Breaking News

జనసేన విజయం దేశ రాజకీయ చరిత్రలో ఓ మైలురాయి

– నో సీట్ టూ వన్ సీట్, వన్ సీట్ టూ 100% స్ట్రైక్ రేట్ తో విజయం సాధించాం
– జాతీయ వాదం కలిగిన ప్రాంతీయ పార్టీ జనసేన
– పార్టీ నడపడానికి వేల కోట్లు కాదు బలమైన భావజాలం కావాలి
– జనసేన పోరాటం వల్లే సుగాలి ప్రీతి కుటుంబానికి పరిహారం అందింది
– అప్పటి వైసీపీ ప్రభుత్వం కేసు సీబీఐకి అప్పగించినట్లు నాటకం ఆడింది
– స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిలుపుదలకు జనసేన పార్టీ మొదటి నుంచి పోరాటం చేసింది
– వైసీపీ నాయకుడు కనీసం అఖిల పక్షం వేయమని సూచించినా స్పందించలేదు
– విశాఖపట్నంలోని పార్టీ కార్యనిర్వాహక వర్గం సమావేశంలో ప్రసంగించిన జనసేన అధ్యక్షులు  పవన్ కళ్యాణ్ 

విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
‘జనసేన పార్టీ సాధించిన విజయం దేశ రాజకీయ చరిత్రలో ఒక మైలురాయి. నో సీట్ టూ వన్ సీట్, వన్ సీట్ టూ 100% స్ట్రైక్ రేట్ సాధించి కొత్త చరిత్రను లిఖించాం. జనసేన ప్రాంతీయ పార్టీ అయినా సైద్ధాంతికంగా బలమైన జాతీయ వాదం కలిగిన పార్టీ. కులం, మతం, ప్రాంతం పేరుతో కొన్ని రోజులు మాత్రమే రాజకీయం చేయగలం. రాజకీయ పార్టీ నడపడానికి వేల కోట్ల డబ్బు, పేరు ప్రతిష్ఠలు కాదు… బలమైన భావజాలం, సైద్దాంతిక బలం ఉన్న ఎవరైనా పార్టీని నడిపించవచ్చ’ని జనసేన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. విశాఖలో మూడు రోజులపాటు జరుగుతున్న జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశాల్లో భాగంగా గురువారం మధ్యాహ్నం పార్టీ కార్యవర్గ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్  రాష్ట్ర కార్యవర్గాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ… ‘పార్టీ ఏడు మూల సిద్ధాంతాల వెనుక ఎంతో మేథోమధనం జరిగింది. ఇది వినే వాళ్లకు చాలా తేలికగా అనిపించవచ్చని కానీ అది కాచి వడపోసిన సారం.

నా రాజకీయ జీవితంలో 15 ఏళ్ళు ఏ పదవీ లేదు
కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడిచిపోయింది. పదవులు రాలేదు… పదవులు రాలేదు అని చాలా మంది మాట్లాడుతున్నారు. పదవుల వ్యామోహంలో పడి మన మూలాలను మనం మరిచిపోతున్నాం. ప్రగతి మార్గం మరిచిపోయి పక్క దారి పట్టడం సహేతుకం కాదు. నా రాజకీయ జీవితంలో 15 ఏళ్లు పదవి లేకుండా బతికాను. రాజకీయాల కోసం వ్యక్తిగత జీవితాన్ని పణంగా పెట్టాను. భారతీయ జనతా పార్టీ వంటి బలమైన పార్టీలో ఉంటే నేను ఒక సంచి పట్టుకొని పార్టీ విరాళాల సేకరణకు వెళ్లేవాడిని. జనసేన పార్టీలో అది కుదరదు. పార్టీకి సైద్ధాంతిక బలం. ఆర్థిక బలం.. సమస్యలపై పోరాడే బలం నేనే ఇవ్వాలి. ఇలా మూడంచెలలో పోరాటం చేస్తే గానీ పార్టీని ముందుకు నడపలేకపోయాను. జనసేన పార్టీ అంటేనే పోరాటాలకు స్ఫూర్తి. నాలుగు గోడల మధ్య ఏం మాట్లాడతామో… బయట కూడా అలానే ముందుకు వెళ్తాము. ఆ రోజు ఆంధ్ర, తెలంగాణ బోర్డర్ లో అయినా, విశాఖలో అయినా అదే చేసి చూపించాము.

సుగాలి ప్రీతి కేసులో సాక్ష్యాలు తారుమారు చేశారు
సుగాలి ప్రీతి కేసు వ్యవహారంలో నా పరిస్థితి పండ్లున్న చెట్టుకే రాళ్ల దెబ్బలు అన్న చందంగా తయారయ్యింది. చేయూతనిచ్చిన వారినే తిడితే ఎలా? గత ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తికి ఎదురు మాట్లాడే ధైర్యం కూడా ఎవరికీ లేదు. ఒక మాజీ ముఖ్యమంత్రిని అరెస్టు చేస్తే కనీసం రోడ్ల మీదకు రావడానికి ఎవరూ సాహసించని పరిస్థితి. అలాంటి సమయంలో ఆ తల్లి ఆవేదన చూసి లక్షల మందితో కర్నూలు నడిబొడ్డుకు వెళ్లి బలంగా గళం వినిపించాను. ఆ పోరాట ఫలితంగా ఆ కేసును సి.బి.ఐ.కి అప్పగిస్తూ అప్పటి ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. చట్టప్రకారం వారికి ప్రభుత్వం నుంచి అందాల్సిన పరిహారాలు అందాయి. కర్నూలుకు 9 కిలోమీటర్ల దూరంలో దిన్నెదేవరపాడులో అయిదు ఎకరాల వ్యవసాయ భూమి ఇచ్చారు. అక్కడ ఎకరం విలువ సుమారు రూ.2 కోట్ల వరకూ మార్కెట్ విలువ ఉంటుందని అంటున్నారు. కర్నూలు నగరంలో భాగమైన కల్లూరు దగ్గర 5 సెంట్ల ఇండ్ల స్థలం, సుగాలీ ప్రీతి తండ్రికి రెవెన్యూ శాఖలో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం ఇచ్చారు. రాజకీయపరంగా మనం తీసుకువచ్చిన ఒత్తిడి ఫలితమే ఇది. గత ప్రభుత్వం కేసును సీబీఐకి అప్పగిస్తూ జీవో జారీ చేసింది. లెటర్ ఇచ్చి లాకర్ లో పెట్టింది. నేను ఉపముఖ్యమంత్రి అయ్యాక సుగాలి ప్రీతి కేసుపై సీఐడీ ఛీఫ్ తో మాట్లాడి త్వరగా న్యాయం చేయాలని సూచించాను. డీజీపీ తో, హోంమంత్రి తో మాట్లాడాను. సీఐడీ విచారణ చేపట్టిన తర్వాత తేలిన అంశం.. అనుమానితుల డీఎన్ఏలు సరిపోలడం లేదు. సాక్ష్యాలు తారుమారు చేశారు. గత ఐదేళ్లలో లా అండ్ ఆర్డర్ దారుణంగా దిగజారింది. అలాంటి పరిస్థితులు ప్రక్షాళన చేసే బాధ్యతను కూటమి ప్రభుత్వం భుజాన వేసుకుంది. గత ప్రభుత్వం చేసిన తప్పుల కారణంగానే కేసు విచారణకు ఇబ్బందులు కలుగుతున్నాయి. నా వరకు నేను సుగాలి ప్రీతి కేసులో దోషులకు శిక్ష పడాలి అని త్రికరణశుద్దిగా కోరుకుంటున్నాను. ఇది ఒక్క సుగాలి ప్రీతి కేసుకు సంబంధించిన అంశం కాదు. బాలికల భద్రతకు సంబంధించిన అంశం.

151 సీట్లు ఇస్తే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అడ్డుకోలేకపోయారు
విశాఖ ఉక్కు ఆంధ్రులు హక్కు. అదీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజల హక్కు. విశాఖ ఉక్కు కోసం చేసిన పోరాటంలో తెలంగాణకు చెందిన వ్యక్తులు కూడా ముగ్గురు చనిపోయారు. గత ముఖ్యమంత్రి ఇక్కడ ఉండి మెడలు వంచుతామని చెబుతారు. ఢిల్లీలో ఏం మాట్లాడలేరు. ఢిల్లీ పెద్దలు వేసే ప్రశ్నలకు వీరి వద్ద జవాబు ఉండదు. రాష్ట్ర విభజన సమయంలో  సోనియా గాంధీ కి కంటపడకుండా విభజనను వ్యతిరేకిస్తున్నట్టు పార్లమెంటులో దొంగచాటుగా ప్లకార్డు ప్రదర్శించారు. స్టీలు ప్లాంటు ప్రైవేటీకరణ ఆపేందుకు 151 సీట్లు వచ్చిన వ్యక్తి.. గత ప్రభుత్వంలో ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. కార్మిక సంఘాల నాయకులకు ప్లాట్లు, కోట్లు ఇచ్చేస్తానంటూ మభ్యపెట్టే ప్రయత్నాలు చేశారు.
ప్రైవేటీకరణ అంశం తెరమీదకు వచ్చిన వెంటనే ఢిల్లీ వెళ్లి శ్రీ అమిత్ షా గారిని కలిసి వినతిపత్రం నేను ఇచ్చాను. స్టీల్ ప్లాంట్ భావోద్వేగాలతో కూడి ఉన్న అంశమని చెప్పాను. గనులు కేటాయించమని విన్నవించాను. మన ప్రయత్నంతో ప్రైవేటీకరణ ఆగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కూడా ఇటీవల ప్రధాన మంత్రి గారిని కలిసిన సందర్భంలో కూడా అదే విషయం చెప్పానే. రూ. 14 వేల కోట్లు సాయం చేశారు. ఆ విషయాన్ని స్వయంగా మోదీ  వచ్చి మరీ చెప్పి వెళ్లారు.

కార్యకర్తల ఇళ్లకు వెళ్తా… వారి కష్టాలు తెలుసుకుంటా..
అధికారం వచ్చే వరకు కార్యకర్తలకు దగ్గరగా ఉండి.. అధికారం వచ్చాక నాయకులు దూరంగా జరుగుతూ ఉంటారు. నేను అధికారం రాగానే కార్యకర్తలకు దగ్గరయ్యేందుకే విశాఖ వచ్చాను. కార్యకర్త ఇంటికి వెళ్ళి ఒక రోజు నిద్ర చేసి వారి కష్టాలు తెలుసుకునే విధానం ప్రారంభించాలని.. గాజువాకకు చెందిన సురేష్ కుమార్ ఇచ్చిన సూచన బాగుంది. వచ్చే విశాఖ పర్యటనలో అమలు చేస్తాను. వీలైతే ఒక రాత్రి అక్కడ బస చేస్తాను. లేకుంటే సాయంత్రం పూట కొంత సమయం ఉంటాను.  సురేశ్ కుమార్ ఇంటికి తొలుత వెళ్తాను. పిఠాపురంలోనూ, తెలంగాణలోనూ కూడా కార్యకర్తల ఇంటికి వెళ్ళే కార్యక్రమాలు చేపడతా. కార్యకర్త ఇంటికి వెళ్ళి వారితోనూ, చుట్టుపక్కలవారితో మాట్లాడి వారి మనోభావాలు, ఆలోచనలు తెలుసుకుంటాను. ఆర్.ఎస్.ఎస్. కార్యకర్తలు ఎంతో క్రమశిక్షణ, నిస్వార్థంతో పనిచేసే విధానం ఆదర్శనీయం. వాళ్లు ఏ గ్రామానికి వెళ్లినా కార్యకర్తల ఇళ్లలోనే బస చేస్తారు. అంత నిబద్ధతతో పనిచేస్తారు. ఆర్.ఎస్.ఎస్ కార్యకర్తల భావజాలం మనకు స్ఫూర్తిదాయకం.

మన పని మనం చేసుకొంటూ వెళ్దాం
2024 సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు అఖండ విజయాన్ని అందించారు. కూటమి ప్రభుత్వానికి 164 స్థానాలు, 21 ఎంపీ స్థానాల్లో భారీ మెజార్టీలతో గెలిపించారు. వాళ్ల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన సాగుతుంది. నియోజకవర్గంలో మన పని మనం చేసుకుంటూ వెళితే ఎటువంటి సమస్యలు ఉండవు. కూటమి స్ఫూర్తిని బలంగా నిలబెట్టాలి. రాష్ట్ర భవిష్యత్తు, అభివృద్ధికి కూటమి అవసరం ఉంది” అన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

యల్.బి.ఆర్.సి.ఈ లో ఐదవ రోజు అంతర్-రాష్ట్ర యువజన మార్పిడి కార్యక్రమం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించుచున్న, మై …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *