-విశ్వవిద్యాలయాలకు గవర్నర్ ఆదేశం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలోని కొన్ని విశ్వవిద్యాలయాలు నిబంధనల మేరకు క్రమబద్దంగా స్నాతకోత్సవాలు నిర్వహించకపోవడంపై ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషన్ హారిచందన్ ఆందోళన వ్యక్తం చేసారు. నియమబద్ధంగా స్నాతకోత్సవ కార్యక్రమాలు నిర్వహించకపోవడం వల్ల విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందన్నారు. కోవిడ్ మహమ్మారికి ముందు, 3-4 సంవత్సరాలకు ఒకసారి సమావేశాలు నిర్వహించటం గమనించానన్నారు. అయితే ఇప్పటికే రాజ్ భవన్‌లో జరిగిన ఉపకులపతుల సదస్సుల సందర్భంగా స్నాతకోత్సవాలు ప్రతి సంవత్సరం నిర్వహించి విద్యార్థులకు డిగ్రీలను అందించాలని గవర్నర్ ఆదేశించారు. దీనిని అమలు చేసేందుకు ఉన్నత విద్యా మండలి చొరవ చూపాలని మండలి చైర్మన్ హేమచంద్రారెడ్డికి సైతం స్పష్టత ఇచ్చారు. కోవిడ్ పరిస్థితులు నెమ్మదించిన తరువాత, కొన్ని రాష్ట్ర విశ్వవిద్యాలయాలు స్నాతకోత్సవాలు నిర్వహించినప్పటికీ, అనేక విశ్వవిద్యాలయాలకు సంబంధించిన కార్యక్రమాలు ఇప్పటికీ అలాగే ఉన్నాయి. దీంతో విద్యార్థుల కెరీర్‌పై ఎలాంటి ప్రభావం పడకుండా షెడ్యూల్ ప్రకారం తమ విశ్వవిద్యాలయాల స్నాతకోత్సవాలు నిర్వహించాలని విశ్వవిద్యాలయాల ఉప కులపతులను కులపతి హోదాలో గవర్నర్ ఆదేశించారు. కరోనా పరిస్థితి కారణంగా స్నాతకోత్సవాలు నిర్వహించేటప్పుడు నిర్దేశిత ప్రోటోకాల్‌లను తప్పనిసరిగా పాటించాలని గవర్నర్ స్పష్టం చేశారు. కోవిడ్ కారణంగా భౌతిక సమ్మేళనాలను అనుమతించకపోతే సాధ్యమైనంత వరకు వర్చువల్ మోడ్‌లో నిర్వహించాలని గవర్నర్ చెప్పారు. ఈ మేరకు రాజ్ భవన్ నుండి గవర్నర్ వారి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్పీ సిసోడియా ఒక ప్రకటన విడుదల చేశారు.