విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పెనమలూరుకు చెందిన కౌలు రైతు మోర్ల నాగభూషణం ఈ ఏడాది ఫిబ్రవరి 19న ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన పై శనివారం విజయవాడ సబ్ కలెక్టరు జియస్ యస్. ప్రవీణ్ చంద్ విచారణ నిర్వహించారు. సదరు రైతు కుటుంబానికి ప్రభుత్వ ఉత్తర్వులు 102 ప్రకారం ఆర్ధిక సహాయం మంజూరు చేసేందుకు విచారణ చేపట్టిన్నట్లు సబ్ కలెక్టరు ప్రవీణ్ చంద్ తెలిపారు. పెనమలూరులోని మోర్ల నాగభూషణం ఇంటి వద్ద విజయవాడ ఈస్ట్ అసిస్టెంట్ కమిషనరు ఆఫ్ పోలీస్ భాషా, వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టరు సునీల్ తో కలిసి సయుక్త విచారణ జరిపారు. అనంతరం పెనమలూరు గ్రామంలో వ్యవసాయ శాఖ నిర్వహిస్తున్న ఇ-క్రాఫ్ నమోదు తీరును సబ్ కలెక్టరు జియస్ యస్. ప్రవీణ్ చంద్ పరిశీలించారు. ఈసందర్భంగా వ్యవసాయ శాఖాధికారులకు అవసరమైన సూచనలు అందజేశారు.
తదుపరి పెనమలూరు గ్రామం-1 సచివాలయాన్ని సందర్శించి ఆకస్మిక తనిఖీ చేశారు. సచివాలయంలో వివిధ సంక్షేమ కార్యక్రమాల నిర్వహణకోసం అమలు చేస్తున్న రిజిష్టర్లను ఆయన పరిశీలించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కేలండరు ఇతర సంక్షేమ కార్యక్రమాలపై అవగాహన కలిగించే గోడపత్రికలు ప్రదర్శించిన తీరును ప్రవీణ్ చంద్ పరిశీలించారు. వీరి వెంట గ్రామ సర్పంచ్ లింగాల భాస్కరరావు, తహశీల్దారు బద్రూనాయక్, సిఐ సత్యనారాయణ, మండల వ్యవసాయ శాఖాధికారి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.