-శాప్ ఛైర్మన్ అనిమిని రవినాయుడు
-ఆర్మీ అడ్వెంచర్ వింగ్ డైరెక్టర్ కల్నల్ చౌహాన్‌తో భేటీ
-అడ్వెంచర్ స్పోర్ట్స్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటుకు వినతి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
క్రీడారంగానికి పెద్దపీట వేస్తున్న ఆంధ్రప్రదేశ్‌లో సాహసోపేత క్రీడా కార్యకలాపాలను నిర్వహించాలని, సాహస క్రీడా నైపుణ్యాల శిక్షణా కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయాలని ఏపీ స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ అనిమిని రవినాయుడు ఆకాంక్షించారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ఆర్మీ అడ్వెంచర్ వింగ్ డైరెక్టర్ కల్నల్ పీఎస్ చౌహాన్‌ను, ఆయన బృందాన్ని శాప్ ఛైర్మన్ శనివారం కలిశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో అడ్వెంచర్ స్పోర్ట్స్ యాక్టివిటీస్‌కు సంబంధించిన అంశాలపై కల్నల్ బృందంతో ఆయన సమీక్షించారు. అడ్వెంచర్ స్పోర్ట్స్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటుకు కావాల్సిన సౌకర్యాలను కల్పించేందుకు రాష్ట్రప్రభుత్వం అన్నివిధాలుగా సహకరిస్తుందని విన్నవించారు. దీనిపై కల్నల్ చౌహాన్ కూడా సానుకూలంగా స్పందించారని రవినాయుడు తెలియజేశారు.
తైక్వాండోను విస్తృతం చేస్తాం..
ఢిల్లీలో కొరియన్ కల్చరల్ సెంటర్ మరియు ఇండియా తైక్వాండో సంయుక్తంగా నిర్వహించిన ఆల్ ఇండియా తైక్వాండో లీడర్స్ సెమినార్‌లో శాప్ ఛైర్మన్ రవినాయుడు శనివారం పాల్గొన్నారు. ప్రోగ్రామ్ నిర్వాహకుల ఆహ్వానం మేరకు సెమినార్‌లో ఆయన క్రీడలను ఉద్దేశిస్తూ ఏపీలో అమలు చేస్తున్న నూతన స్పోర్ట్స్ పాలసీల గురించి వివరించారు. అనంతరం ఏపీలోనూ తైక్వాండోను విస్తృతం చేసేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కొరియన్ కల్చరల్ సెంటర్, ఇండియా తైక్వాండో సభ్యులు రవినాయుడు ని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో లైఫ్ సేవింగ్ స్పోర్ట్స్ కమిషన్ ఛైర్మన్ ప్రదీప్‌నాయుడు, తదితరులున్నారు.