-కార్పొరేట్ ప్రయోజనాలే కేంద్ర లక్ష్యం
-రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థ అధ్వాహ్నం
-విశాఖ ఉక్కు ఉద్యమం 13 జిల్లాలకు విస్తరణ
-పోలవరం నిర్వాసితులకు తోడుగా నిలుస్తాం
-పులివెందుల లాకప్ డెత్ పై జ్యుడీషియల్ విచారణ జరపాలి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రాజకీయ, ఆర్థిక పరిపాలనా వైఫల్యాన్ని నిరసిస్తూ స్వతంత్ర్యంగా పోరాటాలకు సమాయత్తం కానున్నట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ వెల్లడించారు. విజయవాడ దాసరిభవన్లో బుధవారం ఆయన విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు.
రామకృష్ణ మాట్లాడుతూ ఈ నెల 7, 8 తేదీలలో విజయవాడలో జరిగిన సీపీఐ రాష్ట్ర కార్యవర్గ, సమితి సమావేశాలలో దేశ, రాష్ట్ర రాజకీయాలు, అనుసరించాల్సిన ఉద్యమాలపై సమావేశం స్పష్టమైన నిర్ణయాలు తీసుకుందనీ, పార్టీ నిర్దిష్టంగా ప్రతివక్ష వైఖరి అవలంభించాలని తీర్మానించిందన్నారు. దేశంలో మోదీ, రాష్ట్రంలో వైఎస్ జగన్ పరిపాలనా విధానాలపై కలసి వచ్చే వామపక్ష, లౌకిక, ప్రజాస్వామిక శక్తులతో ఉద్యమించాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పారు. కరోనా కష్టకాలంలో పేదలు, ధనికుల మధ్య మరింత అసమానతలు వచ్చాయని, అంబానీ, ఆదానీ ఆస్తులు గణనీయంగా పెరిగిపోయాయని పేర్కొన్నారు. దేశంలో నిత్యవసర ధరలను భారీగా పెంచడంతో పేదల దుస్థితి మరింత అధ్వాన్నంగా మారిందన్నారు. మోదీ పాలనలో నూతన ఉద్యోగాలు ఇవ్వలేదని, ఉన్నవి కాస్తా ఊడిపోయాయని, 33 శాతం పరిశ్రమల మనుగడ ప్రశ్నార్థకమైందని వివరించారు. అటు రాష్ట్రంలో సీఎం వైస్ జగన్మో హన్ రెడ్డి సంక్షేమ పధకాలు కరోనా కష్టకాలంలో పేదలకు కొంత ఊరట నిచ్చాయేగానీ, రాష్ట్రాభివృద్ధి మాత్రం బెత్తెడు కూడా ముందుకెళ్లలేదని విశ్లేషించారు. రాష్ట్రమంతా అప్పులమయంగా మారిందని, ఆర్థిక వ్యవస్థ దివాళా తీసిందని విమర్శించారు. నాడు చంద్రబాబు ప్రభుత్వ హయాంలో లక్షా 28 వేల కోట్ల అప్పులు చేయగా.. జగన్ ప్రభుత్వం అంతకంటే పోటీగా రూ. 4 లక్షల కోట్లు అప్పులు తెచ్చిందన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు, పింఛన్లు ఇవ్వలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందని, పారిశుధ్య కార్మికులకు, ఎఎన్ఎంలకు నెలల తరబడి వేతనాల జాప్యం నెలకొందని చెప్పారు. ఎన్నికల ముందు 2.35 లక్షల ఉద్యోగాలిస్తామంటూ జగన్ హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చాక 10,143 ఉద్యోగాలతోనే సరిపెట్టడం నిరుద్యోగులను మోసగించడమేనన్నారు. జగన్ ఇచ్చిన హామీల అమలు చేయాలని కోరుతూ ఒక్కో రంగం ఉద్యమాల రూపాల్లో ముందుకు వస్తోందన్నారు. ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ పోరాట సమితి ఆధ్వర్యంలో పెద్దఎత్తున పోరాటాలు కొనసాగుతున్నాయని, వాటికి సీపీఐ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తోందన్నారు. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్) రద్దు హామీ కోసం ఉద్యోగ సంఘాలు పోరాటానికి సమాయాత్తమయ్యాయని తెలిపారు. వ్యవసాయ రంగంలో అభివృద్ధి ఎక్కడా లేదని, ఏ రంగాన్ని బలోపేతం చేయలేదనీ, కక్ష సాధింపు చర్యలు అధికమవుతున్నాయని తెలిపారు. పార్టీ రాష్ట్ర సమితి సమావేశంలో ఆయా అంశాలపై చర్చించామన్నారు. రాష్ట్ర ప్రభుత్వ వరిపాలనా విధానం ఏ కోణంలో చూసినా రాష్ట్రాభివృద్ధిని సాధించడంలోగాని, ప్రజాస్వామ్యాన్ని రక్షించడంలోగాని, అవినీతిని అరికట్టడంలోగాని విఫలమైందనీ తీర్మానించామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని, టిడ్కో ఇళ్ల పరిస్థితులు, వాటిని లబ్ధిదారులకు అందజేసే అంశంపై రాష్ట్ర వ్యాప్తంగా పట్టణాల్లో సీపీఐ బృందం మరోసారి వర్యటించనుందన్నారు. విశాఖ ఉక్కు ఉద్యమాన్ని 13 జిల్లాలకు విస్తరించాలని, పార్టీ చొరవతో అన్ని పట్టణాల్లో సంఘీభావ సదస్సులు, సభలు, సమావేశాలు నిర్వహిస్తామన్నారు. పోలవరం నిర్వాసితుల సమస్యలపై అఖిలపక్ష ఉ ద్యమాన్ని ముందుకు తీసుకుపోవాలని, గ్రామీణ రైతాంగం, వ్యవసాయ కూలీల సమస్యలపై పార్టీ శాఖా పరంగా చర్చలు నిర్వహించి, స్థానిక పోరాటాలకు సిద్ధమవ్వాలని కౌన్సిల్ లో చర్చించామన్నారు. విశాఖపట్నంలో త్వరలో రెండు రోజులపాటు సదస్సు నిర్వహించనున్నట్లు చెప్పారు. పులివెందుల పోలీస్ స్టేషన్లో అశోక్ అనే యువకుడిన్ని కొట్టిచంపి, అతడి శవాన్ని హడావుడిగా కాల్చివేసిన సంఘటనపై జ్యుడీషియల్ విచారణ చేపట్టాలని, బాధ్యులైన ఎస్టను విధుల నుంచి తొలగించాలని ప్రభుత్వాన్ని డిమాండు చేశారు. సీఎం సొంత నియోజకవర్గంలోనే ఇంత దారుణం జరిగితే అసలు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా? అని మండిపడ్డారు. అటు మైస్ వివేకానందరెడ్డి హత్యపై సీబీఐ విచారణ చేపట్టినప్పటికీ ఇంతవరకు హంతకులెవరనేదీ తేలలేదన్నారు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ సక్రమంగా విధులు నిర్వహించాలని సూచించారు. దేశ వ్యాప్తంగా కొనసాగుతున్న రైతు ఉద్యమానికి రాష్ట్రంలోనూ తోడ్పాటునందించాలని కోరారు.
అంశాల వారీగా సాధన సమితులు : సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు
సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీల సాధనా పోరాటంలో భాగంగా ఆయా కేంద్రాలలో అంశాల వారీగా సాధన సమితుల ఏర్పాటు, రాష్ట్ర వ్యాప్తంగా బస్సుయాత్రల నిర్వహణలపై పార్టీ కౌన్సిల్ లో నిర్ణయించామన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అప్రజాస్వామిక పరిస్థితులు, గ్రామీణ ఉపాధి హమీ పధకం పనుల బిల్లుల చెల్లింపుపైన, యావత్తు రహదారుల అధ్వాన్న స్థితిగతులపై భవిష్యత్తులో ఉద్యమాల రూపంలో ప్రభుత్వంపై సీపీఐ ఒత్తిడి పెంచనుందన్నారు. ఎన్నికల సమయంలో 25 మంది ఎంపీలను గెలిపిస్తే.. కేంద్రం కాలర్ పట్టుకుని హోదా తెస్తానని చెప్పిన జగన్.. నేడు కనీసం ప్రాధేయపడైనా తేలేకపోవడం వల్ల రాష్ట్రానికెంతో నష్టం చేకూరిందని చెప్పారు. విభజన హామీల ప్రకారం ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలకు కేంద్రం ఇస్తామన్న ప్యాకేజీ ఏమైందని ప్రశ్నించారు. రామాయపట్నం పోర్టు వనుల ప్రస్తావనే లేకుండా పోయిందని, కడప ఉక్కు కర్మాగారాన్ని కేంద్రం కట్టాల్సిందిపోయి.. ఉన్న విశాఖ ఉక్కును అడ్డగోలుగా ప్రైవేటీకరణకు పాల్పడుతోందని పేర్కొన్నారు. పోలవరం నిర్మాణం పైనా నిర్లక్ష్యం చూవుతోందని, ఈ దశలో రాష్ట్ర వ్యాప్తంగా సాధనా సమితుల ద్వారా పోరాటాలను ఉధృతం చేస్తామన్నారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జల్లి విల్సన్, రావుల వెంకయ్య, కృష్ణాజిల్లా కార్యదర్శి అక్కినేని వనజ పాల్గొన్నారు.