-గుడివాడ నియోజకవర్గానికి రూ.14.85 కోట్ల నిధులు
-పాఠశాలల్లో మౌలిక వసతులను కల్పన, అభివృద్ధి
-రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని
గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో మన బడి నాడు – నేడు పథకం ద్వారా సీఎం జగన్మోహనరెడ్డి ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను మార్చివేశారని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) చెప్పారు. సోమవారం కృష్ణాజిల్లా గుడివాడ నియోజకవర్గంలో నాడు – నేడు కార్యక్రమంలో భాగంగా పలు గ్రామాల్లోని పాఠశాలల్లో జరిగిన అభివృద్ధి పనులపై మంత్రి కొడాలి నాని సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ గుడివాడ నియోజకవర్గానికి రూ. 14. 85 కోట్ల నిధులను ప్రభుత్వం కేటాయించిందన్నారు. ఈ నిధులతో నియోజకవర్గంలోని పాఠశాలల్లో మౌలిక వసతులను కల్పించడంతో పాటు అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు. ఇదిలా ఉండగా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థులకు మెరుగైన విద్యను అందించాలనే లక్ష్యంతో 2019 నవంబర్ 14 వ తేదీన మనబడి నాడు నేడు పథకాన్ని సీఎం జగన్మోహనరెడ్డి ప్రారంభించారన్నారు. ఈ పథకం ద్వారా రూ.16 వేల 700 కోట్ల వ్యయంతో మూడు దశల్లో పాఠశాలల ఆధునికీకరణ చేపట్టడం జరిగిందన్నారు. పూర్తి పారదర్శకతతో, నిబద్ధత, నాణ్యతతో పాఠశాలల తల్లిదండ్రుల కమిటీల ఆధ్వర్యంలో ఆధునికీకరణ పనులను ప్రారంభించడం జరిగిందన్నారు. మూడు సంవత్సరాలలో దశలవారీగా 45 వేల ప్రభుత్వ పాఠశాలలు, 475 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, 151 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు, 3,287 ప్రభుత్వ హాస్టళ్ళ ఆధునికీకరణ పనులు జరుగుతాయన్నారు. అలాగే 27 వేల 438 అంగన్ వాడీ కొత్త భవనాలు నిర్మించనున్నామని తెలిపారు. మన బడి నాడు – నేడు పథకం ద్వారా 10 అంశాలతో కూడిన మౌలిక వసతుల కల్పన జరుగుతోందన్నారు. నీటి వసతితో కూడిన మరుగుదొడ్లు, రక్షిత సాగునీటి సరఫరా, పాఠశాలల మరమ్మతులు, ప్రతి తరగతి గదికీ ఫ్యాన్లు , ట్యూబ్ లైట్ల ఏర్పాటు, ఫర్నీచర్ , గ్రీన్ చాక్ బోర్డు , పెయింటింగ్, ఇంగ్లీష్ ల్యాబ్, ప్రహరీగోడ, వంటగది నిర్మాణం జరుగుతాయన్నారు. నాడు – నేడు కార్యక్రమం అమలుకు ముందు ఉన్న స్థితి, అమలు తర్వాత ప్రభుత్వ పాఠశాలల్లో జరిగిన అభివృద్ధిని ఫొటోలతో సహా పోల్చి చూపడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యమని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో పరీక్షా ఫలితాలను మెరుగుపర్చడం, బడి బయట ఉన్న విద్యార్థుల సంఖ్యను తగ్గించి బడిలో చేర్పించడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. సీఎం జగన్మోహనరెడ్డి చేపట్టిన విప్లవాత్మక కార్యక్రమాల వల్ల ప్రభుత్వ పాఠశాలల్లో దాదాపు 4 లక్షల అడ్మిషన్లు పెరిగాయన్నారు. కాగా నాడు – నేడు మొదటి దశలో పూర్తయిన పనులను ఈ నెల 16 వ తేదీన సీఎం జగన్మోహనరెడ్డి రాష్ట్రంలోని విద్యార్థులకు అంకితం చేయడంతో పాటు రెండవ దశ పనులను ప్రారంభిస్తారని చెప్పారు. మూడవ దశ పనులు 2022 ఆగస్టు నెలలో ప్రారంభమవుతాయని మంత్రి కొడాలి నాని తెలిపారు.