విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నవశకం ఆవిష్కృతమైందని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు అన్నారు. గుడ్ మార్నింగ్ విజయవాడ సెంట్రల్ కార్యక్రమంలో భాగంగా 31వ డివిజన్ లోని ముత్యాలంపాడు అంబేద్కర్ కాలనీలో స్థానిక కార్పొరేటర్ పెనుమత్స శిరీష సత్యం తో కలిసి ఆయన పర్యటించారు. జోరు వానలోనూ ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా గడప గడపకూ తిరిగి స్థానిక సమస్యలపై ఆరా తీశారు. ప్రధానంగా డ్రైనేజీ సమస్యపై దృష్టి సారించవలసిందిగా అధికారులను ఆదేశించారు. వర్షాకాలంలో ఇంజనీరింగ్, శానిటేషన్, యూజీడీ అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలన్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఆరోగ్య సిబ్బంది జాగ్రత్త వహించాలన్నారు. అనంతరం ఎమ్మెల్యే విలేకర్లతో మాట్లాడారు. గత తెలుగుదేశం ఐదేళ్ల పాలనలో రాష్ట్రంలో అరాచక, ఆటవిక పాలన సాగిందని.. కానీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి సంవత్సరం సంక్షేమ పథకాల క్యాలెండర్ ను ప్రకటించి అన్ని వర్గాల అభ్యున్నతికి కృషిచేస్తున్నారన్నారు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పని చేశానని గొప్పలు చెప్పుకునే చంద్రబాబు.. తన హయంలో పేదల ఇళ్ళ స్థలాల కోసం కనీసం ఒక్క సెంటు భూమి కూడా కొనలేదని గుర్తుచేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎప్పటికప్పుడు భూములు కొనుగోలు చేస్తూ.. ప్రతి 3 నెలలకోసారి పేదలకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేస్తున్నట్లు తెలియజేశారు. కరోనా కష్ట సమయంలోనూ పేదల సంక్షేమాన్ని విస్మరించలేదన్నారు. అన్ని వర్గాలకు ప్రయోజనం చేకూర్చేలా ప్రతీ సంక్షేమ పథకాన్ని రూపొందించి.. వారి సామాజిక, ఆర్థిక అభ్యున్నతికి బాటలు వేస్తున్నామన్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఇంత పెద్దఎత్తున సంక్షేమాన్ని అందిస్తుండటాన్ని చూసి తెలుగుదేశం నాయకులు ఓర్వలేకపోతున్నారని మల్లాది విష్ణు అన్నారు. రెండేళ్లుగా అన్ని ఎన్నికల్లోనూ జనం ఛీ కొడుతున్నా.. తెలుగుదేశం నాయకుల బుద్ధి మాత్రం మారడం లేదన్నారు. కులాలు, ప్రాంతాల మధ్య చిచ్చురేపుతూ నీచ రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. చివరకు ప్రజాసమస్యల పరిష్కారనికై చేపట్టిన గుడ్ మార్నింగ్ విజయవాడ కార్యక్రమాన్ని కూడా విమర్శించే స్థాయికి టీడీపీ నాయకులు దిగజారారని మండిపడ్డారు. తెలుగుదేశం నాయకుల చిల్లర రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. గత ఐదేళ్ల చంద్రబాబు ప్రభుత్వం ప్రజలకు ఏమాత్రం ఉపయోగపడలేదని.. మరీముఖ్యంగా విజయవాడ నగరం అన్ని రంగాలలోనూ వెనుకబడిందన్నారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత నగర ప్రగతి ఆశించిన దాని కన్నా ఎక్కువగా ముందుకు సాగుతుందన్నారు. ఒక్క 31వ డివిజన్ లోనే రెండేళ్లల్లో రూ. కోటి 18 లక్షల అభివృద్ధి పనులు చేపట్టినట్లు వెల్లడించారు. అన్ని ప్రాంతాల అభివృద్ధే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అభిమతమని మల్లాది విష్ణు స్పష్టం చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ డివిజన్ ప్రెసిడెంట్ సామంతపూడి చిన్నా, డివిజన్ కోఆర్డినేటర్ పట్టాభి, స్థానిక నాయకులు మానం వెంకటేశ్వరరావు, కల్వపల్లి వెంకటేశ్వరరావు, అంగిరేకుల విజయ్, వైఎస్సార్ సీపీ కార్యకర్తలు, వీఎంసీ అధికారులు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
కొండలు ఎక్కుతూ… గుట్టలు దాటుకుంటూ…
-అడవి బిడ్డల సమస్యలు వింటూ… అధికారులకు పరిష్కారాలు సూచిస్తూ… -గిరిజనంతో మమేకం అయిన ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ -రెండో రోజు …