విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రతిపక్షనేత చంద్రబాబు దుష్ట రాజకీయాల నుంచి రాష్ట్రాన్ని కాపాడమని విఘ్నేశ్వరుని ఎమ్మెల్యే మల్లాది విష్ణు వేడుకున్నారు. బావాజీపేట, ప్రకాష్ నగర్ సెంటర్, గుణదలలో జరిగిన తొమ్మిదో రోజు చవితి వేడుకలలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు పాల్గొని భక్తులకు అన్న ప్రసాద వితరణ చేశారు. తిరుగులేని నాయకత్వ పటిమ కలిగిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉన్నారని శాసనసభ్యులు పేర్కొన్నారు. అది చూసి ఓర్వలేక చంద్రబాబు ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతూ సమాజ విచ్ఛిన్నానికి కుట్రలు పన్నుతున్నారన్నారు. రానురాను తెలుగుదేశం నాయకులు కరోనా వైరస్ కన్నా ప్రమాదకరంగా తయారవుతున్నారని తెలిపారు. టీడీపీ నాయకులు దురాగతాల నుంచి, చంద్రబాబు దుష్ట రాజకీయాల నుంచి రాష్ట్ర ప్రజలను కాపాడాలని వినాయకుడిని వేడుకున్నారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు ఎటువంటి విఘ్నాలు కలుగకుండా చూడాలని గణనాథున్ని ప్రార్థించారు. కార్యక్రమంలో ఆయా డివిజన్ల కార్పొరేటర్లు, డివిజన్ ఇంఛార్జిలు, వైఎస్సార్ సీపీ శ్రేణులు పాల్గొన్నారు.