Breaking News

ఈఎస్‌ఐతో కార్మికులకు ఆరోగ్య రక్ష

-ప్రెస్‌క్లబ్‌ వైద్యశిబిరంలో సూపరింటెండెంట్‌ జ్యోతి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అన్ని అవాంతరాలలో కార్మికులకు పూర్తి రక్షణ కల్పించే ఏకైక బీమా పథకం ఈఎస్‌ఐ అనీ, గర్భస్థ శిశువు నుంచి మరణానంతరం వరకు కూడా ఈఎస్‌ఐ బీమాదారులకు లబ్ధి చేకూరుస్తుందని కార్మికరాజ్య బీమా (ఈఎస్‌ఐ) విజయవాడ గుణదల ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ వర్రా జ్యోతి తెలిపారు.ఈఎస్‌ఐ గుణదల ఆసుపత్రి సౌజన్యంతో ఆంధ్రప్రదేశ్‌ యూనియన్‌ ఆఫ్‌ వర్కింగ్‌ జర్నలిస్ట్సు (ఏపీయూడబ్ల్యూజే) విజయవాడ యూనిట్‌, ప్రెస్‌క్లబ్‌ సంయుక్త అధ్వర్యంలో శనివారం ప్రెస్‌క్లబ్‌లో జర్నలిస్టులు, నాన్‌`జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యులకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో ఈఎస్‌ఐ గుణదల ఆసుపత్రి జనరల్‌ మెడిసిన్‌, సర్జికల్‌, గైనకాలజీ, గుండె వైద్య విభాగాల నిపుణులు, రమేష్‌, కామినేని ఆసుపత్రికి చెందిన వారు, అమరావతి కంటి ఆసుపత్రి వైద్య నిపుణులు నేత్ర వైద్య పరీక్షలు నిర్వహించి మందులు అందజేశారు. ఈ సందర్భంగా ఏపీయూడబ్ల్యూజే విజయవాడ అధ్యక్షుడు చావా రవి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో డాక్టరు జ్యోతి మాట్లాడుతూ, కార్మికులు, వారి కుటుంబ సభ్యులకు ఈఎస్‌ఐ ద్వారా అందిస్తున్న వైద్య సేవలను వివరించారు. ఇ.ఎస్‌.ఐ. వర్తించే సంస్థలో పనిచేసే కార్మికులు, వారి కుటుంబ సభ్యులు సంస్థలో చేరిన రోజునుండే వైద్య సౌకర్యం పొందేందుకు అర్హు లవుతారని, ఈ పథకం క్రింద బీమా కార్మికుడు, వారి కుటుంబ సభ్యులు పూర్తి వైద్య సహాయం పొందుతారని, అవసరాన్ని బట్టి సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రులలో కూడా వైద్య సేవలు కల్పిస్తారని వివరించారు. కార్మికులు పని చేస్తుండగా అస్వస్థతకు, ప్రమాదాలకుగురైనప్పుడు వారు చెల్లించిన చందాతో నిమిత్తం లేకుండా వైద్య సదుపాయం కల్పిస్తామని, ఈ సదుపాయాన్ని పొందేందుకు ఎటువంటి పరిమితిలేదన్నారు. ఈ పథకం క్రిందకు వచ్చే కార్మికులకు అన్ని రకాల అనారోగ్యాలకు, కాన్పులకు, గాయాలకు, వృత్తి సంబంధమైన వ్యాధులకు, ప్రసూతి, శస్త్ర చికిత్సతో సహా నిర్థేశించిన రీతిలో వైద్య సౌకర్యం కల్పిస్తామని డాక్టరు జ్యోతి వివరించారు. ఈఎస్‌ఐ సేవలను కార్మికులందరూ వినియోగించుకోవాలని కోరారు. కొన్ని యాజమాన్యాలు తమ వద్ద పనిచేసే సిబ్బంది అందరికీ ఈఎస్‌ఐ కార్డులు ఇవ్వడంలేదనీ, దాని వల్ల వారు ఈఎస్‌ఐ ప్రయోజనాలు పొందలేకపోతున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. యాజమాన్యాలు తమ వద్ద పనిచేసే అర్హులైన కార్మికులందరికీ ఈఎస్‌ఐ కార్డులు ఇవ్వాలనీ, అప్పుడే పథకం లక్ష్యం నెరవేరుతుందని చెప్పారు. ఈఎస్‌ఐ గుణదల ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యుడు పూజారి రాజేష్‌ మాట్లాడుతూ కార్మిక రాజ్య బీమా చట్టం క్రింద నమోదు అయిన కార్మికులకు వారి కుటుంబ సభ్యులకు అన్ని రకాల వైద్య సౌకర్యం కల్పించటం ఈ పథకం ముఖ్య ఉద్దేశమని చెప్పారు. ఈ పథకం క్రింద చెల్లించే చందా గోరంత, కార్మికునికి లభించే భద్రత కొండంత. నామమాత్రపు చందాతో బీమా దారు లకు వైద్యహితలాభంతో పాటు పలు నగదు హితలాభాలను, సామాజిక భద్రతను ఈ పథకం కల్పిస్తుందన్నారు. ఐజేయూ జాతీయ సమితి సభ్యులు షేక్‌ బాబు, ఏపీయూడబ్ల్యూజే విజయవాడ కార్యదర్శి దారం వెంకటేశ్వరరావు, విజయవాడ ప్రెస్‌క్లబ్‌ అధ్యక్షుడు కంచల జయరాజ్‌, కార్యదర్శి దాసరి నాగరాజు, ఈఎస్‌ఐ గుణదల ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు మోదుమూడి మురళీకృష్ణ, చిన్నపత్రిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమణారెడ్డి, ఫోటో జర్నలిస్టుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు విజయభాస్కర్, ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు రఘురాం తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

కొండవీడు ఉత్సవాల్లో సీబీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘వందేమాతరం’ చిత్ర ప్రదర్శనను ప్రారంభించిన కేంద్ర మంత్రి డా. పెమ్మసాని

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కొండవీడు ఉత్సవాల్లో భాగంగా, ‘జాతీయ గీతం వందేమాతరం – 150 సంవత్సరాలు’ అనే …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *