Breaking News

రైతులకు అవగాహన కల్పించే లక్ష్యంతో వైఎస్సార్ రైతు భరోసాయాత్రలు : మంత్రి పేర్ని నాని

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
రైతు భరోసా కేంద్రాల విధివిధానాలు, సీఎం యాప్ పనితీరు, ఈ–క్రాపింగ్ తదితర వ్యవసాయ సంబంధిత అంశాలపై రైతులకు అవగాహన కల్పించే లక్ష్యంతో వైఎస్సార్ రైతు భరోసాయాత్రల ప్రధాన ఉద్దేశ్యమని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పేర్ని వెంకట్రామయ్య ( నాని ) వివరించారు. శుక్రవారం  ఆయన విజయవాడ రోడ్డులోని మూడు స్థంబాల కూడలిలో రైతు భరోసా వాహనానికి పచ్చ జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం జిల్లాకు కేటాయించిన రైతు భరోసా రథం ద్వారా శుక్రవారం నుండి వ్యవసాయ పథకాలు, సాంకేతిక పరిజ్ఞానం వివరాలు, సస్యరక్షణ చర్యలపై విస్తృత ప్రచారం నిర్వహించనున్నట్లు తెలిపారు. డిజిటల్ స్క్రిన్ ఉన్న ఈ రథం ద్వారా తొలుత రైతు భరోసా చైతన్య యాత్రలు జరిగే ప్రాంతాల్లో అవగాహన కల్పించేందుకు జిల్లా వ్యవసాయ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు వివరించారు. ప్రతి నియోజకవర్గంలోనూ నాలుగు రైతు భరోసా కేంద్రాల వద్ద రెండు గంటలు రథాన్ని నిలిపి ప్రచారం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ విధంగా నెలకు 1000 కిలో మీటర్ల పరిధిలో రథం పర్యటిస్తుందని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న 10,544 ఆర్బీకేల్లో ఈ యాత్రలు ఇప్పటికే మొదలయినట్లు మంత్రి పేర్ని నాని తెలిపారు. ఆర్బీకేల్లో ఏర్పాటు చేస్తున్న వైఎస్సార్ యంత్ర సేవా కేంద్రాల్లో అందుబాటులో ఉంచుతున్న యంత్ర పరికరాలు, వాటి వినియోగంపై శిక్షణ సైతం ఇస్తున్నారని ఆయన వివరించారు. వ్యవసాయంలో తీసుకొస్తున్న కొత్త సాంకేతిక పరిజ్ఞానం, మెళకువలపై రైతులకు విస్తృత అవగాహన కల్పిస్తున్నారని సీఎం యాప్, ఈ–క్రాపింగ్ బుకింగ్ ఆవశ్యకతపై శాస్త్రవేత్తలు, నిపుణులు, అధికారులు రైతులతో భేటీ అవుతూ క్షేత్ర స్థాయిలో వారెదుర్కొనే సమస్యలకు అక్కడికక్కడే పరిష్కార మార్గాలు చూపుతారని కనుక రైతులు వీటిని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి పేర్ని నాని రైతులకు సూచించారు.
ఈ సంచార వాహన రధం ప్రారంభోత్సవ కార్యక్రమంలో మచిలీపట్నం నగర పాలక సంస్థ మేయర్ మోకా వెంకటేశ్వరమ్మ, డిప్యూటీ మేయర్ తంటిపూడి కవిత, మచిలీపట్నం మాజీ మున్సిపల్ చైర్మన్ షేక్ సలార్ దాదా, మచిలీపట్నం మార్కెట్ యార్డ్ ఛైర్మెన్ షేక్ ముస్తఫా ( అచ్చాబా ) , వైస్ చైర్మెన్ తోట సత్యనారాయణ, జిల్లా వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు టి. మోహన కుమార్, వ్యవసాయ అధికారి మణిధర్ తదితరులు పాల్గొన్నారు.

Check Also

సేవా సంస్థలు ఐక్యంగా కృషి చేయాలి

-వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి, జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలోని సేవా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *