-రైతుల కోసం పౌరసరఫరాల శాఖలో మార్పులు
-వచ్చే సీజన్ నుండి ప్రభుత్వమే ధాన్యం కొనుగోళ్ళు
-రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని
గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ధాన్యం అమ్మేందుకు రైతులు నేరుగా రైస్ మిల్లర్ల దగ్గరకు వెళ్ళే పద్ధతికి స్వస్తి చెప్పేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) చెప్పారు. బుధవారం కృష్ణాజిల్లా గుడివాడ పట్టణంలోని వ్యవసాయశాఖ ఏడీ కార్యాలయంలో జరిగిన సభలో మంత్రి కొడాలి నాని మాట్లాడారు. ధాన్యం కొనుగోలు చేసిన 21 రోజుల్లో రైతులకు డబ్బును ఇవ్వాలన్న నిబంధనను ప్రభుత్వం తీసుకువచ్చిందన్నారు. అక్కడక్కడా మిల్లర్లు కూడా రైతులకు సహకరించడం లేదన్నారు. తేమ శాతం ఎక్కువ ఉందని, మట్టి, తప్ప, తాలు వంటివి ఉన్నాయంటూ రైతుకు ఇవ్వాల్సిన డబ్బులో కోత విధిస్తున్నారన్నారు. సివిల్ సప్లయిస్ డిపార్ట్ మెంట్ లో ఎప్పటి నుండో మిల్లర్లు కూడా కలిసి ధాన్యం కొనుగోళ్ళలో నిమగ్నమవుతుండడం జరుగుతోందన్నారు. మిల్లర్ల వల్ల రైతులు నష్టపోయే పరిస్థితులను కూడా పూర్తిస్థాయిలో అరికట్టాలన్న ఆలోచనలో సీఎం జగన్మోహనరెడ్డి ఉన్నారని చెప్పారు. దీనిలో భాగంగానే పౌరసరఫరాల శాఖలో అనేక మార్పులు తీసుకువస్తున్నారని తెలిపారు. వచ్చే సీజన్ లో మిల్లర్లు , ధాన్యం కొనుగోలు దారులకు ఎటువంటి సంబంధం ఉండదన్నారు. పండించిన ధాన్యాన్ని మార్కెట్ యార్డ్ ద్వారా పౌరసరఫరాల శాఖ కొనుగోలు చేస్తుందన్నారు . ధాన్యాన్ని కొనుగోలు చేసిన తర్వాతే మిల్లర్లకు పంపుతామన్నారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి అనుకూలంగా లేనప్పటికీ సాగునీటి ప్రాజెక్ట్ లు అన్నింటినీ పూర్తిచేయాలన్న దృక్పథంతో సీఎం జగన్మోహనరెడ్డి పనిచేస్తున్నారని చెప్పారు. రైతుల కోసం పనిచేసే మనస్సున్న సీఎం జగన్మోహనరెడ్డి ప్రభుత్వానికి వరుణ దేవుడు కూడా సహకరించాడని చెప్పారు. జూలై 31 నాటికి శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల, ప్రకాశం బ్యారేట్లు నీటితో నిండిపోయాయని, స్టోరేజ్ కు మించిన నీటిని సముద్రంలోకి వదిలేసే పరిస్థితి ఏర్పడిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో రైతుల కోసం పనిచేస్తుందని అన్నారు. అతివృష్టి , అనావృష్టి పరిస్థితులు తలెత్తకుండా దేవుడు కూడా వ్యవసాయానికి సహకరిస్తున్నారని చెప్పారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న గత ఐదేళ్ళలో 55 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఏటా కొనుగోలు చేయడం జరిగిందన్నారు. సీఎం జగన్మోహనరెడ్డి ప్రభుత్వంలో ఏటా 85 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేస్తూ వస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వం రైతులకు రూ.1,200 కోట్లు బకాయిలు పెట్టి వెళ్ళిపోయిందన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ బకాయిలను కూడా సీఎం జగన్మోహనరెడ్డి రైతులకు చెల్లించారని చెప్పారు. రైతులు ధాన్యం అమ్మిన 21 రోజుల్లోనే డబ్బులు ఇవ్వాలన్న నిబంధనను పెట్టుకున్నారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం నుండి రావాల్సిన బకాయిలు రాకపోయినా రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికపుడు రైతులకు డబ్బులు విడుదల చేస్తూ వస్తోందని తెలిపారు. రైతాంగాన్ని దృష్టిలో పెట్టుకుని సీఎం జగన్మోహనరెడ్డి చేస్తున్న కార్యక్రమాలను ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలని మంత్రి కొడాలి నాని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర నేత దుక్కిపాటి శశిభూషణ్, వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ మొండ్రు సునీత, వైసీపీ నేతలు పాలడుగు రాంప్రసాద్, పెయ్యల ఆదాం, మట్టా జాన్ విక్టర్, మల్లిపూడి శ్రీనివాస చక్రవర్తి, మొండ్రు వెంకటేశ్వరరావు, వ్యవసాయ సలహా మండలి గుడివాడ రూరల్ మండల అధ్యక్షుడు మేకల సత్యనారాయణ, నందివాడ మండల అధ్యక్షుడు కొండపల్లి కుమార్ రెడ్డి, పలువురు వ్యవసాయశాఖ, ఇరిగేషన్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.