విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
దేశంలోనే ప్రతిష్ఠాత్మకమైన యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామ్ కోచింగ్ సెంటర్ విజయవాడ నగర కేంద్రంలో యువతకు అందుబాటులోకి రావడం సంతోషదాయకమని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు అన్నారు. ఆంధ్రప్రభ కాలనీ తోటవారి వీధిలో విజయదర్శని ఐఏఎస్ అకాడమీని నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజ రెడ్డి తో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం విద్యార్థులనుద్దేశించి ప్రసంగించారు. ఒకప్పుడు ఐఏఎస్ కోచింగ్ అంటే హైదరాబాద్, బెంగుళూరు వెళ్లవలసి ఉండేదని.. ఆ ప్రాంతాలకు ధీటుగా విజయవాడ నగర నడిబొడ్డున అజిత్ సింగ్ నగర్ లో ఏర్పాటు కావడం హర్షణీయమన్నారు. ఐఎఎస్ అధికారిగా పని చేయటం అంటే అత్యున్నత పౌర సేవకు అర్హత సాధించినట్లేనన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో సివిల్ సర్వీసెస్ అధికారులదే ముఖ్య పాత్ర అని మల్లాది విష్ణు గారు వెల్లడించారు. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వీరే వారధులని పేర్కొన్నారు. ఏ ప్రభుత్వానికైన మంచి పేరు రావాలంటే.. ఐఏఎస్ ల పనితీరుపైనే ఆధారపడి ఉంటుందన్నారు. విజయవాడ నగరానికి ఒకప్పుడు మున్సిపల్ కమిషనర్ గా సేవలందించిన ఐఏఎస్ అధికారి పేరు మీదనే అజిత్ సింగ్ నగర్ ఏర్పడిందని మల్లాది విష్ణు గారు గుర్తుచేశారు. ఈ ప్రాంత అభివృద్ధిలో ఆయన పాత్ర మరువలేనిదన్నారు. అటువంటి ప్రాంతంలో విజయ్ కుమార్ గారు ఐఏఎస్ కోచింగ్ సెంటర్ ను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ద్వారా భర్తీ చేయనున్న ఉద్యోగాలలో జిల్లా నుంచి అధిక శాతం మంది అర్హత సాధించే విధంగా విజయదర్శిని అకాడమీ కృషి చేయాలని కోరారు.
విద్యార్థుల భవిత ప్రభుత్వ బాధ్యత…
రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యతనిస్తోందని మల్లాది విష్ణు గారు అన్నారు. చదువుతోనే పేదరికాన్ని నిర్మూలించగలమని బలంగా నమ్మే వ్యక్తి సీఎం జగన్మోహన్ రెడ్డి ని చెప్పుకొచ్చారు. కనుకనే రాష్ట్రంలో విద్యా శాతాన్ని పెంచేందుకు ముఖ్యమంత్రి అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు. ఇందుకోసం బడ్జెట్ లో ఏటా రూ. 12వేల కోట్ల నిధులు కేటాయిస్తున్నారన్నారు. ప్రాథమిక విద్య నుంచి విదేశీ విద్య వరకు అన్ని దశలలోనూ విద్యార్థులకు చేయూతనందిస్తున్నట్లు వెల్లడించారు. మరీ ముఖ్యంగా ఉన్నత విద్య ఎంతో వ్యయప్రయాసలతో కూడుకున్న ప్రస్తుత తరుణంలో.. ఫీజు రీయింబర్స్ మెంట్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఉచిత విద్యనందిస్తోందన్నారు. ఈ అవకాశాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. చదువుకున్న వారికి లభించే గౌరవం.. ఎంత డబ్బున్నా దొరకదనే విషయాన్ని విద్యార్థులు గ్రహించాలన్నారు. అనంతరం కోచింగ్ తీసుకుంటున్న విద్యార్థులతో మల్లాది విష్ణు గారు ప్రత్యేకంగా ముచ్చటించారు, వారికి పలు సూచనలు చేశారు. కష్టపడి చదివి వారంతా ఐఏఎస్ లుగా అర్హత సాధించి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. వారి అభినందన కార్యక్రమానికి మరలా తామంతా విచ్చేస్తామని తెలియజేశారు. రాబోవు రోజుల్లో ఈ అకాడమీ రాష్ట్రంలోని నెంబర్ వన్ స్థాయికి రావాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గాంధీ కోఆపరేటివ్ బ్యాంక్ డైరక్టర్ బోగాది మురళి, వైఎస్సార్ సీపీ నగర నాయకులు గుండె సుందర్ పాల్, ఉమ్మడి వెంకట్రావ్, కేబీఎన్ కాలేజ్ రిటైర్ట్ ప్రిన్సిపల్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ స్టేట్ కో-ఆర్డినేటర్ నారాయణ రావు, విద్యాదర్శిని అకాడమీ డైరక్టర్ జి.విజయ్ కుమార్, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.