Breaking News

రెవెన్యూ సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి… : జిల్లా కలెక్టర్

-కలెక్టరేట్ లో రెవెన్యూ అధికారుల సమీక్షా సమావేశం నిర్వహణ

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో నెలకొన్న పలు రెవిన్యూ సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టి పరిష్కారానికి కృషి చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు.

బుధవారం ఆయన కలెక్టరేట్లోని పిజిఆర్ఎస్ సమావేశపు మందిరంలో జాయింట్ కలెక్టర్ ఎం నవీన్, సహాయ కలెక్టర్ ఫర్హీన్ జాహిద్, జిల్లా రెవెన్యూ అధికారి కే చంద్రశేఖరరావు, కే ఆర్ ఆర్ సీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శ్రీదేవితో కలిసి రెవెన్యూ అధికారుల సమీక్షా సమావేశం నిర్వహించారు.

సమావేశంలో ప్రధానంగా ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న వివిధ సేవలపై సానుకూల ప్రజా దృక్పథం (ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్ – ఐవిఆర్ఎస్) నివేదిక, ప్రజా సమస్యల పరిష్కార వేదిక అర్జీలు, భూమి పరాయీకరణ, భూసేకరణ సమస్యలు, అందరికీ ఇళ్ళు, శ్మశాన వాటికలు, వాట్స్ యాప్ సూచనలు, కోర్టు కేసులు, సీనియర్ సిటిజన్స్ కేసులు, ధాన్యం సేకరణ, స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ, రీసర్వే పురోగతి, ప్రభుత్వ ఉద్యోగుల హెల్త్ కార్డులు, ఉద్యోగుల ఫిర్యాదులు (గ్రీవెన్స్), ఐ గాట్ కర్మయోగి, బ్యాంకు ఖాతాలకు రాష్ట్ర ప్రభుత్వ జీత ప్యాకేజీ అప్డేట్ తదితర అంశాలపై ఉదయం నుంచి సాయంత్రం వరకు రెండు సెషన్ లుగా సుదీర్ఘంగా చర్చించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ తహసిల్దార్లు వారి మండల పరిధిలో అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. అందరికీ ఇళ్లు కార్యక్రమంలో భాగంగా, రాష్ట్ర ప్రభుత్వం గ్రామాలలో మూడు సెంట్లు, పట్టణ ప్రాంతాలలో రెండు సెంట్ల ఇళ్ల స్థలాలు మంజూరు చేస్తున్న నేపథ్యంలో అర్హత గల లబ్ధిదారులను గుర్తించి ప్రభుత్వం రూపొందించిన నిబంధనల ప్రకారం ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలన్నారు. తాసిల్దారులు వారి వీఆర్వోలు, సర్వేయర్లతో కలిసి ప్రస్తుతం జిల్లాలో ఉన్న లేఔట్లను క్షేత్రస్థాయిలో సందర్శించి ఖాళీలను గుర్తించాలన్నారు.

పొలాలు, ఇళ్ల స్థలాలకు సర్వే చేయాలని అర్జీ పెట్టుకున్న దరఖాస్తుదారుల విషయంలో నిర్లక్ష్యం సరికాదని సర్వేయర్లకు సూచించారు. సర్వే చేసిన అనంతరం రాష్ట్ర స్థాయిలో లబ్ధిదారులకు ఫోన్ లో ఐవిఆర్ఎస్ ద్వారా.. సర్వేయర్లు వచ్చి మీ భూమికి సర్వే చేశారా, సర్వేకు ముందు నోటీసు ద్వారా లేదా ఫోన్ ద్వారా తెలియజేశారా లేదా, సర్వే సమయంలో సిబ్బంది డబ్బులు డిమాండ్ చేశారా వంటి విషయాలపై అభిప్రాయాలు తెలుసుకొని అర్జీదారులు ఇచ్చే సమాధానం ఆధారంగా జిల్లాకు ర్యాంకులు కేటాయిస్తున్నారన్నారు. ఈ విషయంలో సర్యేయర్లు జాగ్రత్తగా ఉండాలని, ఎలాంటి అవకతవకలకు తావు ఉండకూడదని ఈ సందర్భంగా కలెక్టర్ హెచ్చరించారు.

మీకోసం అర్జీలు పరిష్కరించడంపై అధికారులు అవగాహన కలిగి ఉండాలన్నారు. అర్జీదారునికి ఎండార్స్మెంట్ బాగానే చేస్తున్నప్పటికీ ఆన్లైన్లో అప్లోడ్ చేసే సమయంలో సరియైన ఆప్షన్ను ఎంచుకొని సమర్పించడం లేదని, దీనివల్ల దరఖాస్తు తిరిగి రీఓపెన్ అవుతుందన్నారు. అర్జీను పూర్తిగా పరిష్కరిస్తేనే ఆన్లైన్ పోర్టల్ లో సిటిజన్ బెనిఫిటెడ్ అనే ఆప్షన్ ను ఎంచుకొని సమర్పించాలన్నారు. అలా కాకుండా సమస్య రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉంటే గనక సిటిజెన్ యెట్ టు బి బెనిఫిటెడ్ అనే ఆప్షన్ను ఎంచుకొని సమర్పించాల్సి ఉంటుందని, తప్పులు పునరావృతం కాకుండా ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు.

జిల్లాలో ధాన్యం సేకరణ అత్యంత ప్రాధాన్యత అంశమని, గత ఏడాది ఖరీఫ్ సీజన్లో కొన్ని ఇబ్బందులు పడ్డామని గుర్తు చేస్తూ, ఈసారి అలాంటి పొరపాట్లకు అవకాశం ఇవ్వకుండా ముందుగానే అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు. ముఖ్యంగా తగినన్ని గోనె సంచులు సిద్ధం చేసుకోవడం, రవాణ వాహనాలను సమకూర్చుకోవడం పక్కాగా ఉండాలన్నారు. జీపీఎస్ వ్యవస్థ కలిగిన వాహనాల రిజిస్ట్రేషన్ త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. రైతుల సౌకర్యార్థం ధాన్యం సేకరణకు సంబంధించిన అధికారుల ఫోన్ నంబర్లను మిల్లులతో పాటు ఆర్ ఎస్ కె ల వద్ద ప్రదర్శనగా ఉంచాలని సూచించారు.

ప్రస్తుతం జిల్లాలో 312 రైతు సేవా కేంద్రాల (ఆర్ ఎస్ కె) ద్వారా ధాన్యం కొనుగోలు జరుగుతుందని, సుమారుగా 8 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వచ్చే అవకాశం ఉందని, 99 శాతం ఈ పంట నమోదు పూర్తయినట్లు జాయింట్ కలెక్టర్ తెలిపారు.

లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ పూర్తి చేయాలన్నారు. ప్రస్తుతం జిల్లాలో 5,17,835 కార్డులకు 4,75,549 కార్డులు పంపిణీ చేశారని, మిగిలిన 42,286 కార్డుల పంపిణీ తరితగతిన పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ సంబంధిత అధికారులకు సూచించారు.

ప్రభుత్వ ఉద్యోగులు తమ బ్యాంకు ఖాతాలను రాష్ట్ర ప్రభుత్వ జీత ప్యాకేజీకు అప్డేట్ చేయించుకోవాలని, దీనివల్ల ఉచిత బీమా వంటి ఎన్నో వ్యక్తిగత ప్రయోజనాలు పొందవచ్చన్నారు. ఇంకా 119 మంది ఉద్యోగులు చేసుకోవాల్సి ఉందని, మిగిలిన వారు కూడా సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. అదేవిధంగా ఉద్యోగుల ఆరోగ్య పథకం (ఈహెచ్ఎస్)లో ప్రతి ఒక్కరూ నమోదు చేసుకోవాలని, కార్డులు డౌన్లోడ్ చేసుకోనివారు ఇంకా 125 మంది ఉద్యోగులు ఉన్నారని, అనుకోని పరిస్థితుల్లో ఇది ఎంతో అక్కరకొస్తుందని గుర్తు చేశారు.

జిల్లాలో జరుగుతున్న 3వ దశ రీసర్వే త్వరితగతిన పూర్తి చేయాలని సూచిస్తూ క్షేత్ర స్థాయిలోని సమస్యలపై ఆరా తీశారు. గ్రౌండ్ ట్రూతింగ్, గ్రౌండ్ వాలిడేషన్, 13వ నోటిఫికేషన్ జారీ చేయడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, అవసరంమేరకు అదనపు సిబ్బందిని డిప్యూటేషన్ పద్ధతిలో నియమించుకోవాలని జాయింట్ కలెక్టర్ సంబంధిత అధికారులకు సూచించారు.

సమావేశంలో మచిలీపట్నం, గుడివాడ, ఉయ్యూరు ఆర్డీవోలు కే స్వాతి, జి బాలసుబ్రమణ్యం, బిఎస్ హేలా షారోన్, సర్వే ఏడి జోషిలా, విజిలెన్స్ డిప్యూటీ కలెక్టర్ ఇంచార్జ్ జిల్లా గృహ నిర్మాణ సంస్థ అధికారి పోతురాజు, డీఎస్ఓ జి మోహన్ రావు, పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ టి శివరాం ప్రసాద్, తదితర శాఖల జిల్లా అధికారులు, తహసిల్దార్లు, డిప్యూటీ తహసిల్దార్లు, సర్వేయర్లు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

యల్.బి.ఆర్.సి.ఈ లో ఐదవ రోజు అంతర్-రాష్ట్ర యువజన మార్పిడి కార్యక్రమం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించుచున్న, మై …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *