– ప్రయోగాత్మకంగా వెజిటబుల్ ఏటీఎం, కిచెన్ గార్డెన్ల ఏర్పాటు
– జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ వినూత్న ఆలోచన
– ఏ.కొండూరు మండలంలో పర్యటన
– కృష్ణారావు పాలెం గురుకులం, ఏ.కొండూరు ధాన్యం సేకరణ కేంద్రం పరిశీలన
– ధాన్యం సేకరణ షెడ్యూల్ కు 7337559375 వాట్సాప్ నెంబర్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
గురుకుల విద్యార్థుల కు పోషకాలతో కూడిన ఆహారం అందించడానికి, పంట ద్వారా ఆదాయం ఆర్జించడానికి కిచెన్ గార్డెన్, వెజిటబుల్ ఎటిఎం దోహదం చేస్తాయని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ అన్నారు. గురువారం ఏ. కొండూరు మండలంలో కలెక్టర్ పర్యటించారు. కృష్ణారావు పాలెం లోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకులం, రామన్నపాలెంలో ప్రకృతి వ్యవసాయ పొలాలు, ఏ.కొండూరులో రైస్ మిల్లు, ధాన్యం సేకరణ కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ మాట్లాడుతూ…. జిల్లాలోని 12 గురుకులాలలో ఏడు గురుకులాలను ప్రకృతి సాగుకు అనుకూలమని గుర్తించామని, వీటిలో నాలుగు గురుకులాల్లో ప్రకృతి సాగు ప్రారంభించామని చెప్పారు. దుంప జాతులు, తీగ జాతులు, ఆకుకూరలు సహా 22 రకాల కూరగాయలను సహజ సిద్ధంగా పెంచుతున్నామన్నారు. తెగుళ్ల నివారణకు ద్రవ జీవామృతం, ఘనజీవామృతం వాడుతున్నామని, రసాయన మందులు లేకుండా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నామని తెలిపారు. గురుకుల విద్యార్థులకు అవసరమైన, పోషక విలువలతో కూడిన కూరగాయలు లభించడమే కాక వీటి ద్వారా ఆదాయాన్ని కూడా ఆర్జించవచ్చని తెలిపారు. మొదటి నెలలో పాలకూర, రెండవ నెలలో తోటకూర, మూడవ నెలలో మిరప వంగ, బెండ, నాలుగవ నెలలో క్యారెట్.. ఇలా ఒక్కో నెలలో ఒక్కో పంటతో ఆదాయం పొందే వెజిటబుల్ ఎటిఎం విధానం అమలు చేస్తున్నామన్నారు. ఈ ప్రకృతి సాగులో విద్యార్థులను కూడా భాగస్వాముల్ని చేస్తున్నామని తద్వారా వారికి సాగు పద్ధతులు, పోషకాలపై అవగాహన వస్తుందన్నారు. విద్యార్థిను ల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించి ఐరన్ అధికంగా ఉండే మునగ, బొప్పాయి కూడా సాగు చేస్తున్నామన్నారు. ఏ. కొండూరులో రైస్ మిల్లును పరిశీలించి రైతు సేవ కేంద్రాలకు సకాలంలో గోనె సంచులు పంపాలని ఆదేశించారు. రామన్నపాలెంలో ప్రకృతి వ్యవసాయ పద్ధతులతో దాదాపు 30 రకాల పప్పుధాన్యాలు, తృణధాన్యాలు, సుగంధ ద్రవ్యాలు, దుంప, తీగ జాతులను పండిస్తున్న కే. ప్రశాంత్ అనే రైతు పొలాన్ని పరిశీలించారు. ప్రధాన పంట ఖర్చును అంతర పంటల ద్వారా పొందే విధానాన్ని, ఉత్పత్తులను మార్కెటింగ్ చేస్తున్న తీరును అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఏ. కొండూరులో వరి ధాన్య సేకరణ కేంద్రాన్ని పరిశీలించారు. ధాన్యం సేకరణ షెడ్యూల్ ను వాట్సాప్ ద్వారా పొందవచ్చని తెలిపారు. 7337559375 నెంబర్ కు ఈ క్రాప్ లో నమోదైన రైతు ఆధార్ నెంబర్ పంపితే, శాంపిల్ టెస్టింగ్, సేకరణ తేదీ సమాచారాన్ని వాట్సాప్ ద్వారా తెలియజేస్తామన్నారు. వాట్సప్ లేని రైతులు వ్యవసాయ సహాయకుల ద్వారా ఈ సమాచారం పొందవచ్చని చెప్పారు. ధాన్యం కొనుగోలుకు సంబంధించిన సమాచారం కోసం 1967 టోల్ ఫ్రీ నెంబర్ ను లేదా జిల్లా కంట్రోల్ రూమ్ నెంబర్ 7702003571ను సంప్రదించవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో తిరువూరు ఆర్డిఓ కే. మాధురి, ఏపీ సీఎన్ఎఫ్ జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ వై.శంకర్ నాయక్, తహసిల్దార్ కె. లక్ష్మి, డిఎంఎం నాగేశ్వరమ్మ పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News