Breaking News

కాల్వ శివారు భూములకు సాగునీరు అందేలా చర్యలు తీసుకోండి…

-రైతుల సమస్యలన్నీ స్పందనలో పరిష్కరిస్తాం
-రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని

గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కాల్వ శివారు భూములకు కూడా సాగునీరు అందేలా రైతులతో చర్చించి గ్రామాలవారీగా రైతుల భూములకు సాగునీరు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) ఆదేశించారు. బుధవారం కృష్ణాజిల్లా గుడివాడ పట్టణంలోని వ్యవసాయశాఖ ఏడీ కార్యాలయంలో నిర్వహించిన రైతు స్పందన కార్యక్రమంలో భాగంగా పలువురు రైతులు వివిధ సమస్యల పరిష్కారంపై మంత్రి కొడాలి నాని, జిల్లా కలెక్టర్ జే నివాస్ కు అర్జీలను అందజేశారు. గుడివాడ రూరల్ మండలం బొమ్ములూరు గ్రామానికి చెందిన ఎర్నేని రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ కొమరవోలు డ్రైన్ ద్వారా సాగునీటిని పూర్తిస్థాయిలో విడుదల చేయడం లేదని, దీనివల్ల బొమ్ములూరు, నూజెళ్ళ, కొమరవోలు ఆయకట్టు పరిధిలోని శివారు ప్రాంతాల భూములకు సాగునీరు అందడం లేదన్నారు. గుడ్లవల్లేరు మండలంలోని రైవస్ కాల్వ ద్వారా కోమటిగుంట, కవుతరంతో పాటు దిగువ ప్రాంతాల గ్రామాలకు పోల్ రాజ్ కెనాల్ ద్వారా సాగునీరు అందక రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. లెవల్ గేజ్ ను 250 కు పెంచాలని రైతు ప్రముఖులు పెన్నేరు ప్రభాకర్ కోరారు. గుడివాడ రూరల్ మండలం బొమ్ములూరు గ్రామానికి చెందిన రైతు అట్లూరి శేషగిరిరావు తన అర్జీలో గుడివాడ – మచిలీపట్నం రైల్వే డబ్లింగ్ లైన్ కు 28 సెంట్ల భూమిని ఇచ్చామని, దీని నిమిత్తం ప్రభుత్వం నుండి రూ. 31 లక్షలు మాత్రమే వచ్చాయని, మిగిలిన బకాయిలు కూడా విడుదలయ్యేలా చూడాలని కోరారు. గుడివాడ రూరల్ మండలం రామనపూడికి చెందిన రైతు సీతారామరాజు మాట్లాడుతూ తన తాత నుండి వారసత్వంగా వచ్చిన భూమికి పట్టాదారు పాస్ పుస్తకం ఇప్పించాలని కోరారు. పలువురు బొమ్ములూరు రైతులు మాట్లాడుతూ జాతీయ రహదారి 65 కు బొమ్ములూరు వద్ద భూసేకరణలో భూములు ఇవ్వడం జరిగిందని, కొంత మందికి మాత్రమే పరిహారం ఇచ్చారని, మిగిలిన రైతులకు కూడా పరిహారాన్ని అందించాలని కోరారు. గుడివాడకు చెందిన రైతు శంకరరావు మాట్లాడుతూ జొన్నపాడు, చంద్రాల డ్రైన్ల పరిధిలోని శివారు భూముల్లో రెండు కిలోమీటర్ల మేర రైతులకు సాగునీరు అందడం లేదని, కాల్వలకు పూడికతీత పనులు చేపట్టాలని కోరారు. బొమ్ములూరు గ్రామ రైతు గుత్తా ఆజాద్ మాట్లాడుతూ గత ఏడాది వర్షాల వల్ల పంట పూర్తిగా దెబ్బతిందని, ఇప్పటి వరకు ఇన్సూరెన్స్ రాలేదని అర్జీ దాఖలు చేశారు. అనంతరం మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ కాల్వల ద్వారా సాగునీరు సక్రమంగా అందేలా అన్ని చర్యలూ తీసుకుంటున్నామన్నారు. అవసరమైన చోట పూడికతీత పనులు చేపట్టాలని సూచించారు. గత ఏడాది వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులకు ఇన్సూరెన్స్ క్లైమ్ లకు సంబంధించిన ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపడం జరిగిందన్నారు. ప్రభుత్వం నుండి క్లైమ్ లు మంజూరైన వెంటనే రైతులకు ఆయా పరిహారాన్ని అందజేయడం జరుగుతుందని మంత్రి కొడాలి నాని చెప్పారు. ఈ కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర నేత దుక్కిపాటి శశిభూషణ్, వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ మొండ్రు సునీత, వైసీపీ నేతలు పాలడుగు రాంప్రసాద్, పెయ్యల ఆదాం, మట్టా జాన్ విక్టర్, మల్లిపూడి శ్రీనివాస చక్రవర్తి, మొండ్రు వెంకటేశ్వరరావు, వ్యవసాయ సలహా మండలి గుడివాడ రూరల్ మండల అధ్యక్షుడు మేకల సత్యనారాయణ, నందివాడ మండల అధ్యక్షుడు కొండపల్లి కుమార్ రెడ్డి, పలువురు వ్యవసాయశాఖ, ఇరిగేషన్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.

Check Also

జాతీయ లోక్ అదాలత్

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *