
-రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్
తిరుమల, నేటి పత్రిక ప్రజావార్త :
తిరుపతి జిల్లాను పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని, రాబోయే రోజుల్లో తిరుపతి పరిసర క్షేత్రాలు, పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. సోమవారం తెల్లవారుఝామున తన కుటుంబ సభ్యులతో కలిసి మంత్రి కందుల దుర్గేష్ తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. కుటుంబంతో కలిసి వైకుంఠ శ్రీనివాసుడి దివ్య దర్శనం చేసుకోవడం అనిర్వచనీయమైన అనుభూతి కలిగించిందని, ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలు బాగుండాలని, రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకెళ్లాలని స్వామిని ప్రార్థించినట్లు మంత్రి దుర్గేష్ తెలిపారు.
తిరుమల శ్రీవారి దర్శనానంతరం మంత్రి కందుల దుర్గేష్ మీడియాతో పర్యాటక అభివృద్ధి కోసం ఆగస్టు 7,8 తేదీల్లో తిరుపతిలో నిర్వహించే సమావేశంలో జిల్లాలోని అధికార యంత్రాంగం, పర్యాటక, దేవాదాయ శాఖ అధికారులు పాల్గొంటారని తెలిపారు. తిరుపతి జిల్లాలోని వివిధ క్షేత్రాలు, పర్యాటక ప్రదేశాలన్నింటిని కలిసి టూరిజం సర్క్యూట్ గా ఏర్పాటు చేస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వ శాస్కి పథకం క్రింద మంజూరైన గండికోట పర్యాటక ప్రాజెక్టు అభివృద్ధి పనులకు ఆగస్టు 1వ తేదీన సీఎం చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా శంకుస్థాపన చేయించాలని ఆలోచన చేస్తున్నామన్నారు. టూరిజం రంగానికి పారిశ్రామిక హోదా కల్పన, నూతన పాలసీ ప్రకటనతో తిరుపతి, వైజాగ్ ప్రాంతాల్లో పీపీపీ విధానంలో ఫైవ్ స్టార్ హోటల్లు నెలకొల్పేందుకు పలువురు ఇన్వెస్టర్లు ముందుకొస్తున్నారన్నారు.వాటి ఏర్పాటుకు తాము కృషి చేస్తున్నామన్నారు. అంతేగాక రాష్ట్రంలోని సుదీర్ఘ సముద్రతీరంలో వాటర్ స్పోర్ట్స్, బీచ్ రిసార్ట్స్ ఏర్పాటు చేస్తామని తెలిపారు.వైజాగ్-చెన్నై మధ్య క్రూజ్ ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు.సీ ప్లేన్ ను పూర్తిస్థాయిలో తీసుకురావడానికి కృషి చేస్తున్నామన్నారు. ప్రజానీకానికి ఉపయోగపడేలా రిషికొండ ప్యాలెస్ ను తీర్చిదిద్దుతామన్నారు.
సీఎం చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ల నేతృతంలో గతంలో ఎన్నడూ లేని విధంగా పర్యాటక రంగ అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు. గత ప్రభుత్వం పర్యాటకరంగానికి పూర్తిగా తిలోదకాలిస్తే కూటమి ప్రభుత్వం పట్టాలెక్కించిందన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హస్తకళా నైపుణ్యాభివృద్ధి సంస్థ (లేపాక్షి) ఛైర్మన్ డా. పసుపులేటి హరిప్రసాద్ మాట్లాడుతూ పర్యాటక ప్రాంతాలు, ఆధ్యాత్మిక క్షేత్రాలలో మరిన్ని హ్యాండీ క్రాఫ్ట్ సెంటర్స్(లేపాక్షి)ను ఏర్పాటుచేసి హస్తకళను అభివృద్ధిచేసి హస్తకళాకారులను ప్రోత్సహించడానికి సహకారం అందించాలని ఈ సందర్భంగా వినతిపత్రం అందజేసినట్లు తెలిపారు.
అంతకుముందు తిరుమల చేరుకున్న మంత్రి కందుల దుర్గేష్ కు పర్యాటక శాఖ అధికారులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన పార్టీ ఇన్ చార్జ్ డా.పసుపులేటి హరిప్రసాద్, చంద్రగిరి నియోజకవర్గ పార్టీ ఇన్ చార్జ్ దేవర మనోహర్, పుంగనూరు నియోజకవర్గ పార్టీ ఇన్ చార్జ్ సిరివెల్లు చిన రాయల్ తదితరులు ఘనస్వాగతం పలికారు.
Prajavartha Online Telugu News