-పేరుకుపోయిన చెత్త తొలగింపు – సంపద సృష్టి దిశగా అడుగులు
-రెండు గ్రామాల్లో చెత్త తొలగింపు ప్రక్రియకు శ్రీకారం
-పక్కా చెత్త నిర్వహణ కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదనలు
-గ్రామ అభివృద్ధి సభల్లో సమస్యలపై ప్రత్యేకంగా దృష్టి సారించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఉపముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ దృఢ సంకల్పంతో మొగల్తూరు, పెనుగొండ గ్రామాలలో సమస్యలు పరిష్కారానికి అడుగులు పడుతున్నాయి. గత నెల 28వ తేదీన ఆ గ్రామాల్లో చేపట్టిన గ్రామ అభివృద్ధి సభల్లో అధికారుల దృష్టికి వచ్చిన సమస్యలు పవన్ కళ్యాణ్ చొరవతో యుద్ధప్రాతిపదికన పరిష్కారం అవుతున్నాయి. ఇప్పటికే పాఠశాలల అభివృద్ధికి నిధులు (పెనుగొండ హైస్కూల్‌కు ₹2.05 కోట్లు, మొగల్తూరు హైస్కూల్‌కు ₹1.71 కోట్లు) మంజూరు కాగా, ఇప్పుడు పారిశుధ్యంపై దృష్టి సారించారు. గ్రామాల అభివృద్ధి సభల్లో… ఏళ్ల తరబడి గ్రామాల్లో పేరుకుపోయిన చెత్తను తొలగించాలని గ్రామస్తులు ఉప ముఖ్యమంత్రి పేషీ అధికారులను కోరారు. మొగల్తూరు, పెనుగొండ గ్రామాల అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ద తీసుకున్న పవన్ కళ్యాణ్ సమస్యను గ్రామీణాభివృద్ధి శాఖతోపాటు కాలుష్య నియంత్రణ మండలి దృష్టికి తీసుకువెళ్లారు. చెత్త నిల్వ సమస్యను పరిష్కరించి, ఆయా ప్రాంతాల్లో పారిశుధ్యంతో పాటు సుందరీకరణ పనులు చేపట్టే విధంగా ఆదేశాలు జారీ చేశారు.
ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు సంబంధిత అధికారులు తక్షణం చర్యలకు పూనుకున్నారు. పెనుగొండ గ్రామ పంచాయతీలో గత 9 సంవత్సరాలుగా 200 మెట్రిక్ టన్నుల చెత్త పేరుకుపోయింది. దీన్ని రీ సైక్లింగ్ కేంద్రాలకు తరిలించే చర్యలు ప్రారంభించారు. చెత్త తొలగిస్తున్న ప్రదేశంలో భవిష్యత్తులో పారిశుధ్యం నిర్వహణతోపాటు పచ్చదనాన్ని అభివృద్ధి చేసే దిశగా ప్రణాళికలు సిద్ధం చేసింది. మొగల్తూరు గ్రామపంచాయతీలో గత 10 సంవత్సరాల్లో 400 మెట్రిక్ టన్నుల చెత్త పేరుకుపోయింది. ఈ చెత్తను సంపద సృష్టి కేంద్రాలకు తరలింపు ప్రక్రియ ప్రారంభించారు. భవిష్యత్తులో చెత్త నిర్వహణ ప్రక్రియలో ఇబ్బందులు కలగకుండా గ్రామంలో పారిశుధ్య పరిరక్షణ, చెత్త నిర్వహణకు ప్రణాళికలకు రూపకల్పన చేస్తున్నారు. ప్రత్యేకంగా ప్రభుత్వం నుంచి భూమి కేటాయించి శాశ్వత చెత్త నిర్వహణ కేంద్రాలు పక్కాగా ఏర్పాటు చేయాలని గ్రామ అభివృద్ధి సభల్లో ప్రతిపాదించారు. ఉపముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మొగల్తూరు, పెనుగొండ గ్రామాల్లో చెత్త సమస్య పరిష్కారంతో పాటు ఆరోగ్యకరమైన వాతావరణం సృష్టించే దిశగా నిరంతరాయంగా చర్యలు కొనసాగించేందుకు ఆయా గ్రామ పంచాయతీలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి.