-ఇళ్ల లబ్దిదారుల ముఖాల్లో వికసిస్తున్న ఆనందం…
-కొండంత సంబరంతో ఇళ్ల నిర్మాణాలు చేపట్టిన లబ్దిదారులు…
– జిల్లాలో జగనన్న కాలనీలలో జోరందుకున్న స్వగృహ నిర్మాణాలు…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పేదలకు స్వంత ఇల్లు సమకూర్చాలన్న ముఖ్యమంత్రి వై.యస్. జగన్మోహన రెడ్డి సంకల్పం కార్యరూపం దాలుస్తోంది. నవరత్నాలు- పేదలందరికీ ఇళ్లు క్రింద వై.యస్.ఆర్. జగనన్న కాలనీల్లో పేదల స్వంత ఇంటికల నెరవేర్చేందుకు జిల్లా యంత్రాంగం అత్యంత ప్రాధాన్యతను ఇస్తున్నది. జిల్లాలోని పక్కా గృహాలు లేనివారందరికీ జగనన్న కాలనీల్లో పట్టాలిచ్చి త్వరితగతిన గృహాలు నిర్మించి ఆగృహాల పై పూర్తి హక్కులు ఇచ్చే సంకల్పంతో అన్ని చర్యలు జిల్లా యంత్రాంగం చేపట్టింది. ఈ జిల్లాలో వై.యస్.ఆర్. జగనన్న కాలనీలు- పియంఏవై (యు) గృహనిర్మాణానికి రూ.3016 కోట్ల విలువతో జిల్లాలో ఇప్పటివరకూ 1,67,541 ఇళ్లు మంజూరు చేసారు. ఇందులో విజయవాడ డివిజన్లో 74,821, బందరు డివిజన్ లో 37,433, నూజివీడు డివిజన్ లో 25,103, గుడివాడ డివిజన్ లో 30,184 ఇళ్లు మొదటి ఫేజ్ లో మంజూరు చేశారు. నియోజకవర్గాల వారీగా పరిశీలిస్తే మచిలీపట్నం నియోజకవర్గంలో 21236, నూజివీడు 10269, జగ్గయ్యపేట 10471, పెనమలూరు 13411, పామర్రు 14276, అవనిగడ్డ 8460, గన్నవరం 14150, విజయవాడ ఈస్ట్ 10307, మైలవరం 11081, విజయవాడ వెస్ట్ 11000, తిరువూరు 684, విజయవాడ సెంట్రల్ 6000, పెడన 7737, నందిగామ 12551, గుడివాడ 9808, కైకలూరు నియోజకవర్గంలో 6100 ఇళ్లు మొదటి ఫేజ్ లో మంజూ రైయ్యాయి. జిల్లాలో 1,116 లేఅవుట్లలో 1,67,541 ఇళ్లు నిర్మించాలనే లక్ష్యంలో భాగంగా జూలై 1, 3, 4 తేదీలలో నిర్వహించిన మెగా గ్రౌండింగ్ మేళా కార్యక్రమంలో 1,00,039 గృహాలకు శంఖుస్థాపనలు చేసి కృష్ణాజిల్లా రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలిచింది. అదేవిధంగా 1,67,541 గృహాలకు అదనంగా 44,183 గృహాల మంజూరు ఏర్పాట్లను కూడా పూర్తి చేయడమైనది. మొత్తంమీద ఈ ఏడాది 2,11,724 గృహాలు పూర్తి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని జిల్లా కలెక్టరు జె.నివాస్ పేర్కొన్నారు. స్వయంసహాయక గ్రూపుల్లో సభ్యులుగా ఉన్న 79,883 మంది మహిళలకు జగనన్న కాలనీల్లో మంజూరైన ఇళ్ల నిర్మాణంకు అదనంగా రూ.50 వేలు చొప్పున బ్యాంకు రుణాలను జిల్లా కలెక్టరు జె.నివాస్ అందించాలనే సంకల్పం సత్ఫలితాలనిస్తున్నది. ఇప్పటికే 11,419 మంది యస్ హెచ్ఓ మహిళా సభ్యులకు రూ. 56.09 కోట్లు రుణసౌకర్యం కల్పించారు. లేఅవుట్లలో మంజూరైన గృహాలకు లబ్దిదారుల కోరిక మీదట 10 నుంచి 20 మంది లబ్ధిదారుల గ్రూపులు ఏర్పాటు చేసుకుని కాంట్రాక్టరు లేదా మేస్త్రీ ద్వారా త్వరగా గృహనిర్మాణాలు పూర్తి చేసేందుకు జిల్లా కలెక్టరు జె.నివాస్ ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా ఇప్పటికే 1,322 గ్రూపులు 25,013 మంది లబ్ధిదారులతో ఏర్పాటుచేసి గృహనిర్మాణపనులు ప్రారంభించారు. జగనన్నకాలనీలకు అవసరమైన మౌలికసదుపాయాలను రూ. 27 13 కోట్లతో శాశ్వత ప్రాతిపదికన ఏర్పాట్లులో భాగంగా సిమెంటు, కాంక్రీట్ రోడ్లు, ప్రతీ గృహానికి నీటి సదుపాయం, విద్యుత్ సదుపాయం కల్పించేందుకు డ్రెయినేజీ ఏర్పాట్లు, ఇంటర్నెట్ సదుపాయాలు కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపడం జరిగింది. దీంతో స్వంత ఇల్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న వేలాదిమంది లబ్ధిదారుల్లో ఇప్పుడు సంతోషం పెల్లుబికుతున్నది. నందిగామ నియోజకవర్గం కీసర గ్రామానికి చెందిన పి.జోజిరాణి మాట్లాడుతూ ముఖ్యమంత్రి వై.యస్. జగన్మోహన రెడ్డి పేదలకు ఉచితంగా ఇంటిస్థలం ఇచ్చి పక్కాఇల్లు కూడా నిర్మించడం తమకెంతో ఆనందాన్ని కలిగిస్తున్నదన్నారు. ఆటో డ్రైవరుగా తమ భర్త సంపాదనతో స్వంత ఇల్లు సమకూర్చుకోవడమంటే కలలు కనవలసిందేనన్నారు. అయితే జగనన్నతోడుతో త్వరలోనే స్వంత ఇంటి కల సాకారం అవుతున్నందుకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. విజయవాడ మొగల్రాజపురంకు చెందిన కె.శ్యామల మాట్లాడుతూ ఇంటి స్థలమైతే మంజూ రైంది కానీ ఇల్లు నిర్మించుకోవడం ఆలోచనలో పడిన సమయంలో కలెక్టరు గారి సూచనతో ఇండియన్ బ్యాంకు వారు ముందుకు వచ్చి రుణం అందించడంతో తమకు ధైర్యం వచ్చిందని చెప్పారు. విజయవాడలో 22 సంవత్సరాల నుంచి నివసిస్తున్నామని తమలాంటి పేదలను గుర్తించి స్వంత ఇంటికల సాకారం చేస్తున్న జగనన్నకు ధన్యవాదాలు అన్నారు. తోట్లవల్లూరు మండలం బొడ్డుపాడు గ్రామానికి చెందిన ఇందిర మాట్లాడుతూ తనకు వివాహమై 13 సంవత్సరాలు అయ్యిందని ఇద్దరు పిల్లలు కలిగి ఉన్న తమకు స్వంత ఇల్లు లేదన్నారు. తమకు ఇంటి స్థలం మంజూరు చేసిన సియం జగనన్నకు గృహలక్ష్మి క్రింద రుణం అందించిన బ్యాంకు అధికారులకు కృతజ్ఞతలు అన్నారు.