-అధికారులతో ఆయా పధకాలపై సమీక్షించిన రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడలోని ఇరిగేషన్ క్యాంపు కార్యాలయం రైతు శిక్షణ కేంద్రంలో జగనన్న స్వచ్ఛ సంకల్పం, జగనన్న పచ్చతోరణం, గ్రామీణాభివృద్ధి పథకాలపై అధికారులతో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో గ్రామాలన్నీ మెరుగైన పారిశుద్ధ్యం, చక్కని పచ్చదనంతో కళకళలాడుతూ ఉండాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి వైయస్ జగన్ పలు పథకాలకు శ్రీకారం చుట్టారని అన్నారు. జగనన్న స్వచ్ఛ సంకల్పం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్యకరమైన వాతావరణాన్ని పరిశుభ్రతను తీసుకురావాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని అన్నారు. ఈ మేరకు ప్రత్యేకంగా సన్నాహక కార్యక్రమాలను కూడా నిర్వహించామని తెలిపారు. ప్రజా భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాలు విజయవంతం అయ్యాయని గుర్తు చేశారు. రాష్ట్రంలో మనం-మన పరిశుభ్రత పేరుతో నిర్వహించిన కార్యక్రమాల స్ఫూర్తితో మరింత మెరుగైన కార్యక్రమాలను రూపొందించాలని సూచించారు. పారిశుధ్యం పట్ల ప్రజల ఆలోచనా విధానంలో మార్పు తీసుకురావాలని, అందుకు ప్రజలను భాగస్వాములను చేయాలని కోరారు. ప్రజల్లో అవగాహనను పెంచడం ద్వారా ఆరోగ్యకర వాతావరణాన్ని సాధించాలని పిలుపునిచ్చారు.
పచ్చదనంను పెంచాలి…
రాష్ట్రంలో లో జగనన్న పచ్చతోరణం కార్యక్రమం ద్వారా హరిత ఆంధ్రప్రదేశ్ ని తీసుకురావాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ఈ ఏడాది మొత్తం 18,700 కిలోమీటర్ల మేర అవెన్యూ ప్లాంటేషన్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఇందులో 74 కిలోమీటర్లు నేషనల్ హైవేస్, 758 కిలోమీటర్ల మేర స్టేట్ హైవేలు, పద్దెనిమిది వందల కిలోమీటర్ల మేర ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన రోడ్లు, 16 వేల ఇతర గ్రామ పంచాయతీ రోడ్లకు ఇరువైపులా పెద్దఎత్తున మొక్కలను నాటాలనే లక్ష్యం కు అనుగుణంగా పనిచేయాలని సూచించారు. ఇందుకోసం అవసరమైన అన్ని వనరులను సిద్ధం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా గుర్తించిన నాలుగు వేల సంస్థలలో ఆరు లక్షల మొక్కలు నాటాలని అన్నారు. ఇందుకుగాను ఇప్పటికే 20.53 లక్షల మొక్కల్ని సిద్ధంగా ఉన్నాయని, మిగిలిన 54.5 లక్షల మొక్కలను ఈ నెల 15 నాటికి సిద్దంగా ఉంచుకోవాలని అన్నారు. మొక్కలను నాటడం తోనే సరిపెట్టకుండా వాటిని సంరక్షించేందుకు 25,293 మంది వాచర్లను, 3,880 మంది వాటర్ ట్యాంకర్ల సప్లై దారులను కూడా గుర్తించామని తెలిపారు. 13 జిల్లాలకు మొక్కల సంరక్షణకు ప్రత్యేకంగా అధికారులను కూడా నియమించడం జరిగిందని తెలిపారు. ప్రతి మొక్కను సంరక్షించుకోవాలని కోరారు. ఇకపై మొక్కల కోసం ఇతరులపై ఆధారపడకుండా ప్రతి మండలానికి కనీసం మూడు నర్సరీలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. కనీసం ఐదు ఎకరాల భూమి కలిగిన రైతులు నర్సరీలు ఏర్పాటు చేసుకునేందుకు అవసరమైన చేయూతను అందించాలని అధికారులకు సూచించారు. వారి నుంచి మొక్కలను కొనుగోలు చేయడం ద్వారా మన ప్రాంతానికి అవసరమైన మొక్కలు మనమే సిద్ధం చేసుకునేందుకు వీలవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో లో పంచాయతీ రాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, పంచాయతీరాజ్ కమిషనర్ గిరిజాశంకర్, స్వచ్ఛాంధ్ర కార్పోరేషన్ ఎండి పి.సంపత్‌కుమార్, నరేగా డైరెక్టర్ చినతాతయ్య తదితరులు పాల్గొన్నారు.