విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పరిషత్ ఎన్నికల ఫలితాల వెలువడనున్న నేపథ్యంలో ప్రజల దృష్టిని మరల్చేందుకే చంద్రబాబు వికృత రాజకీయానికి తెర తీశారని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. గుడ్ మార్నింగ్ విజయవాడ సెంట్రల్ కార్యక్రమంలో భాగంగా వాంబే కాలనీలోని డి బ్లాక్ లో ఆయన పర్యటించారు, ప్రజా సమస్యలపై ఆరా తీశారు. పారిశుద్ధ్యంపై అధిక ఫిర్యాదులు అందటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాలువలలో ఎప్పటికప్పుడు పూడిక తీయించి.. మురుగు పారే విధంగా చూడాలన్నారు. దోమల సమస్య ఎక్కడా ఉండకూడదన్నారు. ఒరిగిన విద్యుత్ స్తంభాలు ప్రమాదకరమని.. తక్షణమే వాటిని తొలగించాలని ఆదేశించారు. అనంతరం స్థానిక మున్సిపల్ స్కూల్ ను సందర్శించారు. పాఠశాలలో నిలిచిన నిర్మాణాలను.. 14వ ఆర్థిక సంఘం నిధులతో పూర్తి చేయించవలసిందిగా అధికారులకు సూచించారు. ప్రధాన రహదారులలో బీటీ రోడ్లు వేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయవలసిందిగా పేర్కొన్నారు. మరోవైపు డివిజన్ లో రూ. 20 కోట్ల 15వ ఆర్థిక సంఘం నిధులతో.. రోడ్లు, తాగునీటి పనులకు త్వరలోనే టెండర్లు ఆహ్వానించబోతున్నట్లు తెలియజేశారు. వాంబే కాలనీలో ఇళ్ల రిజిస్ట్రేషన్ల సమస్య శాశ్వత పరిష్కారానికి.. ఈ నెల 27, 28, 29 తేదీలలో స్థానిక కమ్యూనిటీ హాల్లో రిజిస్ట్రేషన్ మేళా నిర్వహించి ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తామని మల్లాది విష్ణు తెలియజేశారు. ఈ అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగపరచుకోవాలన్నారు. అనంతరం శాసనసభ్యులు మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు సహించలేక ధర్నాకు సిద్ధమైన ఒక బీసీ ఎమ్మెల్యేపై తెలుగుదేశం నేతలు దాడికి తెగబడటం బాధాకరమన్నారు. జోగి రమేష్‌కు ఏమైనా అయితే ఎవరు బాధ్యులని ప్రశ్నించారు. కరకట్ట వద్దకు రౌడీలను తీసుకువచ్చి చంద్రబాబు హింసను ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు. గతంలో మాచర్లలో గొడవకు వెళ్లిన వారే.. ఉండవల్లిలోనూ దాడికి పాల్పడ్డారని పేర్కొన్నారు. వ్యవస్థలపై కనీసం గౌరవం లేని తెలుగుదేశం పార్టీ నేతలు.. ఏ ముఖం పెట్టుకుని గవర్నర్ ను కలుస్తున్నారని మల్లాది విష్ణు ప్రశ్నించారు. రాష్ట్రంలో టీడీపీ పూర్తిగా ఉనికిని కోల్పోయిందని.. చంద్రబాబు రాజకీయంగా సమాధి అయ్యారని ఎద్దేవా చేశారు. రేపు పరిషత్ ఎన్నికల ఫలితాలు రాబోతుండటంతో.. ఎలాగూ పరాభవం తప్పదని ముందుగానే గ్రహించి ప్రజల దృష్టి మళ్లించేందుకు ఇటువంటి దాడులకు పాల్పడుతున్నారన్నారు. ప్రభుత్వానికి మంచి పేరు వచ్చినప్పుడల్లా.. అంశాన్ని పక్కదారి పట్టించేందుకు యత్నించడం చంద్రబాబుకు షరా మాములైందన్నారు. చివరకు డీజీపీ కార్యాలయం వద్ద కూడా దౌర్జన్యం చేసేందుకు వెళ్లటం.. పోలీసు వ్యవస్థను కించపర్చే విధంగా టీడీపీ నాయకులు మాట్లాడిన మాటలు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయన్నారు. ఇప్పటికైనా చంద్రబాబు, అతని రౌడీమూక పద్దతి మార్చుకోకపోతే ప్రజలు మిమ్మల్ని రాష్ట్రంలో తిరగనివ్వబోరని హెచ్చరించారు. కార్యక్రమంలో జోనల్ కమిషనర్ రాజు, ఈఈ శ్రీనివాస్, వైఎస్సార్ సీపీ నాయకులు బత్తుల దుర్గారావు, నాని, కుమారి, గోపి, బలగా శ్రీను, మారి, కిరణ్, వీఎంసీ అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.