Breaking News

పింగళి వెంకయ్య తెలుగు వారు కావడం మనందరికి గర్వకారణం: ఎమ్మెల్యే మల్లాది విష్ణు

ఎమ్మెల్యే  చేతులమీదుగా దుర్గాపురం వాకర్స్ క్లబ్ లో పింగళి వెంకయ్య విగ్రహావిష్కరణ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జాతి సమైక్యత, సమగ్రతకు చిహ్నమైన త్రివర్ణ పతాక రూపకర్త తెలుగు వారు కావడం మనందరికీ గర్వకారణమని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు  మల్లాది విష్ణు  అన్నారు. పింగళి వెంకయ్య  జయంతిని పురస్కరించుకుని దుర్గాపురం వాకర్స్ క్లబ్ నందు ఆయన విగ్రహావిష్కరణ, ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం మల్లాది విష్ణు  మాట్లాడుతూ భిన్నత్వంలోని ఏకత్వం, సమతాస్ఫూర్తికి మన మూడు రంగుల మువ్వన్నెల జాతీయపతాకం నిలువెత్తు నిదర్శనమన్నారు. అటువంటి మహోన్నత పతాకాన్ని రూపొందించిన పింగళి వెంకయ్య కృష్ణా జిల్లా వాసి కావటం మనందరికీ గర్వకారణమన్నారు. 1921 మార్చి 31, ఏప్రిల్ 1వ తేదీన ఆలిండియా కాంగ్రెస్ కమిటీ రెండు రోజుల సమావేశాలను విజయవాడలో నిర్వహించగా.. ఈ సమావేశాల్లోనే పింగళి వెంకయ్య  జాతీయ జెండాకు ముసాయిదా రూపాన్ని ఇచ్చారన్నారు. ఆ విధంగా జాతీయజెండా మన విజయవాడలోనే తొలిసారి రెపరెపలాడిందని చెప్పుకొచ్చారు. తదననంతరం జాతీయ పతాకం త్రివర్ణ శోభితమై జాతి సమైక్యతకు, జాతి సమగ్రతకు చిహ్నంగా నిలిచిందన్నారు. స్వాతంత్ర్య ఉద్యమంలోనూ కీలక భూమిక పోషించి.. ప్రతి ఒక్కరిలో ఉద్యమ స్ఫూర్తి రగిలించిందని తెలిపారు. పింగళి వెంకయ్య  కుటుంబాన్ని గౌరవించింది నాడు  వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి  అయితే.. నేడు  వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి అని మల్లాది విష్ణు  అన్నారు. విక్టోరియా మ్యూజియంలో  పింగళి వెంకయ్య  విగ్రహావిష్కరణ వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేతుల మీదుగానే జరిగిందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే  గుర్తుచేశారు.  పింగళి వెంకయ్య  పేరు మీద స్టాంప్ లను కూడా నాడు రాజశేఖర్ రెడ్డి  విడుదల చేయడం జరిగిందన్నారు. జాతీయ పతాకం రూపొందించి శత వసంతాలు పూర్తైన సందర్భంగా పింగళి వెంకయ్య  కుటుంబాన్ని ముఖ్యమంత్రి  జగన్మోహన్ రెడ్డి  ప్రత్యేకంగా గౌరవించడమే కాకుండా.. రాష్ట్ర ప్రభుత్వం తరపున ఆర్థికసాయం అందించి ఆదుకోవడం జరిగిందన్నారు. చరిత్రను గౌరవించడం, స్వాతంత్ర సమరయోధుల కుటుంబసభ్యులను సత్కరించడంలో ముఖ్యమంత్రి  ఎల్లప్పుడూ ముందుంటారని మల్లాది విష్ణు  అన్నారు.

దుర్గాపురం వాకర్స్ క్లబ్ సేవలు అభినందనీయం…
సామాజిక దృక్పథంతో దుర్గాపురం వాకర్స్ క్లబ్ సభ్యులు నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలు ప్రశంసనీయమని మల్లాది విష్ణు అన్నారు. కరోనా విపత్కర సమయంలో పేద ప్రజల సహాయార్థం వాకర్స్ క్లబ్ బృందం చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమన్నారు. నగరంలోని కార్మికులు, కూలీలు, పేద ప్రజలకి భోజనం, నిత్యావసరాలు అందజేస్తూ వాకర్స్ క్లబ్ సభ్యులు ప్రతిఒక్కరికి ఆదర్శంగా నిలిచారన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు  కొండాయిగుంట మల్లేశ్వరి, బాలిగోవింద్,  పెనుమత్స శిరీష సత్యం, కొంగితల లక్ష్మీపతి, నాయకులు ఉద్దంటి సురేష్, బంకా భాస్కర్, విగ్రహ దాత – పోతినేని సాయిరవళి ఛారిటబుల్ ట్రస్ట్ ఛైర్మన్  పోతినేని గాయత్రి, వాకర్స్ క్లబ్ అధ్యక్షులు శనగశెట్టి హరిబాబు, కార్యదర్శి గుర్రం ఏడుకొండలు, ఆర్గనైజర్  శీలం భవానిరెడ్డి, కార్యవర్గ సభ్యులు కొనపురెడ్డి అనిల్, విన్నకోట రాము, పి. వెంకటేశ్వర రావు, ఎస్.కె.బాబు ఇతర పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

Check Also

పేదల కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి వంగవీటి మోహన రంగా

– వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేద ప్రజల కోసం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *