-వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి, జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరంలోని సేవా సంస్థలన్నీ ఐక్యంగా కృషి చేసి, అనాధలు, నిర్భాగ్యులు, మానసిక వికలాంగుల అభ్యున్నతి కోసం ప్రయత్నించాలని జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి పేర్కొన్నారు. ఈనెల 21వ తేదీ శనివారం గుంటూరులోని గోరంట్ల వద్ద గల కార్మెల్ సేవా సదన్ ప్రాంగణంలో జరిగిన సేవా సంస్థల ఆత్మీయ సదస్సులో కార్మల్ సేవా సదన్ వ్యవస్థాపకులు జాక్ క్లమాకస్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి ప్రసంగిస్తూ అత్యధిక అసమానతలు గల భారత సమాజంలో కడు పేదలు, నిర్భాగ్యుల కోసం సేవా సంస్థలు కృషి చేయవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కార్మెల్ సేవా సదన్ గత రెండు దశాబ్దాలుగా దాదాపు 400 మంది మానసిక వికలాంగులకు ఉచితంగా భోజన, వసతి, ఆరోగ్య సదుపాయాలు కల్పించడం హర్షనీయమన్నారు. కార్మెల్ సేవా సదన్ ను ప్రారంభించిన జాక్ క్లమాకస్ ధన్యజీవి అని, ఎంతోమంది నిరాశ్రయులకు ఆసరా కల్పించారని తెలిపారు. గుంటూరు నగరంలోని దాతృత్వం గల వ్యక్తులు, సంస్థలు ముందుకు వచ్చి కార్మెల్ సేవా సదన్ మానసిక వికలాంగుల ఆశ్రమాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలని కోరారు.
కార్మెల్ సేవా సదన్ వ్యవస్థాపకులు జాక్ క్లమాకస్ మాట్లాడుతూ మనిషి భౌతిక అవసరాలకు ఇచ్చే ప్రాధాన్యత కన్నా ఆత్మ సంతృప్తిని పొందే సేవా కార్యక్రమాల ద్వారా మరింత సంతృప్తిని పొందగలమని తెలిపారు. గత రెండు దశాబ్దాలుగా వేలాదిమంది మానసిక వికలాంగులకు సేవలు అందించడం తనకు ఎంతో సంతృప్తినిచ్చిందని వివరించారు. కార్మెల్ సేవాసదనకు 50 సెంట్లు భూమిని అందించిన పూర్వ సర్పంచ్ కందుల సుబ్బారావుకు, 70 లక్షల రూపాయలతో భవనాలను నిర్మించి ఇచ్చిన ఫాదర్ అల్లం రాయప్ప రెడ్డికి, ప్రహరీ గోడ నిర్మాణానికి 10 లక్షలు వెచ్చిస్తున్న శర్వాణి రెడీమిక్స్ అధినేత పెద్దిరెడ్డి గోపాల్ రెడ్డికి, నిరంతరం సహాయ సహకారాలు అందిస్తున్న మానవత, నేస్తం ఫౌండేషన్, కోవిడ్ ఫైటర్స్, రుద్రా చారిటబుల్ ట్రస్ట్, అమ్మానాన్న చారిటబుల్ ట్రస్ట్ లకు కృతజ్ఞతలు తెలిపారు.
మానవత సంస్థ చైర్మన్ పావులూరి రమేష్ ప్రసంగిస్తూ కుల మతాలకు అతీతంగా మానవతా దృక్పథంతో పనిచేస్తున్న సంస్థల కృషి అద్వితీయమన్నారు. నేస్తం సహ వ్యవస్థాపకులు టి ధనుంజయ రెడ్డి ప్రసంగిస్తూ త్వరలో ప్రహరీ గోడ నిర్మాణం పూర్తయిన అనంతరం స్థానిక శాసనసభ్యులు బూర్ల రామాంజనేయులు చేతులు మీదగా ప్రారంభించుకుంటామని వివరించారు. గోరంట్ల పూర్వ సర్పంచ్ కందుల సుబ్బారావు ప్రసంగిస్తూ కార్మెల్ సేవా సదన్ మరింత అభివృద్ధి కావడానికి కావలసిన రోడ్ల నిర్మాణం, మొక్కల పెంపకం, సిమెంటు బల్లలు లాంటివి కల్పిస్తామని హామీ ఇచ్చారు. కోవిడ్ ఫైటర్స్ వ్యవస్థాపకులు అల్లా బక్షు ప్రసంగిస్తూ గత నాలుగు సంవత్సరాలుగా 150 మంది మానసిక వికలాంగులను కార్మెల్ సేవా సదన్ లో చేర్పించి ఆదుకున్నామన్నారు. దాతల సహకారంతో నూతన అంబులెన్స్ కొనుగోలు చేస్తున్నామని, గుంటూరు నగర పేద ప్రజలకు అందుబాటులో ఉచితంగా సేవలు అందిస్తామన్నారు.
రుద్రా చారిటబుల్ ట్రస్ట్ సుభాని మాట్లాడుతూ కోవిడ్ సమయంలో వేలాది మందికి దహన సంస్కారాలు చేయడం ద్వారా కార్మెల్ సేవా సదన్ పరిచయం అయ్యిందని, కార్మెల్ సేవ సదన్ నిర్భాగ్యులకు వేదికగా మారిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నూతలపాటి ఆంజనేయులు, రామినేని వెంకట్రావు, అమ్మానాన్న చారిటబుల్ ట్రస్ట్ సెక్రెటరీ ఎం రామాంజనేయులు తదితరులు పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ పూర్వ గవర్నర్ వీర ప్రకాష్ మరియు మానవత ఆధ్వర్యంలో కీ.శే. ఇనపూడి వెంకటకృష్ణారావు జ్ఞాపకార్థం నెల రోజులకు సరిపడే నిత్యవసర సరుకులు బహుకరించడమైనది.