్తించిందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీసుకుంటున్న నిర్ణయాలతో నిర్వీర్యం అయిపోతున్న నీటి సంఘాలు పునర్జీవం పోసుకుంటున్నాయని వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడ ఎలాంటి గొడవలు లేకుండా ప్రశాంత వాతావరణంలో సాగునీటి సంఘాల ఎన్నికలు జరిగాయన్నారు. ఇందుకోసం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, హెచ్ ఆర్ డి, విద్యాశాఖాలమంత్రి నారా లోకేష్ బాబు ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధులంతా కలిసి పనిచేస్తున్నారన్నారు. సంఘాలు బలంగా ఉంటే రైతులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. దీంతో కృష్ణ పశ్చిమ డెల్టా కింద ఉన్న నీటి సంఘాలన్నీ బలంగా మారుతాయన్నారు. తద్వారా రైతులు లబ్ది పొందుతారని చెప్పారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం ఇప్పటికే జాప్యంపై ప్రభుత్వానికి రూ.వేలకోట్ల నష్టం వచ్చిందన్నారు. ఇకనుంచి జాప్యం లేకుండా నిర్మించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. గడిచిన ఐదేళ్లలో రైతులు సుమారుగా రూ.పదివేల కోట్లు నష్ట పోయారన్నారు. చింతలపూడి ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి చేయడానికి ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంటుందన్నారు. ప్రజలకు మెరుగైన పాలన అందించే దిశగా ప్రజాప్రతినిధులంతా ఎంతో సహాయ సహకారాలు అందిస్తున్నారని చెప్పారు.

రాష్ట్రంలో ప్రజా సంక్షేమ పాలన సాగుతోందని వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనంద్ బాబు చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రైతులకు ఎంతో మేలు జరుగుతోందన్నారు. రైతుల సంక్షేమమే లక్ష్యంతో ప్రభుత్వం పని చేస్తుందన్నారు. రైతుల అభివృద్ధి కొరకు నీటి సంఘాల ఎన్నికలు జరిగాయన్నారు.

రైతుల అభివృద్ధికి వారే పరిపాలన సాగించుకునే వ్యవస్థను ప్రభుత్వం బలోపేతం చేస్తుందని పత్తిపాడు శాసనసభ్యులు బి రామాంజనేయులు తెలిపారు. రైతులే రాజులు కావాలని ప్రభుత్వం ఉద్దేశించిందన్నారు. ప్రతి ఎకరాకు సాగు నీరు అందించడానికి ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తుందన్నారు. రైతుల అభివృద్ధి కొరకు ప్రభుత్వం పాటుపడుతోందన్నారు.

ఈ కార్యక్రమానికి ఎన్నికల అధికారి ఎస్ కె అభూతలీమ్, జలవనరుల ప్రాజెక్టు గుంటూరు ఎస్ఈ పి వెంకటరత్నం, రేపల్లె ఆర్డిఓ రామలక్ష్మి, సహాయ ఎన్నికల అధికారి, చీరాల డిఈ ఎన్ కె వి ప్రసాద్, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Check Also

సేవా సంస్థలు ఐక్యంగా కృషి చేయాలి

-వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి, జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలోని సేవా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *