-ఆప్కో ఛైర్మన్ చిల్లపల్లి వెంకట నాగమోహన రావు
-12రోజుల పాటు జిల్లా కేంద్రాలు, ముఖ్య నగరాలలో ప్రత్యేక ప్రదర్శనలు
-ఆప్కో కేంద్రకార్యాలయం అవరణలో ఘనంగా విభిన్న కార్యక్రమాలు
-చేనేత రంగంలోని విశిష్ట వక్తులకు సన్మానం
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని అన్ని రకాల చేనేత వస్త్రాలను ఉత్పత్తి ధరలకే విక్రయించాలని నిర్ణయించామని ఆప్కో ఛైర్మన్ చిల్లపల్లి వెంకట నాగ మోహన రావు తెలిపారు. ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవం జరుపుకుంటుండగా, 18వ తేదీ వరకు 12రోజుల పాటు చేనేత వస్త్రాల ప్రదర్శన అమ్మకం ఉంటుందన్నారు. ఇంతకు ముందు ఎప్పుడూ ఇటువంటి అవకాశం వినియోగదారులకు లభించలేదని అన్ని జిల్లా కేంద్రాలతో పాటు, విజయవాడ, తిరుపతి, రాజమండ్రి తదితర ముఖ్య పట్టణాలలో ఈ ప్రత్యేక విక్రయాలు ఉంటాయని చిల్లపల్లి వివరించారు. జాతీయ వినియోగదారులను చేనేత వస్త్రాల వైపుకు ఆకర్షించాలన్న ముఖ్య ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమాన్ని ఎంచుకోగా, పూర్తిగా నూతన వెరైటీలు ఈ ప్రదర్శనలో అందుబాటులో ఉంచుతున్నామని, ప్రతి కొనుగోలుదారుడు ప్రత్యేక అనుభూతిని పొందేలా వస్త్ర శ్రేణి ఉంటుందని ఆప్కో ఛైర్మన్ స్పష్టం చేసారు. మంగళగిరి, వెంకటగిరి, ఉప్పడ రకాలతో పాటు రెడీమెడ్ వస్త్రాలు సైతం సిద్డంగా ఉంటాయన్నారు. మరోవైపు జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత కార్మికుల కోసం పలు ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నామని పేర్కొన్నారు.
చేనేత రంగానికి సంబంధించి విశిష్ట సేవలు అందించి జాతీయ స్దాయి అవార్డులు పొందిన 10 మందిని ప్రత్యేకంగా సన్మానించనున్నామన్నారు. వీరు చేనేత ఉత్పత్తి, మార్కెటింగ్ ,డిజైన్ల రూపకల్పనలో తమదైన పనితీరును ప్రదర్శించి ఉన్నత స్దాయి అవార్డులు పొందిన వారై ఉంటారని చిల్లపల్లి తెలిపారు. మరో వైపు మృతి చెందిన చేనేత కార్మికుల కుటుంబాలను సైతం ఆదుకోవాలని సదుద్ధేశ్యంతో ప్రతి కుటుంబానికి రూ.12,500 వంతున దాదాపు వందకు పైగా కుటుంబాలకు ఆప్కో నుండి సహాయం చేయాలని నిర్ణయించామన్నారు. విజయవాడలోని ఆప్కో కేంద్ర కార్యాలయంలో ఏడవతేదీ జరిగే కార్యక్రమానికి రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ముఖ్యఅతిధిగా హాజరు కానున్నారని, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి, చేనేత జౌళి శాఖ కార్యదర్శి శశిభూషణ్ కుమార్ , చేనేత జౌళి శాఖ సంచాలకులు అర్జునరావుతో సహా పలువురు ప్రముఖులు కార్యక్రమానికి రానున్నారని వివరించారు. ఏడవ తేదీ కార్యక్రమంలో నూతన మగ్గాలు. అధునిక డిజైన్లకు సంబంధించిన వస్తు సామాగ్రి ప్రదర్శిచ నున్నామని, రసాయన రహిత రంగులతో తయారు చేస్తున్న వస్త్రాలు సైతం ప్రదర్శించనున్నామని చిల్లపల్లి తెలిపారు.