-ఇళ్ల స్థలాల కేటాయింపు నిరంతర ప్రక్రియ…
-ఎమ్మెల్యే చేతులమీదుగా 108 మందికి కళ్లజోళ్ల పంపిణీ…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రవ్యాప్తంగా ప్రతి పేదవాడి సొంతింటి కలను నెరవేర్చిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దేనని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు అన్నారు. 33వ డివిజన్ సత్యనారాయణపురంలోని 215, 217వ వార్డు సచివాలయంలో అర్హులైన పేదలందరికీ స్థానిక కార్పొరేటర్ శర్వాణి మూర్తితో కలిసి ఆయన ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మల్లాది విష్ణు మాట్లాడుతూ.. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయని విధంగా 31 లక్షల మంది పేద కుటుంబాలకు వైఎస్సార్ సీపీ ప్రభుత్వం సొంతింటి స్థలాలను మంజూరు చేయడం జరిగిందన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో 30వేల మంది నిరుపేద కుటుంబాలకు ఇళ్ల పట్టాలు కేటాయించగా.. ఒక్క 33వ డివిజన్ లోనే 1,108 మందికి పట్టాలను అందజేసినట్లు వివరించారు. పేదలకు ఉచితంగా స్థలం ఇవ్వడమే కాకుండా.. ఇల్లు నిర్మించుకునేందుకు రూ. 1 లక్షా 80 వేల ఆర్థిక సాయాన్ని అందించడం జరుగుతోందన్నారు. లబ్ధిదారుని అవసరాన్ని బట్టి మరో రూ. 50 వేల నుంచి లక్ష రూపాయల వరకు బ్యాంకర్ల నుంచి రుణాన్ని సమకూరుస్తామన్నారు. అంతేకాకుండా ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి ఉచితంగా ఇసుక, సబ్సిడీపై సిమెంట్, ఐరన్ అందించబోతున్నట్లు వివరించారు. ఇంటి బేస్ మెంట్ స్థాయి నుంచి పూర్తయేంత వరకు వివిధ దశలలో నగదు క్రమం తప్పకుండా నగదును లబ్ధిదారుల అకౌంట్లలో జమ చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని అద్దెదారులందరూ సొంతింటి యజమానులు కావాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని చెప్పుకొచ్చారు. కావున రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సహాయ సహకారాలను అందిపుచ్చుకుని.. లబ్ధిదారులు కొత్త ఏడాది ఆరంభంలోగా గృహ నిర్మాణాలు పూర్తి చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఇళ్ల నిర్మాణాలలో నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ముందు వరసలో నిలపాలని కోరారు.
ఆహ్లాదకర వాతావరణంలో ఇళ్ల నిర్మాణాలు…
రాష్ట్ర ప్రభుత్వం ఆహ్లాదకరమైన ప్రశాంత వాతావరణాలలో జగనన్న కాలనీలను నిర్మిస్తున్నట్లు మల్లాది విష్ణు తెలియజేశారు. సెంట్రల్ నియోజకవర్గానికి సంబంధించి నున్న ప్రాంతంలో ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్నాయని.. రాబోవు రోజుల్లో ఆ ప్రాంతాన్ని గ్రీన్ సిటీగా తీర్చిదిద్దబోతున్నట్లు తెలియజేశారు. ఈ జగనన్న కాలనీలలో మౌలిక సదుపాయాలతో పాటుగా అంగన్వాడీ కేంద్రాలు, వైఎస్ఆర్ క్లీనిక్లు, పీహెచ్సీలు, పాఠశాలలు, బస్ సదుపాయం వంటి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. చంద్రబాబు హయాంలో సెక్రటేరియట్ లోకే ఏకంగా నీరు వచ్చాయని.. అటువంటిది తెలుగుదేశం నాయకులు ఇళ్ల స్థలాల గూర్చి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. చంద్రబాబునాయుడు కార్పొరేట్ లకు కొమ్ముకాయడం తప్ప పేదల సంక్షేమాన్ని ఏనాడూ పట్టించుకోలేదన్నారు. గత తెలుగుదేశం హయాంలో జన్మభూమి కమిటీల పేరిట సంక్షేమ పథకాలను ప్రజలకు అందకుండా ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలే దోచుకుతిన్నారని మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక వార్డు సచివాలయాల ద్వారా పారదర్శకంగా సంక్షేమాన్ని ప్రజలకు ఇంటి వద్దకే అందజేస్తున్నట్లు వెల్లడించారు. ఒక్క 33 డివిజన్ లోనే 1,108 మందికి ఇళ్ల పట్టాలు, 762 మందికి వైఎస్సార్ పింఛన్ కానుక, 159 మందికి జగనన్న తోడు, 35 మందికి కాపు నేస్తం, 72 మందికి చేయూత, 16 మందికి వాహన మిత్ర పథకాల ద్వారా లబ్ధి చేకూరినట్లు పేర్కొన్నారు.
ఇళ్ల స్థలాల పట్టాల కేటాయింపు, పంపిణీ అన్నది నిరంతర కార్యక్రమం అని ఈ సందర్భంగా మల్లాది విష్ణు అన్నారు. పట్టా కోసం అర్హులైన వారు దరఖాస్తు చేసుకున్న తొలి 12 రోజుల్లోనే వార్డు సచివాలయ సిబ్బంది భౌతికంగా వెరిఫికేషన్ పూర్తి చేయడం జరుగుతుందన్నారు. 90 రోజుల్లో ఇంటి పట్టా వారికి మంజూరు చేయడం జరుగుతుందన్నారు. అనంతరం నూతనంగా మంజూరైన 27 ఇళ్ల పట్టాలను లబ్ధిదారులకు ఎమ్మెల్యే గారి చేతులమీదుగా అందజేశారు. అదేవిధంగా స్థానిక కార్పొరేటర్ శర్వాణీ మూర్తి చొరవతో 108 మందికి కళ్ల ఆపరేషన్ చేయించడమే కాకుండా.. వారికి నూతన కళ్లజోళ్లను కూడా పంపిణీ చేయడం అభినందనీయమని ఈ సందర్భంగా మల్లాది విష్ణు అన్నారు. కార్యక్రమంలో స్థానిక వైఎస్సార్ సీపీ నాయకులు ఉప్పు రంగబాబు, మైలవరపు రాము, కె.రత్నకుమార్, దోనెపూడి శ్రీనివాస్, ఎస్.శ్రీనివాస్, చాంద్ శర్మ, చామర్తి మూర్తి, కొండా, కొల్లు రామకృష్ణ, యల్లాప్రగడ విజయలక్ష్మి, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.