విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో 31 లక్షల ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికే దక్కుతుందని దేవాదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు అన్నారు. నగరంలోని కుమ్మరిపాలెం షాదీఖానాలో 29,33,38 డివిజన్లకు చెందిన 583 మందికి ఇళ్ల పట్టాలను సబ్ కలెక్టర్ ప్రవీణ్ చంద్ తో కలసి రాష్ట్ర మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు పంపిణీ చేశారు. ఈసందర్భంగా మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎజగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రతి ఒక్కటి 90 శాతం నెరవేర్చారన్నారు. ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. గత పాలకులు ఎప్పుడైన పేదవారికి ఇంత పెద్ద ఎత్తున ఉచితంగా ఇళ్లు ఇచ్చిన సందర్భం వుందా అన్ని ప్రశ్నించారు. ఇంత పెద్ద ఎత్తున పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇళ్లు నిర్మిస్తూంటే ఒర్వలేని ప్రతిపక్షనేత పేదలకు ఇళ్లు ఇచ్చే విషయంలో ఎన్నో రాజకీయాలు చేయడం సరికాదన్నారు.
విజయవాడ సబ్ కలెక్టర్ జిఎస్ఎస్ ప్రవీణ్ చంద్ మాట్లాడుతూ నగరంలోని 29,33,38 డివిజన్లకు చెందిన 583మందికి కంకిపాడు మండలం వేల్పూరు గ్రామంలో ఇళ్ల స్థలాలు మంజూరు చేయడం జరిగిందన్నారు . రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఇళ్ల స్థలాల కోసం ధరఖాస్తు చేసిన వారిలో అర్హులైన వారికి 90 రోజులో ఇళ్ల స్థలాలు మంజూరు కింద, గతంలో అర్హుల జాబితాలో మిస్సయిన వారికి ప్రస్తుతం ఇళ్ల స్థలాలు మంజూరు చేయడం జరిగిందన్నారు. 29వ డివిజన్లో 192 మందికి, 33వ డివిజన్లో 232 మందికి, 38వ డివిజన్లో 159 మందికి ఇళ్ల స్థలాలు మంజూరు చేయడం జరిగిందన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు గుడివాడ నరేంద్ర, బి. కోటిరెడ్డి, మైలవరపు రత్నకుమారి, మాజీ కార్పొటర్ సంధ్యరాణి. తహాశీల్దార్ మాధురి తదితరులు పాల్గొన్నారు.