Breaking News

బధిరులకు బాసటగా జగనన్న ప్రభుత్వం : మంత్రి పేర్ని నాని

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
గొప్ప భాషా పండితుల బిడ్డయినా అడవిలో తప్పిపోయి అక్కడే పెరిగితే మాటలు రాని ‘టార్జాన్’ మాత్రమే కాగలడని అవకాశాలు ఇస్తే చెవిటి, మూగ దివ్యాంగులు తమ సత్తా ఏమిటో లోకానికి చూపి తాము ఎందులో తక్కువ కాదని నిరూపించగలరని, బధిరులకు బాసటగా జగనన్న ప్రభుత్వం నిలుస్తుందని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పేర్ని వెంకట్రామయ్య ( నాని ) వక్కాణించారు. శనివారం ఉదయం తన కార్యాలయం వద్దకు వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలను ఆయన ముఖాముఖిగా, ప్రయాణాల్లో సైతం జియో జూమ్ యాప్ ద్వారా బిగ్ స్క్రీన్ లో పలుకరించి ప్రజలు పడుతున్న ఇబ్బందులను గూర్చి అడిగి తెలుసుకొని ఎన్నో సమస్యలకు మంత్రి పేర్ని నాని అక్కడికక్కడే పరిష్కారం చూపించారు. తొలుత జిల్లా వికలాంగులు, సీనియర్ సిటిజన్ల సంక్షేమ శాఖ అధికారి బి. రామ్ కుమార్ ఆధ్వర్యంలో ఆండ్రాయిడ్ ఫోన్ల బహుకరణ కార్యక్రమాన్నీ మంత్రి కార్యాలయంలో నిర్వహించారు. ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకొన్న మూగ బాష ( సైన్ లాంగ్వేజ్ ) వచ్చిన మచిలీపట్నానికి చెందిన పదిమంది చెవిటి, మూగ దివ్యాంగులకు 15 వేల రూపాయలు విలువ చేసే శాంసంగ్ యు 20 మోడల్ టచ్ ఫోన్లను మంత్రి పేర్ని నాని చేతుల మీదుగా అందచేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, వీడియో కాలింగ్ ద్వారా ఒకరికొకరు ఫోన్లు చేసుకొని మూగ బాష, సైగల ద్వారా సంబాషించుకొనే వీలు కల్గుతుందని అన్నారు. తన చుట్టుపక్కల ఉన్న సమాజపు, కుటుంబపు, పరిసరాల్లో జరిగే సంభాషణలను వింటూ ఆ వ్యక్తుల ముఖకవళికలను చూడ్డం ద్వారా ప్రతి మనిషి మాట్లాడే భాష నేర్చుకుంటాడని, మాటలు బాగా నేర్చుకున్నాక పెద్దయ్యాక, ఏదైనా ప్రమాదవశాత్తూ చెవుడు వస్తే వారేమీ క్రమంగా మూగ వారు కారని చెప్పారు. కేవలం పుట్టుకతోనూ లేదా మాటలు రాని వయసులోనూ చెవుడు వస్తే వారు తప్పకుండా మూగవారయ్యే అవకాశాలు ఎక్కువని మంత్రి అన్నారు. తెలుగు మాత్రమే మాట్లాడే తల్లిదండ్రులు ఆ బిడ్డ పుట్టిన కొన్ని నెలలకే ఒరిస్సా వెళ్లి ఒరియా భాష మాత్రమే మాట్లాడే పరిసరాల్లో పెంచితే ఆ బిడ్డ క్రమేపీ ఆ ఒరియా భాషనే మాట్లాడేలా ఎదుగుతాడని కానీ చెవుడు ఉన్న బిడ్డ తన చుట్టూ ఉన్న శబ్దాలను, భాషను వినలేడని కాబట్టి ఏ విధంగా తన నోటిలోని శబ్ద వ్యవస్థను కదిలిస్తే ఎలాంటి శబ్దాలు పుడతాయో తెలసుకోలేడన్నారు. కాబట్టి ఏ భాషా రాని అతి సులువైన శబ్దం ‘బ’ ‘బ’ ‘బ’ శబ్దాలు మాత్రమే చేయగలడని మంత్రి అన్నారు. మాట్లాడడం సామాజికాంశమని ముక్కు, వూపిరితిత్తులు, సప్తపథ, నాలుక, పళ్లు, దవడలు, పెదాలు, అంగిటి లాంటి అనేక భాగాల సమన్వయంతో చేసే శబ్దాన్ని వినలేకపోతేే వాటి సాయంతో పలకగలిగే శక్తిరాదని వివరించారు. జిల్లా వికలాంగులు, సీనియర్ సిటిజన్ల సంక్షేమ శాఖ డిగ్రీ చదువుకొంటున్న చెవిటి, మూగ దివ్యాంగులకు ల్యాప్ టాప్ లను సైతం ఇవ్వనున్నారని మంత్రి పేర్ని నాని తెలిపారు.
స్థానిక రుస్తుంబాద్ కు చెందిన రేకపల్లి సూర్య కుమారి,వర్రే గూడెంకు చెందిన అహ్మదున్నీసా తమ పింఛన్లు గత కొంతకాలంగా నిలిచిపోయాయని, రేషన్ కార్డులో నమోదైన తమ కుమారులు ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్నారని ఆ కారణం చేత ఆగిపోయినట్లు అధికారులు చెబుతున్నారని తమకు తిరిగి ఆ పింఛన్లు వచ్చేలా సహాయం చేయమని మంత్రిని అభ్యర్ధించారు. స్థానిక ఫతుల్లాబాద్ గొల్లగూడెంకు చెందిన బట్రాజు ప్రకాష్ అనే యువకుడు మంత్రి వద్ద తన బాధను వ్యక్తపర్చారు. ఏ కారణం లేకుండానే అన్యాయంగా తనను ఒక వ్యక్తి తరచూ తీవ్రంగా కొడుతున్నాడని నిన్ను ఇలాగే కొడతా..నన్నేమి చేయలేవని బెదిరిస్తున్నాడని వాపోయాడు. ఈ విషయమై స్పందించిన మంత్రి పేర్ని నాని ఇనకుదురుపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ కు ఫోన్ చేసి బాధితుని పిర్యాదుపై విచారణ చేయాలనీ ఆదేశించారు.
తాను అవినీతికి పాల్పడినట్లు పుకార్లు గ్రామంలో పుట్టించి తనను బుక్ కీపర్ స్థానం నుంచి తొలగించినట్లు కొందరు ప్రచారం చేస్తున్నారని మచిలీపట్నం మండలం సిరివెళ్లపాలెం గ్రామానికి చెందిన పేరుబోయిన పార్వతి అనే మహిళ బాధపడుతూ మంత్రికి విన్నవించింది.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *