-స్వచ్ఛత, పారిశుద్ధ్యం, పచ్చదనం, నీటి నిర్వహణ, శక్తి నిర్వహణలో జిల్లాను రోల్ మోడల్ గా నిలుపుదాం…
-అధ్యాపకుల సమర్ధ మార్గదర్శకత్వంలో ఉన్నత విద్యాసంస్థల విద్యార్ధుల భాగస్వామ్యం ద్వారా దేశాన్ని
పరిశుభ్రంగా ఉంచుదాం…
-ఇది అన్ని విద్యాసంస్థలు ద్వారా మాత్రమే సాధ్యం…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విద్య ద్వారానే జాతీయ, సమాజాభివృద్ధి సాధ్యమని జిల్లా కలెక్టరు జె. నివాస్ అన్నారు. కేంద్ర ఉన్నత విద్యాశాఖకు చెందిన మహాత్మాగాంధి నేషనల్ కౌన్సిల్ ఆఫ్ రూరల్ ఎడ్యుకేషన్ వారు శుక్రవారం జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా స్వచ్ఛతా కార్యాచరణ ప్రణాళిక కార్యక్రమం పై నిర్వహించిన వర్క్ షాపులో జిల్లా కలెక్టరు జె.నివాస్ ముఖ్య అతిథిగా ప్రసంగం చేశారు. ఈకార్యక్రమంలో నేషనల్ కౌన్సిల్ ఆఫ్ రూరల్ ఎడ్యుకేషన్ కోఆర్డినేటర్ యం. సాయికిరణ్, రిసోర్స్ పర్సన్ సురేష్ మరియు సెల్వం, డా. యన్ టిఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ శ్యామ్ ప్రసాద్, రిజిష్ట్రార్ కె. శంకర్, యన్ యస్ యస్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ డా. వివేకానంద, కృష్ణా యూనివర్సిటీ రిజిష్ట్రార్ ప్రొఫెసర్ వై.కె. సుందరకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కలెక్టరు మాట్లాడుతూ స్వచ్ఛతా కార్యక్రమాల నిర్వహణ, పర్యావరణ పరిరక్షణ అంశాలలో విజయవాడలోని లయోలా కళాశాలకు జాతీయ అవార్డు రావడం చాలా సంతోషం కలగించిందన్నారు. స్వచ్ఛత కార్యాచరణ ప్రణాళికలో పారిశుద్ధ్యం, పరిశుభ్రత, పచ్చదనం, నీటి నిర్వహణ, శక్తి నిర్వహణ ముఖ్యమైన అంశాలు అన్నారు. ఇవి జిల్లా యొక్క సుస్థిర అభివృద్ధికి చాలా ముఖ్యమైనవి అన్నారు. ఇవి ఆరోగ్యకరమైన జీవనానికి మెరుగైన జీవిత నాణ్యతను రాబోయే తరాలకు మంచి భవిష్యత్తును కూడా అందించేందుకు దోహదపడతాయన్నారు. అన్ని ఉన్నత విద్యాసంస్థలు స్వచ్ఛతా కార్యాచరణ ప్రణాళిక ఉత్తమ పద్ధతులను అమలు చేయాలన్నారు. అవి
జిల్లా అభివృద్ధి లో ఒక భాగం కావాలన్నారు. ప్రస్తుతం మనందరం కోవిడ్ సంక్షోభాన్ని ఎ దుర్కుంటున్నామని, ఈ సమయంలో పారిశుధ్యం అనేది ఒక ముఖ్యమైన అంశమని ఆయన పేర్కొంటూ మనమందరం మనల్ని మనం రక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కృష్ణాజిల్లాలో డా. యన్ టిఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం, కృష్ణా విశ్వవిద్యాలయం, రెండు విశ్వవిద్యాలయాలతో పాటు 5 డిగ్రీకళాశాలలు, 15 ఇంజినీరింగ్ కళాశాలలు, 15 పిజి కళాశాలలు, రెండు వైద్యకళాశాలలు ఉన్నాయన్నారు. ఈసందర్భంగా ఆయా ఉన్నత విద్యాసంస్థల ప్రిన్సిపల్స్ అందరికీ స్వచ్ఛత కార్యాచరణ ప్రణాళిక ఉత్తమ పద్ధతులను అనుసరించడం ద్వారా విద్యార్ధులు చాలా ప్రయోజనం పొందుతారన్నారు. తద్వారా విద్యార్ధుల సేవ, చొరవ మనస్థత్వాన్ని అభివృద్ధి పరచవచ్చన్నారు. అంతేగాకుండా భవిష్యత్తులో సవాళ్లు, కమ్యూనికేషన్ వ్యూహాల అభివృద్ధిని అర్ధం చేసుకుంటారన్నారు. వారు నైతికవిలువలతో కూడిన మంచి పౌరుడిగా ఎదిగేందుకు ఎంతో దోహదపడుతుందన్నారు. అవసరాల ఆధారిత సాంకేతికత యొక్క ఆవిష్కరణలు అభివృద్ధికి ఆస్కారం ఉన్నందున విద్యార్ధులు స్వచ్ఛత యాక్షన్ ప్లాన్ ద్వారా క్రొత్త ఉపాధి అవకాశాలను అన్వేషించవచ్చన్నారు. భవిష్యత్తులో కృష్ణాజిల్లా స్వచ్ఛత, పారిశుద్ధ్యం, పచ్చదనం, నీటినిర్వహణ, శక్తి నిర్వహణలో రాష్ట్ర మొత్తానికి ఒక రోల్ మోడల్ గా స్ఫూర్తి దాయకంగా నిలుస్తుందనే గట్టినమ్మకం తనకు ఉందన్నారు. ఇది అన్ని విద్యాసంస్థలు ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని ప్రతీ ఒక్కరూ ఇందులో భాగస్వాములు కావాలని కలెక్టరు కోరారు.