Breaking News

కోవిడ్ నిబంధనల ఉల్లంఘనకు పాల్పడితే వ్యాపారస్థులపై చర్యలు…

-వినియోగదారులు నిబంధనలు పాటించేలా చూడాల్సిన బాధ్యత వ్యాపారులదే…
-సానుకూలంగా స్పందించిన వ్యాపారస్థులు…
-కోవిడ్ పై వ్యాపారులతో కలెక్టరు, సిపి సమీక్ష

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వినియోగదారులు కోవిడ్ నియమనిబంధనలు పాటించేలా చూడవలసిన బాధ్యత వ్యాపారస్థులపై ఉందని ఉల్లంఘనకు పాల్పడితే చర్యలు తీసుకునే అవకాశం తమకు కల్పించవద్దని వర్తక, వ్యాపార, వాణిజ్య సంస్థలకు జిల్లా కలెక్టరు జె. నివాస్, పోలీస్ కమిషనరు బత్తిన శ్రీనివాసులు స్పష్టం చేశారు.
వ్యాపార వాణిజ్య సముదాయాలలో కోవిడ్ నిబంధనలు పాటించడం పై వర్తక, వాణిజ్య, హోటల్ అసోసియేషన్స్, రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్స్, రైతుబజార్ల కమిటీ ప్రతినిధులతో శనివారం స్థానిక తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జిల్లాకలెక్టరు జె. నివాస్, నగర పోలీస్ కమిషనరు బత్తిన శ్రీనివాసులు ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా జిల్లా కలెక్టరు మాట్లాడుతూ వినియోగదారులు కోవిడ్ నిబంధనలు తూచతప్పకుండా పాటించవలసిన అవసరం వ్యాపార వర్గాలలో అత్యవసరం అన్నారు. కరోనా వైరస్ సోకే అవకాశాలు రద్దీ ఎక్కువగా వర్తక వాణిజ్య సముదాయాల ద్వారానే ఉంటుందన్నారు. వైరస్ సోకితే ముందుగా రిస్క్యూ యజమానుల పైనే ఉంటుందన్నారు. అందుకే ముందు మిమ్మల్ని మీరు రక్షించుకుని, మీకుటుంబ, బంధువులను రక్షించుకోవాలన్నదే మాఉద్దేశ్యం అన్నారు. వాణిజ్య సముదాయాలలో ఏమాత్రం అప్రమత్తంగా ఉన్నా కరోనా వైరస్ ఒకరి నుండి మరియొకరుకు వేగంగా వ్యాప్తి చెందుతుంది కాబట్టి అటువంటి పరిణామాలకు తావు లేకుండా యాజమాన్యాలు పూర్తి పర్యవేక్షణ బాధ్యతలను తీసుకోవాలన్నారు. కరోనా కట్టడి చర్యల్లో
భాగంగానే ముందస్తు హెచ్చరికలు చేస్తున్నామే తప్ప మీపై పెనాల్టీలు వేయాలన్నది తమ అభిమతం కాదన్నారు. వాణిజ్య ప్రాంతాలలో యజమానులు ఒకకమిటీగా ఏర్పడి కోవిడ్ నిబంధనలు అమలుకు చర్యలు తీసుకోవాలన్నారు. కోవిడ్ నిబంధనలను అనుసరించి పద్ధతి ప్రకారం నడుచుకోకపోతే మొదటిలో హెచ్చరికతో, రెండవసారి రూ. 10 వేల నుండి 25 వేల వరకూ పెనాల్టీలు విధించడం జరుగుతుందన్నారు. అప్పటికీ నిబంధనలు పాటించడంలో అలసత్వం వహిస్తే ఆయా దుకాణాలు, షాపింగ్ మాల్స్, మార్కెట్లను మూసివేసేందుకు వెనుకాడబోమన్నారు. గత డిశంబరు ముఖ్యంగా జనవరి ఫిబ్రవరి మాసాల్లో కరోనా సంగతి మరచిపోయి అన్ని వ్యవస్థల్లో తేలికభావం ఏర్పడిందన్నారు. ఇది కరోనా వ్యాప్తికి మార్గం తెరవడమేనని ఆయన పేర్కొన్నారు. అప్పుడు అది మనతప్పిదమే అవుతుందే తప్ప ఇతరులు వేరేవారు అందుకు కారణం కాదన్నారు. థర్డ్ వేవ్ దృష్టిలో ఉంచుకుని ప్రస్తుతం 144 సెక్షన్ అమల్లో ఉందన్నారు. ఈనెల 22 నుంచి 30వ తేదీవరకూ 144 సెక్షన్ ను అమలు పొడిగించడం జరిగిందన్నారు. కోవిడ్ నిబంధనలు అనుసరించని ఆసుపత్రులపై ముఖ్యమంత్రి ఆదేశాలుమేరకు రెండవసారి తప్పుచేస్తే క్రిమినల్ కేసులు కూడా నమోదు చేయడం జరిగిందన్నారు. కోవిడ్ నిబంధనలు ఉల్లంఘనకు పాల్పడితే పెనాల్టీలు విధించే విషయంపై ప్రభుత్వ ఉత్తర్వులు నెం. 371 లో స్పష్టంగా తెలియజేయబడిందన్నారు. ఏదైనా మార్కెట్లో పూర్తి స్థాయిలో కోవిడ్ నిబంధనలు పాటించకపోతే మొత్తం మార్కెట్ ను మూసివేసే అవకాశం ఉందన్నారు. నిబంధనలు పాటించడంలో ప్రతీ ఒక్కరూ పూర్తి సహకారం అందించాలన్నారు. అంతేగానీ చర్యలు తీసుకునేందుకు ఎంతమాత్రం అవకాశం కల్పించవద్దన్నారు.
ప్రతీ ఒక్కరూ మాస్క్ ధరించడంతోపాటు తమ సిబ్బంది అంతా మాస్క్ లు ధరించేలా చూడాలన్నారు. దుకాణాలు ముందు మాస్క్ లేనిదే ప్రవేశం లేదనే విషయాన్ని స్పష్టంగా తెలియజేసే సూచిక బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు. ఇది మీరక్షణకోసమైనా పెట్టవలసి ఉందన్నారు. శానిటైజేషన్ సౌకర్యం ఏర్పాటు చేయడంతోపాటు
భౌతికదూరం పాటించడంలో పూర్తి శ్రద్ధ పెట్టాలన్నారు. మాల్స్, బట్టలషాపులు, ఇతర వర్తక, వాణిజ్య సంస్థలలో వినియోగదారులు క్యూపద్ధతిలో కొనుగోలు చేసుకునేందుకు అవకాశం కల్పించాలన్నారు. రైతుబజార్లు, చేపలు, చికెన్, మటన్ మార్కెట్ల వద్ద మరీ ముఖ్యంగా శని, ఆదివారాల్లో విపరీతమైన రద్దీ కనబడుతున్నదని అక్కడ కూడా క్యూలైన్లు నిర్వహించాలన్నారు. చిన్నా, పెద్ద హోటలలో హ్యాండ్ వాష్, శానిటైజేషన్ సౌకర్యం కల్పించాలన్నారు. లాడ్జీలలో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ శానిటైజేషన్ సౌకర్యం కల్పించాలన్నారు. ఏర్పాట్లుకోసం 3 రోజుల సమయం ఇస్తున్నామని ఆతర్వాత క్షేత్రస్థాయిలో పరిశీలించి కోవిడ్ నిబంధనలు పాటించినవారి పై కఠిన చర్యలు ఉంటాయన్నారు. ఇందుకోసం డివిజన్ వారీగా ఆయా సచివాలయ వార్డు శానిటరీ ఇన్స్ పెక్టర్ , మహిళా పోలీతో కూడిన 60 బృందాలను ఏర్పాటు చేస్తామన్నారు.

నగర పోలీస్ కమిషనరు బత్తిన శ్రీనివాసులు మాట్లాడుతూ స్వీయ క్రమశిక్షణతోనే కరోనా వ్యాప్తి కట్టడి సాధ్యమన్నారు. విచ్చలవిడిగా వ్యవహరిస్తే మాత్రం సెప్టెంబరు మాసంలో కరోనావ్యాప్తి శిఖరాగ్రానికి వెళుతుందన్నారు. ఇప్పటికే రెండు వేల ద్వారా కరోనా బారిన పడినవారిని, చవిచూసిన వారిని చూసామన్నారు. ఆసుపత్రుల పడకలు, ఇతర సౌకర్యాలు అందక ఒక్కసారిగా దేశమంతా ఊగిపోయిందన్నారు. ఇటువంటి పరిస్థితులు భవిష్యత్తులో రాకుండా ఉండాలంటే స్వీయనియంత్రణ అవసరం అన్నారు. ప్రస్తుతం కరోనా కొద్ది మేర తగ్గుముఖంపట్టడంతో ప్రజలు యధారాజా, తథారాజాగా ఎంతో అజాగ్రత్తగా వ్యవహరిస్తున్నారన్నారు. ఇది ఎంతమాత్రం తగదన్నారు. కరోనాకు స్పష్టమైన వైద్యం అంటూ ఏదీ లేదని వ్యాక్సిన్ పొందడమే ఊరటకలిగించేదన్నారు. కరోనా సోకి 30 లక్షలు ఖర్చు పెట్టినా ఒక డిసిపి హాస్పటల్ లో మరణించారని, మరో డియస్ పి నెలాపది రోజులు కరోనాతో పోరాటం చేస్తూ ఇంకా ఇబ్బందులు పడుతూనే ఉన్నారన్న విషయాలను సిపి శ్రీనివాసులు ఈ సందర్భంగా ప్రస్తావించారు. కర్ఫ్యూ సమయంలో మాస్క్ లు లేనివారి పై చలానా వ్రాద్దామంటే అందరూ ధరించే ఉండేవారని కర్ఫ్యూ సడలింపులతో కొంతమంది మాస్క్ లు ధరించకపోవడం విచారకరం అన్నారు. మాస్క్ లేనివారి పై పెనాల్టీలు విధించడం జరుగుతుందన్నారు. బట్టలషాపులు, రెస్టారెంట్లు, ఇతర వ్యాపార సంస్థలకు వచ్చే జనాలు మాస్క్ లేకుండా వస్తే నిర్దాక్షిణ్యంగా తిప్పి పంపాలన్నారు. షాపులకు వచ్చే జనాలను పద్ద తిప్రకారం క్రమబద్దీ కరించుకునే ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. కోవిడ్ నిబంధనలు ఉల్లంఘనకు పాల్పడితే మాత్రం మరిన్ని రోజులు కర్ఫ్యూ కొనసాగుతుందన్నారు. సిటీ పోలీస్ పరిధిలో 3500 మంది సిబ్బంది ఉండగా వారిలో 1000 మంది వరకూ కరోనా బారిన పడ్డారన్నారు. కరోనా కట్టడికి అమలు చేసే నిబంధనలు పాటించడంపై ప్రజలు సహకరిస్తే పోలీసులకు రెట్టింపు కష్టం తగ్గుతుందన్నారు. అందరూ సహకరిస్తేనే 3వ వేవ్ రాకుండా గట్టి ప్రయత్నం చేద్దామన్నారు. వ్యాక్సిన్ వేయించుకునే వారిని మరింత ప్రోత్సహించాలన్నారు. 70 నుంచి 75 శాతం మంది ప్రజలు కోవిడ్ టీకా పొందేవరకూ చాలా ఓపికపడుతూ జాగ్రత్తలు పాటించాలన్నారు. హోటల్స్, కళ్యాణమండపాలలో ఆయా నిడివినిబట్టి 50 శాతంమించి సీట్లు వేయకుండా చూడాలన్నారు. మున్సిపల్, రెవెన్యూ, పోలీసులతో కూడిన స్క్వా లను నియమిస్తామని వారు ఆయా మార్కెట్లు, తదతర వాణిజ్య సంస్థలను పరిశీలిస్తారన్నారు. నిబంధనలు ఉల్లంఘించేవారి పై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు.

దిశాయాప్ పై అవగాహన…
మహిళల రక్షణకొరకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన దిశాయాప్ పై అవగాహన కలిగించేందుకు ప్రచురించిన పోస్టర్లను, తదితరాలను షాపులకు అందజేస్తామని వాటిని ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. సెల్‌ఫోన్ షాపులకు వచ్చేవారితో దిశాయాప్ డౌన్లోడ్ చేసేలా చూడాలన్నారు.
కేదారేశ్వరరావు పేట పండ్ల మార్కెట్ కు చెందిన నాగేశ్వరరావు మాట్లాడుతూ మార్కెట్లో తక్కువ స్థలాభావంతో రద్దీ ఉంటున్నదని ఈమార్కెట్ ను సిటి వెలుపలకు తరలించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. వస్త్రలతకు చెందిన ఓలేటి జగన్మోహనరావు మాట్లాడుతూ వస్త్రలతలో సంవత్సరంన్నర కాలంగా చాలా ఇబ్బందులు పడుతున్నామన్నారు. మార్కెట్లో సభ్యులకు, గుమస్తాలకు, ముఠాకార్మికులకు నిత్యం మైకు ద్వారా కోవిడ్ నిబంధనలు పాటించడంపై అవగాహన చేస్తున్నామన్నారు. రద్దీని నియంత్రించేందుకు పోలీస్ శాఖ తరపున కూడా మార్కెట్లో రోజూ ఒకటి రెండు సార్లు పెట్రోలింగ్ నిర్వహించాలన్నారు. క్రొత్త పేట హనుమంతరాయ ఫిష్ మార్కెట్ కు చెందిన ప్రతినిధి మాట్లాడుతూ ఆదివారం మాత్రమే రద్దీ ఎక్కువ ఉంటుందన్నారు. వియంసి వారు శానిటైజేషన్ బాగా చేస్తున్నారన్నారు. కోవిడ్ నిబంధనలు పై స్థానికంగా సమావేశం నిర్వహించి అందరికీ తెలియజేస్తామన్నారు. మంచి సమయంలో ఇటువంటి సమావేశం ఏర్పాటు చేసినందుకు కలెక్టరు జె.నివాస్ కు ఆయన ధన్యవాదాలు తెలిపారు. వియంసి ప్లవర్ మార్కెట్ కు చెందిన సయ్యద్ రఫీ మాట్లాడుతూ మార్కెట్ లోకి మూడు మార్గాలు ఉన్నాయన్నారు. ఒక లేడి కాని స్టేబుల్ మార్కెట్లో ప్రతీ 10 నిమిషాలకు ఒకసారి పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. యూరినల్స్ కోసం టాయిలెట్ సౌకర్యం కల్పించాలని కోరారు. మున్సిపల్ మార్కెట్ కు చెందిన షేక్ ఖాదర్ సా హెబ్ మాట్లాడుతూ 10 దశాబ్దాల క్రితం అప్పటి ప్రజానీకానికి అనుగుణంగా 40 షాపులతో మార్కెట్ ఏర్పాటు చేశారన్నారు. అయితే ప్రస్తుతం రద్దీ ఎక్కువుగా ఉన్నందున విజయవాడ బయట షాపులు నిర్మిస్తే వెళ్లిపోతామని తెలిపారు. చిట్టినగర్ లోని కళ్యాణమండపం నిర్వాహకులు శ్రీనివాసరావు మాట్లాడుతూ స్థానికంగా వియంసి, రెవెన్యూ, పోలీస్ అధికారులతో సమావేశాలు నిర్వహిస్తే బాగుంటుందని సూచించారు. కళ్యాణమండపాలకు ఎదురుగుండా ఉంటున్న చెత్త సేకరణ డబ్బాలను ఎప్పటికప్పుడు తొలగించాలని కోరారు. గుడ్ మార్నింగ్ ఫాస్ట్ ఫుడ్ నిర్వాహకులుమాట్లాడుతూ కోవిడ్ నిబంధనలపై ప్రజలకు తెలియజేసే సమయంలో వారు అవ హేళనగా వ్యవహరిస్తున్నారన్నారు. ఇటువంటి వారి పై ఫైన్ విధించేందుకు ప్రస్తుతం వియంసి తరపున ఒక వాహనం పెట్రోలింగ్ తిరుగుతున్నదని ఆసంఖ్యను మరింత పెంచాలన్నారు.
సమావేశంలో జాయింట్ కలెక్టరు (అభివృద్ధి) యల్. శివశంకర్, ఇన్ ఛార్జ్ మున్సిపల్ కమిషనరు యు. శారదాదేవి, డియం హెచ్ఓ డా. యం. సుహాసిని, యుసిడి పిడి జె. అరుణ, సియం హెచ్ఓ డా. గీతాభాయి, తదితరులు పాల్గొన్నారు.

Check Also

పేదల కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి వంగవీటి మోహన రంగా

– వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేద ప్రజల కోసం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *