Breaking News

పింఛన్ల గూర్చి మాట్లాడే నైతిక అర్హత తెలుగుదేశానికి లేదు… : ఎమ్మెల్యే మల్లాది విష్ణు 

-28వ డివిజన్ లో నూతన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు 

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో పెన్షన్ల పంపిణీ వ్యవస్థను సరళీకృతం చేసిన ఘనత ముఖ్యమంత్రి  వైఎస్ జగన్మోహన్ రెడ్డి కే దక్కుతుందని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు  మల్లాది విష్ణు అన్నారు. 28వ డివిజన్ లో నూతనంగా మంజూరైన 27 పింఛన్లను లక్ష్మీ నగర్లోని 203 వార్డు సచివాలయంలో APSFL ఛైర్మన్ పూనూరు గౌతమ్ రెడ్డి తో కలిసి ఆయన పంపిణీ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. పెన్షన్ల అంశంపై మాట్లాడే నైతిక అర్హత చంద్రబాబుకుగానీ, లోకేష్ కి గానీ లేదని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఈ ప్రభుత్వంలో వార్డు సచివాలయ వ్యవస్థ ద్వారా తొలి రోజే 98 శాతానికి పైగా లబ్ధిదారులకు నేరుగా ఇళ్ల వద్దకే పింఛన్లను అందిస్తున్నామన్నారు. ఆరోగ్య సమస్యలు ఉన్న, దూర ప్రాంతాలలోని లబ్ధిదారులకు కూడా తొలి మూడు రోజుల్లోనే ఇవ్వడం జరుగుతోందన్నారు. ఈలోగా పింఛన్లు అందడం లేదని రాద్ధాంతం చేయడం సరికాదన్నారు. చివరకు వృద్ధులు, వికలాంగులు, వితంతువులపై కూడా రాజకీయం చేసే స్థితికి తెలుగుదేశం నేతలు దిగజారడం సిగ్గుచేటన్నారు.

పింఛన్ పంపిణీపై బహిరంగ చర్చకు సిద్ధమా?
ఒకరు చనిపోతే తప్ప రెండో వారికి పెన్షన్ రాని పరిస్థితి నాడు తెలుగుదేశం హయాంలో ఉండేదని మల్లాది విష్ణు  అన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి పాలనలో శాచ్యురేషన్ పద్ధతిలో ప్రతిఒక్కరికీ పింఛన్ అందించడం జరుగుతోందన్నారు. టీడీపీ హయాంలో పింఛన్ల కోసం రోజుల తరబడి కార్యాలయాల వద్ద పడిగాపులు కాయాల్సి వచ్చేదని.. జగన్మోహన్ రెడ్డి  అధికారంలోకి వచ్చిన తర్వాత నేరుగా లబ్ధిదారుని ఇంటికే పింఛన్ వస్తోందన్నారు. తెలుగుదేశం హయాంలో విజయవాడ నగరంలో 52,790 మందికి మాత్రమే పింఛన్ అందుతుండగా.. నేడు 72,843 మందికి పింఛన్లు అందుతున్నాయన్నారు. ఒక్క సెంట్రల్ నియోజకవర్గంలోనే ఇటీవల 308 మందికి నూతనంగా పింఛన్లు మంజూరు చేయడం జరిగిందన్నారు. అందులో డివిజన్ కు సంబంధించి 27 మంది లబ్ధిదారులు ఉన్నట్లు వెల్లడించారు. చంద్రబాబు మాదిరిగా 600 కి పైగా అలవికాని హామీలతో ప్రజలను వంచించడం తమకు చేతకాదని మల్లాది విష్ణు గారు అన్నారు. జగనన్న ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రూ. 60 వేల కోట్ల సంక్షేమాన్ని నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమచేయడం జరిగిందన్నారు.

సంక్షేమం, అభివృద్ధితో పాటు భద్రతకూ పెద్దపీట…
మహిళలకు భద్రత కల్పించేందుకు ప్రభుత్వం పటిష్ఠ చర్యలు తీసుకుంటోందని మల్లాది విష్ణు అన్నారు. మహిళా సంరక్షణే ధ్యేయంగా అనేక సంస్కరణలను చేపడుతూ.. దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోందన్నారు. ఇందులో భాగంగా ప్రతి వార్డు సచివాలయంలో ఒక మహిళ సంరక్షణ కార్యదర్శిని నియమించినట్లు వెల్లడించారు. ఈ కార్యదర్శి పోలీసు శాఖ ప్రతినిధిగా ప్రతి ఇంటి గడప వద్దకు వెళ్లి సేవలను విస్తృత పరచాలని సూచించారు. వీరంతా తమ పరిధిలోని విద్యార్థినులు, ఉద్యోగస్తులు, గృహిణిలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఎల్లప్పుడూ తమ వద్ద ఉంచుకోవాలన్నారు. వారికి నిత్యం అందుబాటులో ఉండే విధంగా.. ప్రధాన కూడళ్ల వద్ద ఫోన్ నెంబర్లతో కూడిన సమాచారం అందుబాటులో ఉంచాలన్నారు. ఆకతాయిలు, మందుబాబులు సంచరించే ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ప్రతి ఒక్క మహిళ దిశా యాప్ ను డౌన్‌లోడ్ చేసుకోవడంలో ప్రముఖ పాత్రను పోషించాలని మహిళ సంరక్షణ కార్యదర్శులకు సూచించారు. కార్యక్రమంలో వీఎంసీ పీఓ  అరుణ, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Check Also

రాష్ట్రంలో 6 గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టుల ఫీజిబులిటీ స్టడీ కోసం రూ. 2.27 కోట్ల నిధులు విడుదల చేయనున్నాం : మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి

-కుప్పం, శ్రీకాకుళం, నాగార్జునసాగర్, తుని – అన్నవరం, తాడేపల్లి గూడెం, ఒంగోలులో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టుల అభివృద్ధికి ప్రతిపాదనలు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *