-పవన్ కళ్యాణ్ చొరవతో మారుతున్న పిఠాపురం దశ
-ఒకే రోజు రూ.3.7 కోట్ల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు
-నూతన సీసీ రోడ్లు, డ్రెయిన్లను ప్రారంభించిన శాసన మండలి సభ్యులు నాగబాబు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
మూడు కోట్ల 70 లక్షల రూపాయల నిధులు.. 21 అభివృద్ధి పనులు.. ఒకే రోజు పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవతో పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా చేపట్టిన అభివృద్ధి పనులు పూర్తి కాగా శాసన మండలి సభ్యులు కొణిదెల నాగబాబు శనివారం నూతన రహదారులు, డ్రెయిన్లను ప్రారంభించారు. నియోజకవర్గం మొత్తం గ్రామ గ్రామాన పర్యటిస్తూ.. రహదారుల నాణ్యతను పరిశీలిస్తూ.. ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారు. శాసన మండలిలో ప్రభుత్వ విప్ పిడుగు హరిప్రసాద్ తో కలసి రెండో రోజు పర్యటనలో నిర్మాణం పూర్తి చేసుకున్న రూ.3.70 కోట్ల విలువైన అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో నియోజకవర్గంలో అభివృద్ధిని మరింత పరుగులు పెట్టిస్తామని హామీ ఇచ్చారు. నియోజకవర్గంలో ప్రతి సమస్యను పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నట్టు స్పష్టం చేశారు.
ఎన్నికల సమయంలో పిఠాపురం నియోజక వర్గాన్ని దేశంలోనే మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చిన పవన్ కళ్యాణ్.. శాసన సభ్యునిగా విజయం సాధించిన మొదట రోజు నుంచే మాటను నిలబెట్టుకున్నారు. తాను నిర్వహిస్తున్న పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖతో ఇతర శాఖల అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షలు జరుపుతూ ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి ప్రణాళికలకు రూపకల్పన చేశారు. ఇప్పటికే నియోజకవర్గ వ్యాప్తంగా మినీ గోకులాలు, చెత్త నుంచి సంపద సృష్టి కేంద్రాలు, రహదారుల నిర్మాణం వంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి చాలా వరకు పూర్తి చేశారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో అంతర్గత సిమెంటు రోడ్లు, డ్రెయిన్లు, గ్రామాల మధ్య అనుసంధాన రహదారుల నిర్మాణం చేపట్టారు. శనివారం కుమారపురం గ్రామం నుంచి అమరవిల్లి వరకు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో చేపట్టిన 21 పనులను ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు ప్రారంభించారు. పిఠాపురం మండలం, కుమారపురం హౌసింగ్ లే అవుట్ 1 లో రూ. 15.70 లక్షల అంచనా వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్డును శాసన మండలిలో ప్రభుత్వ విప్ పిడుగు హరిప్రసాద్ తో కలిసి ప్రారంభించారు. అనంతరం విరవ గ్రామం నుంచి గోకివాడ బ్రిడ్జి వరకు యంజీఎన్ఆర్ఈజీఎస్ నిధుల నుంచి రూ. 75 లక్షల అంచనా వ్యయంతో నిర్మించిన తారు రోడ్డును ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ రహదారి విరవ నుంచి కోలంక, గోకివాడలను కలుపుకుంటూ ఈ రహదారి వెళ్తుంది. గోకవాడ గ్రామంలో రూ. 20 లక్షల అంచనా వ్యయంతో నిర్మించన సీసీ రోడ్డుని ప్రారంభించారు. చిన్న జగ్గంపేటలో రూ. 28.95 లక్షల అంచనా వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్డు.. వన్నెపూడిలో జిల్లా పరిషత్ రోడ్డు నుంచి తుమ్మ చెరువుగట్టు వరకు రూ. 29.65 లక్షల అంచనా వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్డు.. కొత్తపల్లి గ్రామంలో ప్రధాన రహదారి నుంచి బరియల్ గ్రౌండ్ వరకు రూ. 11 లక్షల అంచనా వ్యయంతో నిర్మించిన సిమెంటు రోడ్డు. ఉప్పాడ గ్రామం, కొత్తమాయపట్నం వద్ద రూ. 152 లక్షల అంచనా వ్యయంతో నిర్మించిన డ్రెయిన్లు, అంతర్గత సిమెంటు రోడ్లు.. రామన్నపాలెం ప్రధాన రహదారి నుంచి అమరవిల్లి రోడ్డు వరకు రూ. 38 లక్షల అంచనా వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్డు నాగబాబు చేతుల మీదుగా ప్రారంభించిన వాటిలో ఉన్నాయి.
గ్రామాల్లో హారతుల స్వాగతం
పిఠాపురం నియోజకవర్గ వ్యాప్తంగా నూతన రహదారుల ప్రారంభోత్సవానికి వచ్చిన శాసన మండలి సభ్యులు నాగబాబు కి గ్రామీణ ప్రాంత ప్రజలు ఘన స్వాగతం పలికారు. గ్రామ గ్రామాన మహిళలు హారతులు పట్టి, పూల వర్షం కురిపిస్తూ స్వాగతం పలికారు. తమ గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తున్న పవన్ కళ్యాణ్ కి జేజేలు పలుకుతూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో ఏపీ టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ కుమార్, కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అధారిటీ ఛైర్మన్ తుమ్మల రామస్వామి, మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు, జనసేన పార్టీ పిఠాపురం నియోజక వర్గం సమన్వయకర్త మర్రెడ్డి శ్రీనివాసరావు, స్థానిక జనసేన నాయకులు, వీర మహిళలు, జన సైనికులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News