-హైదరాబాదులో వంశీ అంతర్జాతీయ ఉగాది పురస్కారాలు
-ముఖ్య అతిధిగా పురస్కారాలు అందించిన ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్
హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త :
తెలుగు జాతి వైభవాన్ని దశదిశలా చాటుతున్న మహనీయులకు ఉగాది పురస్కారాలు అందించటం గర్వకారణం అని ప్రపంచ తెలుగు రచయితల సంఘం గౌరవ అధ్యక్షులు, అవనిగడ్డ ఎమ్మెల్యే డాక్టర్ మండలి బుద్ధప్రసాద్ అన్నారు. శనివారం హైదరాబాద్ చిక్కడపల్లి శ్రీ త్యాగరాయ గానసభావేదికపై అర్ధ శతాబ్ది సాంస్కృతిక సేవా సంస్థ “వంశీ ఇంటర్నేషనల్ – ఇండియా” ఆధ్వర్యంలో “53వ వంశీ అంతర్జాతీయ ఉగాది పురస్కారాలు” కార్యక్రమం జరిగింది.
వంశీ – వేగేశ్న వ్యవస్థాపకులు, కళాబ్రహ్మ, శిరోమణి డాక్టర్ వంశీ రామరాజు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో ప్రపంచవ్యాప్తంగా 12 దేశాలలోని వివిధ రంగాల్లో ప్రతిభామూర్తులైన 53 మందికి ముఖ్య అతిథి ఉమ్మడి రాష్ట్ర మాజీ మంత్రి, ఉమ్మడి రాష్ట్ర అధికార భాషా సంఘం మాజీ చైర్మన్, ప్రపంచ తెలుగు మహాసభల నిర్వాహకులు, ప్రపంచ తెలుగు రచయితల సంఘం గౌరవ అధ్యక్షులు, అవనిగడ్డ ఎమ్మెల్యే డాక్టర్ మండలి బుద్ధప్రసాద్ ఉగాది పురస్కారాలు ప్రదానం చేశారు.
ఈ సందర్భంగా బుద్ధప్రసాద్ మాట్లాడుతూ వంశీ రామరాజు ఆధ్వర్యంలో తెలుగు జాతి పతాకాన్ని దేశ విదేశాల్లో ఎగురవేస్తూ తెలుగుజాతికి కీర్తిని తెస్తున్న మహానుభావులకు ఈ ఉగాది పురస్కారాలు అందించడం గర్వకారణం అన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న తెలుగు వారి కంటే విదేశీ ఆంధ్రులు రాష్ట్రేతర ఆంధ్రులే తెలుగు భాష ఔన్నత్యం కోసం పరితపిస్తున్నారని తెలిపారు. అమెరికా సహా అనేక విదేశాల్లో స్థిరపడిన తెలుగువారు తమ బిడ్డలకు తెలుగు భాష, తెలుగు పాట, తెలుగు వస్త్రధారణ నేర్పేందుకు కూచిపూడి నృత్యంలో శిక్షణ ఇస్తూ తమ జాతి ఔన్నత్యాన్ని భావితరాలకు అందిస్తున్నారని తెలిపారు.
కీడులో మేలు అన్న చందాన కరోనా లాక్డౌన్ సమయంలో వంశీ రామరాజు చొరవ తీసుకొని అంతర్జాలం ద్వారా అంతర్జాతీయంగా ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో స్థిరపడం తెలుగు వారందరినీ ఒకే వేదిక పైకి తెచ్చి తెలుగు భాషకు ఎంతో మేలు చేశారన్నారు. ఈ వేదికపై ఉగాది పురస్కారాలు అందుకున్న ఎంతోమంది మహనీయుల స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ అందుకుని తెలుగు జాతి ఔన్నత్యాన్ని భావితరాలకు అందించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో భారత మాజీ ప్రధాని స్వర్గీయ భారతరత్న పీవీ నరసింహారావు సోదరులు పీవీ మనోహరరావు, జాతీయ పతాక రూపకర్త స్వర్గీయ పింగళి వెంకయ్య మనవడు, మాచర్ల ప్రభుత్వ డిగ్రీ కళాశాల విశ్రాంతి ప్రిన్సిపాల్ జివిఎన్ నరసింహం దంపతులు, ప్రముఖ పత్రిక సంపాదకులు డాక్టర్ కె.రామచంద్ర మూర్తి, ప్రముఖ సినీనటి కవిత, ఇంకా మరెందరో ప్రముఖులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News